Share News

డబుల్‌ రైల్వేలైన్‌తో మహర్దశ

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:32 AM

పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతు న్న దామరచర్ల మండలానికి డబుల్‌ రైల్వేలైన్‌ నిర్మాణంతో మహర్దశ కలగనుంది.

డబుల్‌ రైల్వేలైన్‌తో మహర్దశ

మోటమర్రి-విష్ణుపురం డబ్లింగ్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

దామరచర్ల,ఫిబ్రవరి 9: పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతు న్న దామరచర్ల మండలానికి డబుల్‌ రైల్వేలైన్‌ నిర్మాణంతో మహర్దశ కలగనుంది. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భేటీ అయిన ఆర్థికవ్యవహారాల కమిటీ మోటమర్రి-విష్ణుపురం డబ్లింగ్‌కు కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు ప్రధానంగా ఖమ్మం జిల్లా మోటమర్రి రైల్వేజంక్షన్‌ నుంచి మండలంలోని విష్ణుపురం రైల్వేస్టేషన్‌ వ రకు 88.81కి.మీమేర డబుల్‌ రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

రైల్వే లైన్‌ పూర్తయితే పెరగనున్న రద్దీ

డబుల్‌ రైల్వే లైన్‌ నిర్మాణంతో స్థానిక రైల్వే స్టేషన్‌ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఖాజీపేట-విజయవాడ, సికింద్రాబాద్‌-గుంటూరు రైలు మార్గాలను మోటమర్రి-విష్ణుపు రం మార్గాలు అనుసంధానంగా ఉంటాయి. ఈ డబుల్‌ లైన్‌ నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లోని 90మండలాలకు చెందిన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే స్థానిక రైల్వేస్టేషన్‌ మీదుగా స్థానిక పరిశ్రమల నుంచి భారీ స్థాయిలో సరుకు రవాణా జరుగుతోంది. ప్రధానంగా యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమ నిర్మాణం పూర్తయితే 12.29మిలియన్‌ టన్నుల బొగ్గును వినియోగించనున్నారు. ఎక్కువ భాగం బొగ్గును సింగరేణి నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రతీ రోజు 14గూడ్స్‌ రైళ్లను వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేలైన్‌ డబ్లింగ్‌తో ప్రయోజనం కలగనుంది.

రైల్వేస్టేషన్‌ను పునరుద్ధరించాలి

మండల కేంద్రంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పక్కనే ఉన్న దామరచర్ల రైల్వేస్టేషన్‌ను 1988లో ప్రారంభించగా, ప్రయాణికులు లేరనే కారణంతో 1994లో దీన్ని రైల్వేశాఖ మూసివేసింది. దీంతో మండల కేంద్రం నుంచి సుమారు 2కి.మీ దూరంలోని విష్ణుపురం రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వెళ్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ను పునరుద్ధరిస్తే యాదాద్రి థర్మల్‌ పరిశ్రమతోపాటు స్థానికంగా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు రాకపోకలు కొనసాగించేందుకు వీలుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 10 , 2024 | 12:32 AM