Share News

కొత్త బంధం.. పాత వంట

ABN , Publish Date - Dec 21 , 2024 | 11:42 PM

ఆ అత్తా కోడళ్లు వంటలు చేస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షిస్తున్నా రు. ఈతరం వారికి రుచే కాదు పేర్లూ తెలియని వంటకాలనూ వీడియోల ద్వారా వీరు పరిచ యం చేస్తున్నారు. ఆ అత్త తన కోడలికి ఆ వంట ఎలా చేయాలో? ఏ సీజన్‌లో ఏ వంటను ఎలా వండాలో వివరిస్తూ వీడియో చూసేవారికి సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుండడం వీరి ప్రత్యేక త.

కొత్త బంధం.. పాత వంట

యూట్యూబ్‌లో అత్తాకోడళ్ల వంటల విందు

వ్యూస్‌తో దూసుకెళ్తున్న చెఫ్‌ సరూ

కోడలికి వంట నేర్పే క్రమంలో మొదలైన ఆలోచన

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): ఆ అత్తా కోడళ్లు వంటలు చేస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షిస్తున్నా రు. ఈతరం వారికి రుచే కాదు పేర్లూ తెలియని వంటకాలనూ వీడియోల ద్వారా వీరు పరిచ యం చేస్తున్నారు. ఆ అత్త తన కోడలికి ఆ వంట ఎలా చేయాలో? ఏ సీజన్‌లో ఏ వంటను ఎలా వండాలో వివరిస్తూ వీడియో చూసేవారికి సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుండడం వీరి ప్రత్యేక త. అద్భుతమైన రుచి వచ్చేలా వంట చేసేవిధానం, అందులో ఉపయోగించే పదార్థాలను వివరించడంతో పాటు, వంట చేసే క్రమంలో అత్తాకోడళ్ల మధ్య సరదా సంభాషణ, ఆ వంటకు అనుసంధానమయ్యేలా సాగే పిట్ట కథలు, సామెతలు వీక్షకులను రంజింపజేస్తున్నాయి. ‘చెఫ్‌ సరూ’ యూ ట్యూబ్‌ ఛానల్‌ ద్వారా నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండల కేంద్రానికి చెందిన సరస్వ తి, ఆమె అత్త సైదమ్మ ప్రాచుర్యం పొందడంతోపాటు వారికంటూ ఓ ప్రత్యేకతను సాధించారు.

సైదమ్మ కోడలు సరస్వతికి తొలినాళ్లలో అంతగా వంట లు వచ్చేవి కావు. దీంతో సైదమ్మ ఏ వంట ఎలా చేయాలి? ఎలా వండాలి? ఏ వంటలో ఉండే ప్రత్యేకతలేంటి? ఏ పదార్థాలు ఏ మోతాదులో వాడితే ఆ వంట రుచికరంగా ఉం టుంది? అనే విషయాలను కోడలికి వివరించేది. అలా కోడలి కి వంట నేర్పే సమయంలో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేద్దామని ఆమె కుమారుడు నరేష్‌ సలహా ఇచ్చా డు. తొలుత సైదమ్మ వారించడంతోపాటు, తనకు చదువురాదని, తాను చేసే వంటలు వేరేవాళ్లు ఎందుకు చూస్తారని బిడియపడింది. కానీ ఆమె కుమారుడు, కోడలు ఒప్పించి వంటల వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టా రు. అనూహ్యంగా వాటికి ఆదరణ లభించింది. తొలుత వీడియోలకు నెటిజన్లు ప్రతికూల కామెంట్లు పెట్టగా, ఓపిగ్గా వారికి సమాధానమిస్తూ ఆ సమస్యను అధిగమించారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని సరస్వతి తెలిపిం ది. కోడలినైనా తనను సొంత కూతురిలా అత్త సైదమ్మ చూ సుకుంటోందని, వీడియోలు చూసేవాళ్లు పలువురు తమను అత్తాకోడళ్లేనా? అని అనుమానపడి అడుగుతుంటారని చెప్పింది. అత్త చేసే వంటలు, చెప్పే విధానంతోనే తాను కూ డా వంట నేర్చుకున్నానని సరస్వతి తెలిపింది. తన భర్త నరేష్‌ డిజిటల్‌ మీడియాలో పనిచేస్తుండటం, అతడి ఆలోచన నుంచే ఈ యూట్యూబ్‌ వీడియోలు చేయాలని నిర్ణయించామని, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు వల్లే ఈ సక్సెస్‌ సాధించామని, వీడియోల రూపకల్పన సమయంలో అందరూ సహకరిస్తారని సైదమ్మ, సరస్వతి వెల్లడించారు.

