విద్యారంగంలో పలు మార్పులు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:08 AM
విద్యారంగానికి 2024 కాస్త కలిసివచ్చింది. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మినహా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విద్యారంగం కాస్త గాడిలో పడింది. 2024-25 విద్యా సంవత్సరంలో జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందాయి.
ఉపాధ్యాయ నియామకాలతో పాఠశాలల బలోపేతం
సకాలంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నూతన విద్యావిధానానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.260కోట్లు
టోకెన్లు ఇచ్చి 12నెలలైనా అందని వైనం
(ఆంధ్రజ్యోతి,కోదాడ): విద్యారంగానికి 2024 కాస్త కలిసివచ్చింది. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మినహా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విద్యారంగం కాస్త గాడిలో పడింది. 2024-25 విద్యా సంవత్సరంలో జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులు సెప్టెంబరు నాటికే ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించింది. విద్యార్థుల మెస్, కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం 40శాతం పెంచింది.
ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిచేయడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తగ్గింది. అంతేగాక ప్రతీ మండలానికి ఇన్‌చార్జీ ఎంఈవోలను నియమించడంతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు చెల్లించిం ది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉండటం, కేంద్ర ప్రభు త్వం వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్ పాలసీకి సహకరించాలని ఇటీవల జరిగిన జాతీయ విద్యా సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో పాఠశాల విద్యకు నిధులు అధికంగా వచ్చే అవకాశం ఏర్పడింది. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. గత విద్యా సంవత్సరంతో పోల్చితే నవంబరులోనే డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తికాగా, మార్చిలో రెండో సెమిస్టర్‌కు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు పూర్తికాగా, మార్చిలో జరిగే వార్షిక, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పరీక్షలకు మరో 100రోజుల సమ యం ఉండటంతో ఉత్తమ ఫలితాలు సాధనకు లక్ష్య పథకంలో భాగంగా ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు.
దోస్త్‌తో డిగ్రీలో పూర్తిస్థాయిలో నిండని సీట్లు
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో 62 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కాగా, 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 30వేల సీట్లు ఉన్నాయి. కాగా, 2024-25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు సుమారు 6వేల మంది మాత్రమే. 12 కళాశాలలు జీరో అడ్మిషన్లకు పరిమితమయ్యాయి. 30 కళాశాలల్లో కేవలం 30మంది మాత్రమే చేరారు. ఇదిలా ఉంటే గత విద్యా సంవత్సరంలో సెమిస్టర్ పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తికాగా, విద్యార్థులు రెండో సెమిస్టర్‌కు సిద్ధం అవుతున్నారు. మరో వైపు మొదటి సంవత్సరం ఇంటర్, డిగ్రీలో చేరిన విద్యార్థులు సకాలంలో ఉప కారవేతనాలకు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం, ఈ ప్రక్రియ పూర్తి కావడంతో పెండింగ్‌కు అవకాశం లేకుండా పోయింది.
రూ.260కోట్లు ఫీజు బకాయి
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో 62 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 12 కళాశాలలు జీరో అడ్మిషన్లుగా మిగిలాయి. ఉమ్మడి జిల్లాలో 16 ఇంజనీరింగ్, 62 డిగ్రీ కళాశాలు ఉండగా, వాటిలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలు కాగా, 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలకు నాలుగేళ్లుగా సుమారు రూ.260కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. బకాయిలకు సంబంధించి ప్రభుత్వం 12నెలల క్రితం టోకెన్లు ఇచ్చినా నేటికీ ఆ సొమ్ము కళాశాలల యాజమాన్యాలకు అందలేదు. బకాయిలు విడుదల చేయాలని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే రెండుసార్లు కళాశాలల బంద్ నిర్వహించాయి. ఆ సందర్భంలో బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ అమలుకాకపోవడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోక వైపు దోస్త్ (తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీ్‌స)తో డిగ్రీలో గత ఏడాదితో పోల్చితే అడ్మిషన్లు తగ్గడం ఆందోళన కలిగించే అంశం.
ఎంఈవోల నియామకం
గత విద్యా సంవత్సరం వరకు మూడు నుంచి నాలుగు మండలాలకు ఒక ఎంఈవో ఉండేవారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం బలోపేతాని కి, జవాబుదారీతనం పెంచేందుకు ప్రతీ మండలానికి ఒక ఎంఈవో ను నియమించింది. దీంతో ప్రభు త్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెరగటంతోపాటు, పాలనాపరంగా మార్పు వచ్చినట్లయింది.
ఉమ్మడి జిల్లాలో 3,731 ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో 3,731 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 2,039 పాఠశాలలు, యాదాద్రి జిల్లాలో 712 పాఠశాలలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 690 పీఎస్, 80 యూపీఎస్, 210 జడ్పీహెచ్‌ఎస్, మొత్తంగా 980పాఠశాలలు ఉన్నాయి. 53 కస్తూర్బా, ఇతర గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 4.50లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. అంతేగాక విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందడంతో చదువుకు ఆటంకం తొలగినట్టయింది.
మారనున్న ఎస్‌ఎ్‌ససీ బోర్డు
విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంది. వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్‌లో భాగంగా కేంద్రం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ప్రీప్రైమరీ, 3 నుంచి 8వ తరగతి వరకు మాధ్యమిక విద్య, 9నుంచి ఇంటర్ సెంకడ్ ఇయర్ వరకు హైస్కూల్ లేదంటే ప్లస్ టూ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే అమలుచేస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో సైతం నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాలకు సూచించింది. లేదంటే నిధులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో 2025 విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధనం అమలుకానుంది. ఫలితంగా ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న ఎస్‌ఎ్‌ససీ బోర్డు కొత్త విద్యా సంవత్సరంలో ఉండకపోవచ్చని విద్యానిపుణులు చెబుతున్నారు.
ఆందోళనపరుస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
ఉమ్మడి జిల్లాలో 16 ఇంజనీరింగ్, 62 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.260కోట్లు రావాల్సి ఉంది. టోకెన్లు ఇచ్చి 12నెలలు అయినా నేటికీ బకాయిలు అందకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలు విడుదల చేయకపోతే కళాశాలలను నిర్వహించలేమని ఇప్పటికే రెండుమార్లు యాజమాన్యాలు బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం కళాశాలల నిర్వాహకులను చర్చలకు పిలిచి వారితో చర్చించింది. అయినా నేటికీ బకాయిలు విడుదలకాకపోవడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంవత్సరం పూర్తయ్యేనాటికైనా బకాయిలు విడుదల చేయాలని కళాశాలల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.