పల్లెకు వెలుగులేవీ?
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:33 AM
ఉమ్మడి జిల్లాలో పదేళ్ల క్రితం వరకు చివరి గ్రామాలకు నైట్‌హాల్ట్ బస్సు ఉండేది. ప్రతీ ఆర్టీసీ డిపో నుం చి కనీసం 20 రూట్లలో ఇవి కొనసాగేవి. మారుమూ ల, సరిహద్దు ప్రాంతాలకూ ఈ బస్సు సర్వీసులుండేవి. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామానికి ఉదయం 10గంటలలోపు, సాయంత్రం 4 నుంచి 5గంటల మధ్య బస్సు లు అందుబాటులో ఉండేవి.
80శాతం గ్రామాలకు నిలిచిన సేవలు
గతంలో నడిచిన రూట్లలో ఆదాయం లేదంటూ నిలిపివేత
ఆటోలే ప్రయాణికులకు దిక్కు
రాత్రి 9.30 దాటితే హైదరాబాద్ నుంచి నల్లగొండ, యాదాద్రికి బస్సులు నిల్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఉమ్మడి జిల్లాలో పదేళ్ల క్రితం వరకు చివరి గ్రామాలకు నైట్‌హాల్ట్ బస్సు ఉండేది. ప్రతీ ఆర్టీసీ డిపో నుం చి కనీసం 20 రూట్లలో ఇవి కొనసాగేవి. మారుమూ ల, సరిహద్దు ప్రాంతాలకూ ఈ బస్సు సర్వీసులుండేవి. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామానికి ఉదయం 10గంటలలోపు, సాయంత్రం 4 నుంచి 5గంటల మధ్య బస్సు లు అందుబాటులో ఉండేవి. డీజిల్ ధరల పెంపు, మరోవైపు ఆటోల తాకిడి, ప్రైవేట్ వాహనాల వినియోగం పెరగడం, ఆర్టీసీలో డ్రైవర్ల నియామకాలు లేకపోవడం తదితర కారణాలతో ప్రధానంగా పల్లెలకు వెళ్లే బస్సుల నిర్వహణ ఆర్టీసీకి భారంగా మారింది. దీంతో కొన్ని రూట్లలో బస్సులు నడిపితే నష్టాలు వస్తుండడంతో క్రమంగా సర్వీసుల సంఖ్యను తగ్గించింది. కరోనా అనంతరం సర్వీసులనే రద్దు చేసింది.
ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులవెంట ఉన్న గ్రామాలకు మాత్రమే రెగ్యులర్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 80శాతం పల్లెలకు ఆర్టీసీ బస్సులే వెళ్లడం లేదు. ఒకప్పుడు ఏడిపో నుంచైనా రాత్రి 8గంటల వరకు నైట్‌హాల్ట్ బస్సులు అందుబాటులో ఉంటే, ప్రస్తుతం చీకటి పడితే బస్సు దొరకడం లేదు. తాజాగా, ఏడాది కాలంగా మహిళలకు ఉచితప్రయాణం కల్పిస్తుండటంతో పల్లెల్లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్‌కు తగ్గట్టు బస్సులను పెంచలేకపోతుండడంతో ఇటీవల ఆమేరకు విన్నపాలు పెరిగాయి. ఈపరిస్థితిలో 80శాతం పల్లెలకు బస్సు లు వెళ్లని పరిస్థితిపై అధ్యయనం చేయాలని, ఈ రూట్లలోనూ నిర్ణీత బస్సులనైనా నడపాలని, పెద్దబస్సుల స్థానంలో మినీ, ఎలక్ట్రిక్‌బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రాత్రి వేళ ప్రయాసే
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు ఏవైనా రాత్రి 9 గంటల తర్వాత నా ర్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్లలోకి రాకుండా బైపాస్ నుంచి నేరుగా వెళ్లిపోతున్నా యి. రాత్రి 9.30గంటలకు హైదరాబాద్-కోదాడ బస్సు వెళ్లాక హైదరాబాద్-చౌటుప్పల్-చిట్యాల-నార్కట్‌పల్లి-నల్లగొండ-మిర్యాలగూడ మార్గంలో ఏపీ బస్సులు మినహా తెలంగాణ డిపోల బస్సులు నడవడం లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికు లు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. లేదంటే తెల్లవారు జామున 3.30గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఇదే రూట్‌లో హైదరాబాద్ వెళ్లాలంటే అదే పరిస్థితి నెలకొంది. పలుమార్లు ప్రయాణికులకు, ఏపీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు కూడా జరిగాయి. రాత్రి 10గంటలకు ఈ మార్గంలో కనీసం ఒక్కో బస్సునైనా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట మార్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ నుంచి రాత్రి 8గంటల తర్వాత వచ్చే జనగాం, తొర్రూరు, వరంగల్, హనుమకొండ బస్సులు భువనగిరి పట్టణంలోనికి రాకుండా బైపాస్ నుంచి వెళ్లిపోతున్నాయి. దీంతో భువనగిరి ప్రయాణికులకు రాత్రివేళ పట్నం నుంచి రావాలంటే ప్రయాస పడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ప్రయాణికులు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పరిశీలించిన తర్వాత ఆర్టీసీ అధికారులకు బస్సు సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇంకా కార్యాచరణ మాత్రం అమలు కాలేదు.
