వైద్యం మహాప్రభో!
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:38 AM
యాదగిరిగుట్టలో వైద్యం అందని ద్రాక్షగానే మా రిందన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రనలుమూలల నుంచి యాదగిరీశుడి దర్శనానికి వేలాది మంది భక్తులు నిత్యం గుట్టకు వస్తుంటారు. ప్రాథమిక చికిత్స, వైద్యం కోసం దేవస్థానం ఆధ్వర్యంలో కొండకింద సింహద్వారం పక్కన ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. అలాగే యాదగిరిపల్లిలో ప్రభుత్వం పీహెచ్‌సీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
యాదగిరిగుట్టలో అందని ద్రాక్షగా వైద్యసేవలు
గుట్ట అభివృద్ధి పేరుతో ఆస్పత్రులు కనుమరుగు
ఇబ్బందులు పడుతున్న భక్తులు, స్థానికులు
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యో తి): యాదగిరిగుట్టలో వైద్యం అందని ద్రాక్షగానే మా రిందన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రనలుమూలల నుంచి యాదగిరీశుడి దర్శనానికి వేలాది మంది భక్తులు నిత్యం గుట్టకు వస్తుంటారు. ప్రాథమిక చికిత్స, వైద్యం కోసం దేవస్థానం ఆధ్వర్యంలో కొండకింద సింహద్వారం పక్కన ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. అలాగే యాదగిరిపల్లిలో ప్రభుత్వం పీహెచ్‌సీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా కొండపైన, కొండకింద ఆస్పత్రులు కన్పించకుండా పోయాయి. అయితే గుట్ట గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో కొండకింద దేవస్థానం ఆధ్వర్యంలో ఆస్ప త్రి ఏర్పాటు చేసి అటు భక్తులు, ఇటు స్థానికులకు వైద్యసేవలు అందించారు. అదేవిధంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక మెడికల్ ఆఫీసర్‌తో వైద్యసేవలు అందించారు. పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకుంటే దేవస్థానం ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు చేయించుకొనే వారు. అప్పట్లో గ్రామపంచాయతీ జనాభా సుమారు 8వేలలోపు ఉండగా, స్వామివారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య సుమారు 5వేల లోపు ఉండేది. దీంతో స్థానికులు, భక్తులకు వైద్యసేవలు అందించడం సులభంగా ఉండేది.
నిర్లక్ష్యానికి ప్రతీకగా..
యాదగిరిపల్లిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం కాస్త నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా మారింది. ప్రభుత్వ పరంగా ఉన్న ఏకైక వైద్య సహాయం అరకొరగా అందుతోంది. ప్రభుత్వ వైద్యులు స్థానికంగా ఉండక హైదరాబాద్ నుంచి ఉదయం 9గంటలకు వచ్చి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. వారు వెళ్లిన తర్వాత వైద్య సహాయం దాదాపు నిలిచిపోయినట్లే. వివిధ యాత్ర స్థలాలను దర్శించి వస్తున్న యాత్రికులకు, వాంతులు, విరేచనాలు, వంటి చిన్నచిన్న సమస్యతోపాటు గుండెపోటు వంటి సమస్యలు ఏర్పడితే ప్రాణం వదులుకోవాల్సిన పరిస్థితి.
స్థానికులు కూడా తమ వైద్యం కోసం జిల్లా కేంద్రం భువనగిరి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణకోసం కోట్లాది రూపాయాలను వెచ్చిస్తున్న ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. యాదగిరిపల్లి ఆస్పత్రిని 24 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామని గత పాలకు హామీ ఇచ్చారు. అయినా ఏఒక్కటీ నెరవేలేదు. అసంపూర్తిగా మి గిలిన పనుల స్థితిగతిపై సమీక్షించి గతపొరపాటు సరిదిద్దుకుంటూ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగాలని స్థానికులు కోరుతున్నారు. అ త్యవసరంగా వైద్యం అం దించే బాద్యతను అటు దేవస్థానం, ఇటు ప్రభుత్వం గుర్తించి కొండపైన, కొండదిగువన ఆస్పత్రుల నిర్వహణకు తిరిగి శ్రీకారం చుట్టాలని భక్తులు కోరుతున్నారు. అదే విధంగా సంపూర్ణ వైద్య సహాయం అందించేందుకు యాదగిరిపల్లి ఆస్పత్రిని ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తూ 24గంటల వైద్య సేవలు లభించే విధంగా వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలనే ఆశతో ఎదరుచూస్తున్నారు.
