మాన్యం భూమి మాయం
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:36 AM
జిల్లాలో భారీగా దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
జిల్లాలో అధికారికంగా కబ్జాకోరల్లో 1,506 ఎకరాలు
కౌలు ఇవ్వకుండా సాగు చేసుకుంటున్న ఆక్రమణదారులు
జిల్లాలో భారీగా దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 7,332 ఎకరాల భూమికి గాను 1,506 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆయా భూములను ఆక్రమణదారులు సాగు చేస్తుండగా, కనీసం దేవాదాయ శాఖకు కౌలు కూడా చెల్లించడం లేదు. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ దేవాలయానికి సంబంధించి రూ.15 కోట్లకు మేర కౌలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. కౌలు ఇవ్వకపోవడంతో పలు ఆలయాలకు భూములు ఉండి కూడా దూపదీప, నైవేద్యాలు కూడా కరువయ్యాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)
ఙజిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన దేవాలయాల సంఖ్య 146. ఈ దేవాలయాలకు అనుబంధంగా 7,332 ఎకరాల భూమి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా భూముల్లో 3,477 ఎకరాల భూమిని లీజ్‌కు ఇచ్చారు. ఆయా భూముల ద్వారా రూ.1.44 కోట్ల ఆదాయం వస్తుంది. 1,506 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దేవుడి మాన్యం భూములను చాలాఏళ్లుగా కొంతమంది సాగు చేస్తున్నారు. దేవాలయాల భూములు రిజిస్ట్రేషన చేయించడానికి అవకాశం లేదు. అయినా కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. చివ్వెంల మండలం ఉండ్రగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చెందిన 11ఎకరాల భూవివాదం అటవీ, దేవాదాయ శాఖల మధ్య నడుస్తోందన్నారు. దేవుడి భూములను కబ్జా చేసిన 9 మందిపై హైకోర్డులో, దేవాదాయ శాఖ ట్రిబ్యూనల్‌లో 12మందిపై కేసులు నడుస్తున్నాయి. దేవుడి మాన్యం భూముల ఆక్రమణ కేసులు ఒక్కటి కూడా రెవెన్యూ శాఖలో లేవని అసిస్టెంట్ కమిషనర్ సులోచన తెలిపారు. దేవుడి మాన్యం భూములను సాగు చేస్తున్న రైతులు ఏడాదికి రూ.3,500లు కౌలు చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అయినప్పటికీ చాలా మంది రైతులు చెల్లించిన దాఖలాలు లేవు.
ధూప, దీప, నైవేద్యాలు
ఆత్మకూరు(ఎస్) మండలం కందగట్ల గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 654 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను కోడూరు, కొమ్మాల, కందగట్ల, మంగలితండా, లోయపల్లి, తిమ్మాపురం, కోమటపల్లి గ్రామాలకు చెందిన రైతులు కబ్జా చేసి సాగు చేస్తున్నారు. ఈ భూముల మీదుగా ఎస్సారెస్పీ కాల్వ తవ్వడంతో దేవాదాయ శాఖకు ప్రభుత్వం అప్పట్లో కొంత పరిహారం చెల్లించింది. ఆ డబ్బులతోనే దేవాలయ అర్చకులకు ధూప, ధీప, నైవేద్యం కింద వేతనాలను చెల్లిస్తున్నారు. కబ్జా చేసుకుని
వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి అధికారులు కౌలు వసూలు చేయడంలేదు. కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నా దేవాలయానికి ఆదాయం ఒక్క పైసా కూడా రావడంలేదు. సన్నకారు రైతులే కాకుండా బడారైతులు సైతం దేవుడి మాన్యం భూములు కబ్జా చేశారు.
అర్వపల్లి మండలంలో...