నల్లగొండ జిల్లాలో ఇలా..
నార్కట్‌పల్లి నుంచి బ్రాహ్మణవెల్లంల మీదుగా మునుగోడు వరకు ఉదయం, సాయంత్రం బస్సులు నడిచేవి. ఏళ్లుగా ఈ రూట్లో బస్సులు నిలిపేశారు. దీంతో ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు.
ఫ నల్లగొండ డిపో నుంచి కట్టంగూరు మండలం పిట్టంపల్లి-ఇస్మాయిల్‌పల్లి-పామనగుండ్ల-ఎరసానిగూడెం బస్సు గతంలో రెండు పూటలా వచ్చేది. కరోనా తరువాత నుంచి ఈ బస్సు నడవడం లేదు. కట్టంగూరు-కురుమూర్తి-గార్లబాయిగూడెం-చెరువుఅన్నారం-నకిరేకల్‌కు గతంలో బస్సు ఉండేది. దీన్ని రద్దుచేయడంతో ఈ ప్రాంత ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్టంగూరు-కలిమెర-పరడ-అమ్మనబోలు-నక్కలపల్లి బస్సు గతంలో సౌకర్యవంతంగా ఉండేది. దీన్ని రద్దుచేయడంతో ఆటోలే దిక్కయ్యాయి.
ఫ కేతేపల్లి మండలంలో జాతీయరహదారిపై ఉన్న ఉప్పలపాడు, చీకటిగూడెం, కేతేపల్లి, కొర్లపాడు, ఇనుపాముల గ్రామాలకు, సూర్యాపేట-మిర్యాలగూడ మార్గంలోని భీమారానికి తప్ప ఈ మండలంలో ఇతర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. గతంలో కొప్పోలు-భీమారం-చెరుకుపల్లి మీదుగా సూర్యాపేట-మిర్యాలగూడ పట్టణాల మధ్య బస్సు సర్వీసులుండేవి. సూర్యాపేట-మిర్యాలగూడ వయా భీమారం రూట్లో మూసీ వంతెన నిర్మాణం తర్వాత కొప్పోలు-తుంగతుర్తి-చెరుకుపల్లి మీదుగా మిర్యాలగూడ వెళ్లే బస్సులను ఆరేళ్ల క్రితం రద్దు చేశారు. మెజార్టీ గ్రామాలకు బస్సు సదుపాయం లేదు.