పీహెచ్‌సీలో అందించే సేవలు
గుట్ట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉన్నారు. సాధారణ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు ఇస్తారు. దీంతోపాటు యూరిన్, షుగర్, కిడ్నీలు, క్రియాటీన్ పరీక్షలు నిర్వహిస్తారు. టీబీ, కుష్టివ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందిస్తారు. సాధారణ ప్రసూతీ మాత్రమే నిర్వహించారు. ఎలాంటి అత్యవసరలు వైద్యసేవలు చేయడం లేదు. పీహెచ్‌సీలో ఉండాల్సిన వాటిలో ప్రధానంగా జనరేటర్, సమావేశ మందిరం, విద్యుత్ సమస్య, మందుల కొరత, వైద్యులు స్థానికంగా ఉండటకపోవడం, కుక్కకాటుకు సంబంధించిన ఇంజక్షన్లు అందుబాటులో లేవు. గత ప్రభుత్వం ఐదేళ్ల క్రితం భక్తుల రద్దీ, స్థానిక జనాభా దృష్ట్యా పీహెచ్‌సీ 24 గంటలు కొనసాగించాలని, 24 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
కన్పించని అత్యవసర సేవలు
స్థానిక పీహెచ్‌సీలో అత్యవసర సేవలు కన్పించడంలేదు. స్థానికులు, భక్తులు ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత, గుండెపోటులాంటి సమస్యలు వస్తే వారు అంబుల్సెలలో జిల్లాకేంద్ర ఆస్పత్రికి పరిస్థితి విషమంగా ఉంటే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సిందే.
గుట్టలో జాడలేని వందపడకల ఆస్పత్రి
వైటీడీఏ అభివృద్ధిలో భాగంగా దేవాలయం అభివృద్ధి చెందుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని భక్తులు, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందిచడానికి గత ప్రభుత్వం అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి 100 పడకల ఆస్పత్రికి భూమిపూజచేసి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం దాని జాడలేకుండా పోయింది.
100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి
ప్రజాప్రతినిధులు, యాదగిరిగుట్టలో పెరుగుతున్న జనాభా, రోజు రోజుకు వేలాదిగా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తిరుపతి తరహాలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. అన్ని రకాల వైద్యం, అత్యవసర సేవలు ఉచితంగా అందించాలని స్థానిక ప్రజా ప్రతినిధితు, నాయకులు కోరుతున్నారు.
ఏడు గంటలు మాత్రమే వైద్య సేవలు అందిస్తాం
ప్రతీరోజు ఉదయం 9గంటలకు ఆస్పత్రికి వచ్చి నాలుగు గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందించి వెళ్తాం. తర్వాత స్టాఫ్‌నర్సు ప్రథమ చికిత్స సేవలు అందిస్తారు. ప్రస్తుతం ప్రతీరోజు ఓపీ రోగులు 100 మంది వస్తున్నారు. స్టాఫ్ నర్సు ద్వారా సేవలు అందిస్తాం. అవసరమైతే జిల్లాకేంద్రానికి తరలిస్తాం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆరు పడకలే ఉన్నాయి.
పావని, మెడికల్ ఆఫీసర్ , యాదగిరిగుట్ట
2018లో గుట్ట మునిసిపాలిటీగా ఏర్పాటు
గత ప్రభుత్వం దేవాలయ అభివృద్ధి లో భాగంగా గుట్ట గ్రామపంచాయతీగా ఉంటే అభివృద్ధి చెందదని భావించి మాజీ సీఎం 2018లో యాదగిరిగుట్టను నూతన మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీంతో 2019 జనవరిలో నూతన పాలకవర్గం ఏర్పడింది. దేవాలయం ఉద్ఘాటన కాకముందు భక్తుల సంఖ్య ప్రతీరోజు 5వేలలోపు ఉండగా, ప్రస్తుతం 30వేల నుంచి 40వేల సంఖ్యలో ప్రతీరోజు భక్తుల సంఖ్య పెరిగింది.
మునిసిపాలిటీగా మారిన గుట్టలో 8వేల జనాభా ఉంటే ప్రస్తుతం సుమారు 30వేలకు పైగా జనాభా పెరిగింది. కొండకింద గతంలో ఉన్న దేవస్థాన ఆస్పత్రిని వైటీడీఏ అభివృద్ధి తొలగించగా వైద్యులు రిటైర్లు కావడంతో ప్రస్తుతం వైద్యసేవలు లేకుండా పోయింది. యాదగిరిగుట్ట పరిధిలో మొత్తం 18 గ్రామాలకు తొమ్మిది సబ్‌సెంటర్లు ఉండగా ఆ గ్రామాల నుంచి 3 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా రోగులు ప్రైవేట్ వాహనాల్లో వచ్చివెళ్తుంటారు. వైద్యులు ఆసమయంలో లేకుంటే వారికి కష్టాలు మొదలైనట్లై.
దేవస్థానం ఆస్పత్రులను పునరుద్దరించాలి :బండి శ్రీనివాస్, భక్తుడు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వచ్చే భక్తులకు గతంలో కొండపైన ఉన్న ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. ఆస్పత్రిలో వైద్యులను నియమించి భక్తులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందించాలి.
వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండాలి : కోల వెంకటే్‌షగౌడ్, స్థానికుడు
లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించే భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. వారికి ప్రథమ చికిత్స చేయడానికి సరైన వైద్యం అందించడానికి వైద్యులు అందుబాటులో ఉండాలి. సాయంత్ర నాలుగు దాటిందంటే ఆస్పత్రి ఖాళీ అవుతుంది. అప్పుడపుకపడు స్టాఫ్‌నర్స్ ఉంటూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తున్నారు.
ఆస్పత్రులను పునరుద్దరిస్తాం : భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకోసం కొండపైన త్వరలో ప్రత్యేక ఆసుసత్రిని ఏర్పాటు చేయనున్నాం. కింద కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తాం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.