హత్యా? ఆత్మహత్యా?
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:47 AM
నల్లగొండ జిల్లా డిండి మండలంలోని దేవతపల్లితండాకు చెందిన రమావత కుమార్(25) మృతి మిస్టరీగా మారింది.
డిండి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా డిండి మండలంలోని దేవతపల్లితండాకు చెందిన రమావత కుమార్(25) మృతి మిస్టరీగా మారింది. డిండి ఎస్‌ఐ రాజు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన రమావత కుమార్‌కు చందంపేట మండలం పోల్యానాయక్‌తండాకు చెందిన లక్ష్మి(పొట్టి)తో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. జీవనోపాధి కోసం వీరు ఏడాది కిందట హైదరాబాద్‌కు వెళ్లారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రమావత కుమార్ హైదరాబాద్‌లో గతంలో ఎలుకల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడే చికిత్స అందించడంతో అతడి ఆరోగ్యం మెరుగుపడింది. హైదరాబాద్ నుంచి రెండు నెలల కిందట ఇరువురు తిరిగి తండాకు చేరుకున్నారు. తమకున్న వ్యవసాయ భూమిలో వేరుశనగ పంటను సాగు చేశారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పైరుకు నీళ్లు పెట్టేందుకు భార్యాభర్తలు పొలానికి వెళ్లారు. అదే రాత్రి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో లక్ష్మి తండాకు చేరుకొని తన భర్త రమావత కుమార్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తండావాసులకు తెలిపింది. తండావాసులు పొలం వద్దకు చేరుకొని చెట్టుకు వేలాడుతున్న కుమార్ మృతదేహాన్ని తండాకు తరలించి పోలీసులకు, హైదరాబాద్‌లో ఉంటున్న రమావత కుమార్ సోదరులు లక్ష్మణ్, రమే్‌షలకు సమాచారం అందించారు. కుమార్ మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కుమార్ మూతిపై బలమైన వస్తువుతో కొట్టడంతో నోట్లోని పండ్లు ఊడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. వీపు, అవయ వాలపై తీవ్రగాయాలున్నాయి. ఉరి వేసుకున్న చెట్టుకు కొద్ది దూరంలో రక్తపు ఛారలు కనిపిస్తున్నాయి. రమావత కుమార్‌కు తీవ్ర రక్తస్రావమైనప్పటికీ తాను ధరించిన షర్టు, పాయింట్‌పై ఒక్క రక్తపు చుక్క కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. రమావత కుమార్ భార్య లక్ష్మి తన భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని బంధువులు ఆరోపిస్తున్నారు. కుమార్ తల్లి సుకిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. లక్ష్మి(పొట్టి)ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కుమార్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.