ఫ శాలిగౌరారం మండలంలో దాదాపు 35 గ్రామాలు ఉన్నాయి. గతంలో ఉన్న బస్సులను కరోనా సమయంలో రద్దు చేయడంతో ప్రయాణికులకు ఆటోలే దిక్కయ్యాయి. ప్రస్తుతం మండలంలోని ఏ ఒక్క గ్రామానికి బస్సు సదుపాయం లేదు. గతంలో నల్లగొండ-సూర్యాపేట-నార్కట్‌పల్లి డిపోల నుంచి నకిరేకల్-శాలిగౌరారం రూట్‌లోని మోత్కూరు, మనిమెద్దె, భైరవునిబండ, జగద్గిరిగుట్ట, నకిరేకల్-చిత్తలూరు మార్గంలో ఇటుకలపాడు, చిత్తలూరు ప్రాంతాలకు దాదాపు 25 బస్సు లు నడిచేవి. ప్రతీ గ్రామానికి దాదాపు బస్సు వెళ్లేది. నకిరేకల్ - శాలిగౌరారం మార్గంలో చిత్తలూరు వరకు నైట్‌హాల్ట్ బస్సులుండేవి. ప్రస్తుతం ఈ బస్సులు నడవడం లేదు. వ ల్లాల విద్యార్థుల సౌకర్యార్థం నల్లగొండ డిపో నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పులు మాత్రమే బస్సు నడిపిస్తున్నారు. డ్రైవర్ల కొరత ఉన్నందున బస్సులు నడపలేకపోతున్నామని ఆ ర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఫ చండూరు మండల కేంద్రం నుంచి గుండ్రాంపల్లి, చామలపల్లి, పోచంపల్లి, గుర్రంపోడు మండల కేంద్రాలకు బస్సు సదుపాయం లేదు. మండల కేంద్రం నుంచి శిర్ధంపల్లి, కొరటికల్ గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేదు. చండూరు నుంచి గుర్రంపోడుకు సాయంత్రం ఒక్క ట్రిప్పు, తిరిగి ఉదయం గుర్రంపోడు నుంచి చండూరుకు ఒక ట్రిప్పు మాత్రమే బస్సు నడుస్తోంది. చండూరు-తుమ్మలపల్లి-నాంపల్లి మార్గంలో ఒక్క బస్సు కూడా తిరగడం లేదు. మండలంలో మెజార్టీ గ్రా మాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలే శరణ్యమయ్యాయి.
ఫ పెద్దఅడిశర్లపల్లి మండలంలో గతంలో దే వరకొండ నుంచి పెద్దగుమ్మడం వరకు నైట్‌హాల్ట్ బస్సు ఉండేది. దాన్ని రద్దు చేశారు. ఉదయం పె ద్దగుమ్మడం-హైదరాబాద్ బస్సు మాత్రమే నడుపుతున్నారు. గతంలో ఘనాపురం-పోల్కంపల్లి-భీమనపల్లి-పెద్దవూర బస్సు ఉండేది. అది కూడా రద్దయింది. పీఏ.పల్లి నుంచి గుడిపల్లి మీదుగా నల్లగొండకు బస్సు సదుపాయం ఉండేది. దాన్ని రద్దు చేశారు. దీంతో మొత్తంగా మండలంలో 80 శాతం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
ఫ మునుగోడు మండలంలోని కల్వకుంట్ల, కల్వలపల్లి, పులిపలుపుల, జమస్థాన్‌పల్లి, కొరటికల్, ఊకొండి, కోతులారం, సోలిపురం, ఇప్పర్తి, కృష్నాపురం, సింగారం, రత్నపల్లి, గంగోరిగూడెం, బీరెల్లిగూడెం తదితర గ్రామాలకు బస్సులు రావడం లేదు.
ఫ దేవరకొండ డిపో నుంచి గతంలో చందంపేట మండలం చిత్రియాల మీదుగా రేకులగడ్డకు రోజుకు మూడు ట్రిప్పులు బస్సులు నడిచేవి. అవన్నీ రద్దయ్యాయి. అసలు బస్సు సౌకర్యమే లేదు. పోల్యానాయక్ తండాకి గతంలో దేవరకొండ నుంచి చందంపేట, మూడుదండ్ల మీదుగా బస్సులు నడిచేవి. ఇప్పడవి రద్దయ్యాయి.
ఫ మిర్యాలగూడ డిపో నుంచి దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం-కల్లెపల్లి- పుట్టలగడ్డ మార్గంలో కరోనా అనంతరం నష్టాలొస్తున్నాయని బస్సు రద్దు చేశారు. ఈ మార్గంలో ప్రధానంగా గురువారం, ఆదివారం కల్లేపల్లిలోని ప్రసిద్ధ బంగారుమైసమ్మ ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వీరంతా ఆటోల్లో వెళ్లి ప్రమాదాలబారిన పడిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సును పునరుద్ధరించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
ఫ నల్లగొండ నుంచి ముప్పారం-ఎర్రబెల్లి మార్గంలో నాలుగేళ్ల క్రితం వరకు బస్సులు నడిచేవి. ముప్పారం బస్సు రోజూ నాలుగు ట్రిప్పులు, ఎర్రబెల్లి బస్సు మూడు ట్రిప్పులు నడిచేది. ప్రస్తుతం ఈ బస్సులు నడవడం లేదు. ఈ బస్సులతో నిడమనూరు మండలంలోని దుప్పలపల్లి, తొరగల్లు, మాదారం, మారపాక, ఎర్రబెల్లి, ఉట్కూరు, నందికొండవారిగూడెం, వేంపాడు తదితర గ్రామాల ప్రయాణికులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. రోడ్లు బాగాలేవని, ఆదాయం రావడం లేదని బస్సులను నిలిపిపేశారు. మిర్యాలగూడ డిపో నుంచి మిర్యాలగూడ-త్రిపురారం-నిడమనూరు-మర్లగడ్డగూడెం మార్గంలో ఉదయం, సాయంత్రం బస్సులు నడిచేవి. ప్రస్తుతం ఇవి నడవడం లేదు.