అర్వపల్లి మండలంలోని శ్రీయోగానంద లక్ష్మీనృసింహస్వామి దేవాలయానికి సంబంధించిన దేవుడి మాన్యం భూములు సుమారు 750 ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూములన్నీ ఆ మండలంలోని కొన్ని గ్రామాలు, తండాలకు చెందిన వ్యక్తులు అన్యాక్రాంతం చేసుకుని సాగు చేస్తున్నారు. అయితే అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు నోటీసులు ఇచ్చి మౌనంగా ఉండిపోయారు. అయితే ఆయా భూముల సర్వే నెంబర్లను బయటకు వెల్లడించడానికి కూడా అధికారులు జంకుతున్నారు. భూములన్నీ ఇప్పటికే అన్యాక్రాంతం కావడంతో వాటిని తిరిగి తమ పరిధిలోని తీసుకురావడానికి అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు.
అర్వపల్లి మండలకేంద్రంలోని సర్వే నెంబరు 220 నుంచి 224 వరకు, 226 నుంచి 276 వరకు, 278 నుంచి 292 వరకు, 327 నుంచి 351 వరకు, 451 నుంచి 455 వరకు దేవుడి మాన్యం భూములు ఉన్నట్లు సమాచారం. ఈ భూములను కబ్జా చేసి సాగులో ఉన్న రైతులు నుంచి ధూప, దీప, నైవేద్యం కింద దేవుడి మాన్యం వసూలు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. చాలా ఏళ్లుగా కబ్జాలో ఉన్న కొంతమంది రైతులు ఆ భూములను విక్రయానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా జిల్లాలోని అనేక దేవాలయాల కింద 10 నుంచి 50 ఎకరాల దేవుని మాన్యం ఉండాల్సినవి కూడా ఉన్నాయి. వీటిని కూడా సమీపంలోని రైతులు ఆక్రమించుకొని సేద్యం చేసుకుంటున్నారు. కౌలు మాత్రం చెల్లించడం లేదు.
రూ. 15 కోట్లకుపైగా కౌలు బకాయి
హూజుర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలోని శ్రీ ఆదివరహాలక్ష్మీ నరసింహా వేణుగోపాలస్వామి దేవాలయానికి 560 ఎకరాలకు పైగా దేవుడి మాన్యం భూములు ఉన్నాయి. ఆయా భూములను కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. కౌలు చెల్లించడం లేదు. దాతాలు ఇచ్చే కానుకుల ద్వారానే ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. రైతుల నుంచి సుమారుగా రూ. 15కోట్లకు పైగా కౌలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
అనంతగిరిలో రూ.కోట్ల భూమి..
అనంతగిరి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని గ్రామంలో రామలింగేశ్వరస్వామి, శంభులింగేశ్వరస్వామి ఆలయాలకు చెందిన 40 ఎకరాల కు పైగా దేవుడి మాన్యం ఆక్రమణకు గురైంది. ఫలితం గా కనీసం ఆ ఆలయాల్లో దూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. కోదాడ పట్టణ సమీపంలోని రామిరెడ్డిపాలెం లో సైతం కోట్ల విలువైన దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. 100 ఎకరాల వరకు కబ్జా చేశారు. ఇక్కడ ఎకరం విలువ రూ. 50లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుం ది. ఈ దేవాలయాలకు చెందిన భూముల్లోనే ప్రభుత్వం కొంత భూమి ని ఇందిరమ్మ కాలనీ కోసం ఐదు ఎకరాలు, స్వాతంత్య్ర సమరయోధులకు సైతం కేటాయించారని, మరికొందరు భూమిని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల కొంతమంది తాము నిర్మించిన ఇళ్ళను కూడా సొంత భూముల వలే విక్రయించుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు యాజమాన్య హక్కులు పక్కాగా నిర్ధారించిన అనంతరం రిజిస్ట్రేషనకు తావులేకుండా జాబితా 22(1-సీ) రిజిస్టార్‌లో పొందుపర్చారు. కలెక్టర్‌ల అనుమతితో మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సికింద్రాబాద్ జిల్లాల దేవాదాయ శాఖ అధికారులు గెజిట్‌ను జారీ చేశారు. దీంతో దేవాదాయశాఖ భూములు రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉంటాయి.
కబ్జాదారులపై కేసులు వేస్తున్నాం
సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతంపై ట్రిబ్యునల్‌లో కేసులు ఫైల్ చేస్తున్నాం. వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గెజిట్‌పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
సులోచన, ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్