ముల్కలపల్లి- గొల్లగూడెం రోడ్డుకు మోక్షమెప్పుడో?
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:15 AM
ఎన్నో ఏళ్లుగా మండలంలోని ముల్కలపల్లి- గొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న పీఆర్ రోడ్డు గుంతలు పడి, కంకర తేలడంతో ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కల్వర్టులకే పరిమితమైన బీటీ రోడ్డు పనులు
తుర్కపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా మండలంలోని ముల్కలపల్లి- గొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న పీఆర్ రోడ్డు గుంతలు పడి, కంకర తేలడంతో ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని జాతీయ రహదారి నుంచి పాత గ్రామ పంచాయతీ వరకు 800 మీటర్ల దూరం సీసీ రోడ్డు వేయడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 25లక్షలు మంజూరు చేయగా అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత 2022 మార్చి 4న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కానీ సీసీ రోడ్డు పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో నిర్మాణం పనులు ప్రారంభోత్సవానికే పరిమతం అయ్యాయి. తదనంతరం ముల్కలపల్లి జాతీయ రహదారి రోడ్డు నుంచి వయా గంగరాంతండ మీదుగా దేవోజీనాయక్‌తండ, గొల్లగూడెం వరకు నాలుగున్నర కిలోమీటర్లు దూరం బీటీ రోడ్డు వేయడానికి గాను షడ్యూల్డ్ ట్రైబల్ వెల్ఫేర్(ఎస్టీ ఎస్‌డీఎఫ్) కింద రూ.3.37కోట్లను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ముందుగా సీసీ రోడ్డు కోసం మంజూరైన నిధులు రద్దు చేసి అప్పట్లో మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్, ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి బీటీ రోడ్డు నిర్మాణం పనులకు 2023 మే 6న శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా కల్వర్ట్‌ల నిర్మాణం పనులు పూర్తి చేసి సంవత్సరం కావస్తుంది. ఆ రోడ్డుకు సంబంధించి బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రాంభించక పోవడంతో సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో నాలుగు పంచాయతీలకు సంబంధించిన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యకం చేస్తున్నారు.
రోడ్డు పనులు పూర్తి చేయించాలి
రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయి సంవత్సరం కావస్తోంది. గ్రామానికి వెళ్లె కట్టపైన మట్టి కుప్పలు పోసి వదిలిపెట్టడంతో రాపోకలు సాగించాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుం డా వాహనాలు నడుస్తున్నప్పుడు దుమ్ముధూళి ఇండ్లలోకి వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్భందులు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పందించి కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయించి ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.
-ఇమ్మడి మల్లప్ప, మాజీ సర్పంచ ముల్కలపల్లి, మండలం
తుర్కపల్లికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నాం
రోడ్డు అధ్వానంగా మారడంతో తుర్కపల్లి మండల కేంద్రాని రావాలంటే అనేక ఇబ్బందులుపడుతున్నాం. రోడ్డంతా కంకర తేలి గుంతలు పడడంతో వాహనదారులు ఇ బ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధు లు, అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి, గిరిజన తండాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలి.
-బానోతు శంకర్‌నాయక్, రామోజీనాయక్ తండా
త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి
ముల్కలపల్లి- గొల్లగూడెం, దేవోజీనాయక్ తండ గ్రామాలకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు కొంత కాలంగ నిలిచి పోయాయి. రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించి సంబంధిత కాట్రాక్టర్‌తో మాట్లాడాం. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-చక్రధర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