ఫ హాలియా-సూరేపల్లి, సూరేపల్లి-హాలియా-మిర్యాలగూడ మార్గంలో గతంలో ఉదయం, సాయంత్రం బస్సులు తిరిగేవి. ప్రస్తుతం అవి ఆగిపోయాయి. దీంతో పాటు హాలియా-నిడమనూరు-రామడుగు-యాచారం-కనగల్-నల్లగొండ మార్గంలో కూడా గతంలో ఉదయం, సాయంత్రం బస్సులు నడిచేవి. ప్రస్తుతం ఇవి నడవడం లేదు. మిర్యాలగూడ-త్రిపురారం-హాలియా-నాగార్జునసాగర్-నడిగడ్డ మార్గాల్లో కూడా బస్సులు నడవడం లేదు.
ఫ నకిరేకల్ మండలంలో 17 పంచాయతీలకు జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాలు మినహా మిగిలిన చోట్లకు బస్సులు వెళ్లడం లేదు.
ఫ గుర్రంపోడు మండలంలో నల్లగొండ-గుర్రంపోడు-దేవరకొండ మార్గంలో ఉన్న గ్రామాలకు మినహా మిగిలిన గ్రామాలకు బస్సు సదుపాయం లేదు.
యాదాద్రి జిల్లాలో..
ఫ భువనగిరి జిల్లా కేంద్రం నుంచి నందనం-నామాతపల్లి-ఎర్రంపల్లి-వలిగొండ-మాధవనగర్-కంచనపల్లికి గతంలో రెగ్యులర్ బస్సు సర్వీసుల ఉండేవి. ప్రస్తుతం ఆ రూట్లో బస్సులు ఆపేశారు. అదేవిధంగా తుక్కాపూర్-గౌ్‌సనగర్-వీరవెల్లి-బండసోమారం-ఎర్రంబెల్లి-కాంచనపల్లి రూట్లో గతంలో ఉదయం, సాయం త్రం బస్సు సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం విద్యార్థుల కోసమని ఒక్క ట్రిప్పే నడుపుతున్నారు. ఈ మార్గంలో బస్సు సర్వీసులు పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఫ యాదగిరిగుట్ట మండలంలోని బాబుపేట, తాళ్లగూ డెం, యాసోజుగూడెం, కుమరిగూడెం గ్రామాలకు ఆరేళ్ల నుంచి బస్సులు వెళ్లడం లేదు. పెద్దకందుకూరుకు ఏడాది కాలంగా బస్సు సర్వీస్ నిలిచిపోయింది.
ఫ ఆలేరు మండలంలో 16 గ్రామాల్లో ప్రధాన రహదారి మార్గంలో ఉన్న గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలకు బస్సు సదుపాయం లేదు.
ఫ ఆత్మకూరు(ఎం) మండలంలో గతంలో యాదగిరిగుట్ట డిపోనుంచి తుక్కాపురం, కూరెళ్ల మీదుగా మోత్కూరుకు వెళ్లే బస్సు, ఆత్మకూరు నుంచి వలిగొండ వెళ్లే బస్సు నడిచేవి. కరోనా నుంచి వీటిని పూర్తిగా రద్దుచేశారు. అదేవిధంగా మోత్కూరు-హైదరాబాద్ వెళ్లే బస్సును కప్రాయపల్లి, రహీంఖాన్‌పేట, తుక్కాపురం, రాయిపల్లి, కొండాపురం స్టేజీల వద్ద నిలపాలని స్థానికులు కోరుతున్నారు.
ఫ మోటకొండూరు మండలంలో గతంలో నడిచిన బస్సుల్లో 90శాతం కుదించడంతో ప్రస్తుతం ఆటోలే దిక్కయ్యాయి. బీబీనగర్, సంస్థాన్‌నారాయణపురం, తుర్కపల్లి మండలాల్లోనూ గతంలో బస్సులు నడిచిన రూట్లలో ఇ ప్పుడు నిలిపివేశారు.
