తంబాకు కోసం హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
ABN , Publish Date - Feb 14 , 2024 | 12:33 AM
తంబాకు ఇవ్వలేదని తోటి వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు, జరిమానా విధించింది.
మిర్యాలగూడ లీగల్, ఫిబ్రవరి 13 : తంబాకు ఇవ్వలేదని తోటి వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు, జరిమానా విధించింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఓంప్రకాశగుప్తాపై హత్యా నేరం రుజువు కావడంతో జీవితఖైదు, రూ.500 జరిమానా విధిస్తూ మిర్యాలగూడ ఐదవ అదనపు జిల్లా సెషన్స జడ్జి జీ వేణు మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో యాష్ ప్లాంట్ నిర్మాణానికి బెకం కంపెనీ బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 300 మంది కార్మికులను పనుల్లోకి తీసుకుంది. వీరిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రఘునందనరామ్ కార్పెంటర్‌గా, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓంప్రకాశగుప్తా హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. మద్యానికి, ఖైనీ(తంబాకు)కు బానిసైన ఓంప్రకాశగుప్తా విధులకు సక్రమంగా హాజరు కాకపోయేవాడు. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 24న మధ్యాహ్నం ప్లాంట్ సమీపంలో ఉన్న రఘునందనరామ్ దగ్గర ఖైనీ(తంబాకు) ప్యాకెట్ ఉన్నది చూసి కొద్దిగా ఖైనీ ఇవ్వమని ఓంప్రకాశగుప్తా అడిగాడు. దీంతో రఘునందనరామ్ ఇవ్వనంటూ బూతులు తిడుతూ ప్లాంట్ వైపు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓంప్రకాశగుప్తా కోపంతో పక్కనే ఉన్న బండరాయితో అతడి తలపైన కొట్టి చంపాడు. ఘటనపై జనరల్ మేనేజర్ బండారు రంగనాథ్ ఫిర్యాదు మేరకు అప్పటి వాడపల్లి హెడ్‌కానిస్టేబుల్ అహ్మద్ హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, అప్పటి మిర్యాలగూడ రూరల్ సీఐ ఎం.సత్యనారాయణ దర్యాప్తు పూర్తి చేసి నిందితుడు ఓంప్రకాశగుప్తాను హత్యానేరం కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచాడు. 12మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఓంప్రకాశగుప్తాకు జీవతఖైదు, జరిమానా విధించింది.
జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడు ఓంప్రకాశగుప్తా జ్యుడిషియల్ రిమాండ్‌లోనే ఉన్నందున శిక్షా కాలంలో కస్టడీ కాలాన్ని మినహాయించాలని న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. ప్రాసిక్యూషన తరుపున అడిషనల్ పీపీ మన్నెం మనోహర్‌రెడ్డి కేసు వాదించారు. ప్రాసిక్యూషనకు వాడపల్లి కోర్టు కానిస్టేబుల్ ఎంఏ యూనిస్, కోర్టు లైజన అధికారి సైదులు సహకరించారు.