ఈ తరానికి తెలియని పాత వంటకాలకే ప్రాధాన్యం

సైదమ్మకు చిన్నప్పటి నుంచే వంటలు చేయడంలో పేరుంది. చిన్నప్పుడు అమ్మ వద్ద, అమ్మమ్మ, నాయనమ్మల వద్ద ఆమె ఎన్నో వంటలు చేయడం నేర్చుకుంది. వారి కుటుంబంలో ఏ ఫంక్షన్‌ అయినా ఆమెనే వంటలు చేసేది. వారి కుటుంబం పెద్దది కావడంతో రోజూ అందరికీ రుచికరమైన వంట చేసి పెట్టడం ద్వారా చక్కని వంట చేయడం అలవాటైంది. ప్రధానంగా ఈ తరానికి అంతగా తెలియని పాతకాలపు వంటలను వారి వీడియోల్లో వండి చూపిస్తుండటంతో వీక్షకుల ఆదరణ పెరిగింది. కొరమీను, కంది పచ్చడి, ఉలవ పచ్చడి, నల్లేరు పచ్చడి, ఆముదాల పాలతో సొరకాయ పచ్చడి, ఉలవచారు, ఉలవ రొట్టె, నాటుకోడి, రాగిఅన్నం, సజ్జ అన్నం, మటన్‌ పులుసు వంటి వెరైటీ వంటకాల వీరి వీడియోలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. మొత్తం వీరు 400కు పైగా వంటకాల తయారీ వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. పాత తరం వంటకాలు, వాటి ప్రాధాన్యాన్ని ఈతరానికి తెలియజేస్తున్నామని, ఈ వంటలతో ఆరోగ్యంతో పాటు, అద్భుతమైన రుచి అందిస్తాయని సరస్వతి, సైదమ్మ చెబుతున్నారు.

త్వరలో ఫ్రాంచైజీల ఏర్పాటుకు సన్నాహాలు

వంట నచ్చిన చాలా మంది వాటిని వండి కొరియర్‌ చేయాలని కోరడంతో వీరు ఆ సేవలు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి గాజు సీసాల్లోనే పచ్చళ్లను వీరు అందిస్తున్నారు. వారు చేసే వివిధ వంటలను ఆఫ్‌లైన్‌లో ప్రాంఛైజీల ద్వారా కూడా విక్రయించాలని పలువురు కోరుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా కేంద్రాల్లో ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సరస్వతి తెలిపారు. బెల్లంటీతో పాటు ఆ ఫ్రాంచైజీల్లో వీరి వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతామని, దీని ద్వారా అత్త సైదమ్మ వీడియోల్లో చేసి చూపించే కూరలు, పచ్చళ్లు, ఇతర వంటకాలు అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

చికెన్‌పచ్చడి వీడియోకు 34లక్షల వ్యూస్‌

చెఫ్‌ సరూ పేరుతో చేసిన వీడియోల్లో చికెన్‌ పచ్చడి వంటకానికి అన్ని సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ కలిపి 34 లక్షల వ్యూస్‌ వచ్చాయి. అదేవిధంగా నల్లేరు పచ్చడి వీడియోకు 3.20లక్షల వ్యూస్‌ వచ్చాయి. చాలా వీడియోలకు లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. చెఫ్‌ సరూ చానెల్‌కు యూట్యూబ్‌లో 2.66లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్‌ ఉంటే, ఫేస్‌బుక్‌లో 3.19లక్షల మంది, ఇన్‌స్టాలో 1.15లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ అత్తాకోడళ్లు ఇప్పటివరకు 400కుపైగా వంటకాల వీడియోలు అప్‌లోడ్‌ చేశారు.

ఇంత ఆదరణ రావడం సంతోషదాయకం: సరస్వతి, సైదమ్మ

‘చెఫ్‌ సరూ’ యూట్యూబ్‌ చానెల్‌లో మేం సరదాగా చేసిన వంటల వీడియోలకు ఈ స్థాయిలో ఆదరణ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోల ద్వారా ఈ తరానికి తెలియని పాతతరానికి చెందిన పలు రుచికర వంటలు ఎలా చేయాలో రెసిపీ సహా వివరిస్తున్నాం. ఇలా వివరంగా చెప్పడం వల్ల ఈ వీడియో చూసేవాళ్లు ఆ వంటను వారు కూడా సులభంగా చేసుకోవడం కుదురుతుందనేది మా ఆలోచన. సరదాగా చేసిన ఈ ఆలోచనే మాకు ఉపాధిగా ఉపయోగపడడం సంతోషదాయకం. మా ఇంట్లో అందరూ సహకరిస్తుండడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.

Updated Date - Dec 21 , 2024 | 11:42 PM