ఫ గుండాల మండలంలోని నూనెగూడెం, బండకొత్తపల్లి, అంబాల, వంగాల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. గతంలో వంగాల మినహా మిగిలిన గ్రామాలకు బస్సు రూట్ ఉండేది. ప్రస్తుతం ఈ మార్గాల్లో బస్సు సదుపా యం లేదు.
ఫ రాజాపేట మండలంలోని మెల్లగూడెం, కొత్తజాల, దూదివెంకటాపూర్ గ్రామాలకు బస్సు సదుపాయం లేదు. పుట్టగూడెం, కొండ్రెడ్డిచెరువు, సోమారం, లక్ష్మక్కపల్లి, న ర్సాపూర్, కుర్రారంకి ఒకే బస్సు నడుస్తోంది. మిలిగిన గ్రా మాలకు పూర్తిగా ఆటోలే దిక్కయ్యాయి. కొండ్రెడ్డిచెరువు-రాజాపేట మార్గంలో విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు నడుపుతున్నా అది ఎప్పడొస్తుందో తేలికపోవడంతో వారు రోడ్లమీదనే పడిగాపులు పడుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో...
సూర్యాపేట జిల్లాలోనూ పల్లెలకు ఆర్టీసీ బస్సులు వె ళ్లడం లేదు. తక్కువ ఆదాయం వస్తుందనే కారణంతో బ స్సులు నిలిపిపేశారు. గతంలో నాలుగైదు ట్రిప్పులు తిరిగే రూట్లలో ఒక్క ట్రిప్పుకు, గతంలో నాలుగైదు బస్సులు షటిల్ తిరిగే రూట్లలో ఒక్క బస్సుకు పరిమితం చేశారు.
ఫ హుజూర్‌నగర్ నుంచి మర్రిగూడెం, కరక్కాయలగూడెం, బూరుగడ్డ, లక్కవరం, శ్రీనివాసపురం గ్రామాలకు బస్సు సదుపాయం లేదు. హుజూర్‌నగర్-మఠంపల్లి-మట్టపల్లి-గుంటూరు మార్గంలో ఉదయం, సాయం త్రం బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. హుజూర్‌నగర్ నుంచి మేళ్లచెరువు, చింతలపాలెం మీదు గా గుంటూరు వరకు మార్గంలోనూ బస్సులు నడపాలని కోరుతున్నారు. పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెం ట్ కర్మాగారం వరకే బస్సులు నడుస్తుండడంతో సమీప గ్రామాలైన గుండెబోయినగూడెం, గుండ్లపాడు, ఎల్లాపు రం గ్రామాలకు ఆటోలే దిక్కయ్యాయి.
ఫ మేళ్లచెరువు-హుజూర్‌నగర్ మార్గంలో గతంలో రెగ్యులర్‌గా ఆర్టీసీ బస్సు సర్వీసులుండేవి. కరోనా అనంతరం ఈ సర్వీసులను రద్దు చేశారు. అదేవిధంగా రేవూ రు, వేపలమాదారం, హేమ్లాతండాకు గతంలో ఉన్న బ స్సు సర్వీసులు రద్దయ్యాయి. కోదాడ-చింతిర్యాల బస్సులు గతంలో మేళ్లచెరువు, చింతలపాలెం మీదుగా వెళ్లేవి. ఈ సర్వీసులను కుదించి రోజుకు ఒక్కటే నడుపుతున్నారు. చింతలపాలెం-జగ్గయ్యపేట మార్గంలో బస్సులు ఆపేశా రు. మేళ్లచెరువు - చింతలపాలెం మీదుగా గుంటూరు వరకు బస్సులు నడపాలని కోరుతున్నారు.
ఫ కోదాడ డిపో నుంచి హుజూర్‌నగర్-లింగగిరి-సర్వారం-కొండాయిగూడెం-గానుగబండ మార్గంలో గతంలో బస్సు నడిచేది. ప్రస్తుతం దీన్ని రద్దుచేశారు. మిర్యాలగూడ డిపో నుంచి గరిడేపల్లి-కల్మలచెరువు-హనుమంతులగూడెం-యాతవాకిళ్ల మార్గంలోనూ బస్సు రద్దయింది. మట్టపల్లి-మఠంపల్లి-అంజలిపురం-అమరారం-లింగగిరి- సర్వారం-లక్ష్మీపురం-అబ్బిరెడ్డిగూడెం-హైదరాబాద్‌కు వెళ్లే బస్సు రద్దయింది. ఈ మార్గాల్లో కరోనాకు ముందు రెగ్యులర్ బస్సులు నడిచేవి. ప్రస్తుతం వీటిని నిలిపివేశారు.
