Share News

టీచర్స్‌ ఎమ్మెల్సీపై నజర్‌

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:08 AM

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీకి ఉపాధ్యా య సంఘాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే విజయావకాశాలుంటాయనే అంశంపై సంఘాల్లో అంతర్గత అభిప్రాయా లు సేకరించడంతో పాటు, బలమైన సమీకరణాలను అధినాయకత్వాలు పరిశీలిస్తున్నాయి.

టీచర్స్‌ ఎమ్మెల్సీపై నజర్‌

కొనసాగుతున్న ఓటర్ల నమోదు

పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న సంఘాలు

నల్లగొండ,నవంబరు 1 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీకి ఉపాధ్యా య సంఘాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే విజయావకాశాలుంటాయనే అంశంపై సంఘాల్లో అంతర్గత అభిప్రాయా లు సేకరించడంతో పాటు, బలమైన సమీకరణాలను అధినాయకత్వాలు పరిశీలిస్తున్నాయి. పోటీలో ఉండే అభ్యర్థులకు ధీటుగా తమ సంఘం నుం చి అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనలో ఆయా సంఘాల నాయకులు కసర త్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇప్పటికే ఓటర్ల నమోదుకు దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ స్థానాన్ని తిరిగి గెలిచి ఉపాధ్యాయుల్లో పట్టు కొనసాగించాలని యూటీఎఫ్‌ పట్టుదలగా ఉండగా, ఈ సీటును గెలవడం ద్వారా పునర్‌ వైభవం సాధించాలని పీఆర్‌టీయూటీఎస్‌ పావులు కదుపుతోంది. ఉపాధ్యాయ సమస్యలే లక్ష్యంగా ఏర్పాటైన త మ సంఘం అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వానికి దగ్గరిదారి ఏ ర్పడుతుందని టీపీఆర్‌టీయూ ప్రచారం మొదలుపెట్టింది. ఉపాధ్యాయ సంఘాలంటే కొన్నివర్గాలకే పరిమితం కాదని, అందరు ఉపాధ్యాయుల స మస్యల కోసం తాము పనిచేస్తామని, తమ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా ఉపాధ్యాయుల్లో పట్టు నిరూపించుకోవాలని తపస్‌ సంఘం భావిస్తోంది.మొత్తంగా ఈస్థానాన్ని అన్ని ఉపాధ్యాయసంఘాలు కీలకంగా భావిస్తుండడంతో బలమైన అభ్యర్థులు బరిలో దిగడం ఖాయమనిపిస్తోంది.

సిట్టింగ్‌ ఎమ్మెల్సీని అభ్యర్థిగా ప్రకటించిన యూటీఎఫ్‌

ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి అభ్యర్థిత్వానికే యూటీఎఫ్‌ మరోసారి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయన 2019లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించగా, అన్ని సంఘాల కంటే ముందే నర్సిరెడ్డి అభ్యర్థిత్వాన్ని మరోమారు ప్రకటించిన యూటీఎఫ్‌ ఇప్పటికే ఉపాధ్యాయవర్గాల్లో ప్రచారం కూడా ప్రారంభించింది. ఉపాధ్యాయుల సమస్యలు, హక్కులు, సంక్షేమంపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మండల కమిటీలు మొదలు, జిల్లా కమిటీల వరకు అందరు కార్యవర్గసభ్యులు క్షేత్రస్థాయిలో నర్సిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తుండడం ఆ సంఘానికి కలిసొచ్చే అంశంగా ఉపాధ్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది.

పీఆర్‌టీయూటీఎస్‌ నుంచి బరిలోకి రాష్ట్ర అధ్యక్షుడు

గత ఎన్నికల్లో ఈ సీటును చేజార్చుకున్న పీఆర్‌టీయూటీఎస్‌ ఈ దఫా సీటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ స్థానంలో 2013లో సంఘం అభ్యర్థి పూల రవీందర్‌ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయనే తిరిగి 2019లోనూ పోటీచేసినా సీటు కోల్పోయారు. ఈసారి గెలవాలనే లక్ష్యంతో సంఘం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంఘం సభ్యత్వాలను పెంచుకోవడంతోపాటు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు సహకరిస్తూ కార్యకలాపాలను విస్తృతపరిచారు. ఈసారి జరిగే ఎన్నికలో అభ్యర్థిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీపాల్‌రెడ్డి బరిలో ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని నాయకులు ప్రచారం ప్రారంభించారు.

టీపీఆర్‌టీయూ అభ్యర్థిగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ఈసారి సీటును తమ ఖాతాలో వేసుకోవాలని టీపీఆర్‌టీయూ రంగంలోకి దిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ సంఘం ఏర్పాటైంది. ఉపాధ్యాయవర్గాల సమస్యలపై నిరంతరం పోరాడడంతో పాటు, ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ప్రభుత్వంతోనూ సానుకూలతకలిగిన వ్యక్తిగా ఆయన బరిలో నిలవాలని సంఘం నాయకులు ప్రతిపాదిస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న వ్యక్తిగా హర్షవర్ధన్‌కు ఉన్న గుర్తింపు తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన హర్షవర్ధన్‌రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన బరిలో నిలిస్తే గట్టిపోటీ ఉంటుందని, అధికార పార్టీ మద్దతు కూడా ఉంటుందని సంఘం నాయకులు భావిస్తున్నారు.

తప్‌సలో అభ్యర్థిత్వం కోసం పోటాపోటీ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆశ పెంచుకున్న మరో కీలక సంఘం టీపీయూఎస్‌ (తపస్‌). ఈ సంఘం నుంచి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన సర్వోత్తంరెడ్డి మరోసారి పోటీకి సిద్ధంగా ఉండగా, ఆయనతో పాటు మరికొందరు నేతలు ఈసారి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. జిల్లాకు చెందిన నేత కస్తూరి చరణ్‌, సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తీగుళ్ల సాయిరెడ్డి, బందారపు లింగస్వామి తదితరులు అభ్యర్థిత్వంపై ఆశలు పెంచుకున్నారు. సంఘం చివరిగా ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై నాయకుల్లో భిన్న చర్చ సాగుతోంది. ఎవరికి అవకాశం వచ్చినా ఈ సారి గట్టిపోటీ తప్పదని, గెలవాలనే లక్ష్యంతోనే బరిలో దిగుతామని సంఘం నాయకులు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదుకు ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఉంది.

జిల్లా వచ్చిన దరఖాస్తులు

నల్లగొండ 3,290

సూర్యాపేట 1,855

యాదాద్రి 611

సిద్ధిపేట 111

జనగామ 530

మహబూబాబాద్‌ 808

వరంగల్‌ 1,436

హనుమకొండ 2,902

జె.భూపాలపల్లి 167

భదాద్రి 1,194

ఖమ్మం 1,995

ములుగు 222

మొత్తం 15,121

Updated Date - Nov 02 , 2024 | 01:08 AM