ఫ మోతె మండలంలోని నామవరం, సిరికొండ గ్రా మాలకు గతంలో సూర్యాపేట డిపో నుంచి మూడు పూటలా బస్సులు నడిచేవి. ప్రస్తుతం రద్దవడంతో సూర్యాపేట నుంచి నామవరం, లాల్‌తండ, సిరికొండ పరిసర 12 గ్రామాలకు ప్రస్తుతం రాత్రి సూర్యాపేట నుంచి వెళ్లాలంటే ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఖమ్మం డిపో నుంచి తుమ్మగూడెం, నేరడవాయి వరకే బస్సులు వస్తున్నాయి. మారుమూల గ్రామాలైన బురకచర్ల, మేకలపాటితండా, ఉర్లుగొండ మార్గాల్లోనూ బస్సులు నడవడం లేదు. సూర్యాపేట-గుంజలూరుస్టేజీ-నామవరం-రాఘవాపురం క్రాస్‌రోడ్డు-ఖమ్మం జాతీయరహదారి వరకు బస్సులు నడపాలని విద్యార్థులు, గ్రామీణులు కోరుతున్నారు.
ఫ సూర్యాపేట డిపో నుంచి మానాపురం వెళ్లే నైట్‌బస్సు రద్దవడంతో తుంగతుర్తి, అన్నారం, అర్వపల్లి గ్రామస్థులు ఇబ్బందిపడుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని బొల్లంపల్లి గ్రామానికి కూడా బస్సు రద్దయింది.
ఫ చివ్వెంల మండలంలోని ఖాసీంపేట, మోదీన్‌పురం, తిమ్మాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.
ఫ చిలుకూరు మండలంలో గతంలో జానకీనగర్‌తండా-దూదియాతండా-సీత్లాతండాల మీదుగా నారాయణపురం వరకు బస్సు రద్దయింది. అదేవిధంగా బేతవోలు-జెర్రిపోతులగూడెం బస్సు, రామాపురం-ఆర్లెగూడెం-రామనగర్ మీదుగా కొండాపురం బస్సు కూడా రద్దయింది. ఈ మార్గాలకు బస్సులు పునరుద్ధరించాలని స్థానకులు, ప్రయాణికులు కోరుతున్నారు.
బస్సుల కోసం డిమాండ్ పెరిగింది : జానిరెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, నల్లగొండ
నల్లగొండ రీజియన్‌లో గత ఏడాది కాలంగా ప్రధానంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక గ్రామీణ రూట్లలో బస్సులు నడపాలనే డిమాండ్ ఎక్కువైంది. ప్రైవేట్ వాహనాల వినియోగం, డీజిల్ ధరలు పెరగడం, కేవలం విద్యార్థులు మాత్రమే వినియోగిస్తున్న నేపథ్యంలో కరోనాకు ముందు పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు ఆదరణ తగ్గి పూర్తినష్టాలు రావడంతో సర్వీసులు నిలిచాయి. కరోనా వల్ల మరికొన్ని సర్వీసులు ఆగాయి. అయితే ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక బస్సు ప్రయాణాలు పెరిగాయి. అదే క్రమంలో పల్లె రూట్లలో బస్సులు నడపాలని కోరుతున్నారు. ఈ డిమాండ్‌ను మేం ప్రభుత్వానికి నివేదించాం. కొత్త బస్సులు వస్తున్నా, ఇంకా కొత్త రూట్లలో ప్రవేశపెట్టేస్థాయిలో సరిపోవడం లేదు. పాత బస్సులను తొలగించి వాటి స్థానంలోనే కొత్త బస్సులు వస్తున్నాయి. ప్రజల డిమాండ్ మేరకు క్రమేపీ బస్సులు పెంచుకుంటూ వెళతాం. హైదరాబాద్ నుంచి ఇటు నల్లగొండకు, అటు యాదాద్రి జిల్లాకు రాత్రివేళ 9.30గంటల తర్వాత సర్వీసులు ఉండడం లేదనే సమస్యను పరిష్కరిస్తాం. శీతాకాలం ముగిశాక రాత్రి 10గంటల వరకకు బస్సు సర్వీసులు హైదరాబాద్ నుంచి ఈ రెండు జిల్లాలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం.