సాధారణ వర్షపాతమే
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:57 AM
జిల్లాలో వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. భారీ వానలు లేక చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. భూగర్భజల నీటిమట్టం మరింత దిగువకు పడిపోయాయి. అంతేగాక వానాకా లం సీజన్‌లో అంచనాల మేరకు పంటల సాగు నమో దు కాలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే యాసంగిలో పంటల సాగు కష్టతరమని రైతులు పేర్కొంటున్నారు.
భారీ వర్షాలులేక అడుగంటిన భూగర్భజలాలు
పూర్తిస్థాయిలో నిండని చెరువులు
గత ఏడాది 4.25మీటర్ల లోతులో భూగర్భజలమట్టం
ప్రస్తుతం 8.87మీటర్లకు పడిపోయిన వైనం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): జిల్లాలో వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. భారీ వానలు లేక చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. భూగర్భజల నీటిమట్టం మరింత దిగువకు పడిపోయాయి. అంతేగాక వానాకా లం సీజన్‌లో అంచనాల మేరకు పంటల సాగు నమో దు కాలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే యాసంగిలో పంటల సాగు కష్టతరమని రైతులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఈ నెల నాటికి 545.5మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 631.1మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 85.6మి.మీ అధిక వర్షపాతం నమోదైనా దీన్ని సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. అయితే జిల్లాలో ఆగస్టు నెల వరకు గుండాలు, చౌటుప్పల్, నారాయణపూర్, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట తదితర మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలతో గుండాల, మోత్కురు, చౌటుప్పల్, నారాయణపూర్, రాజపేట, ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్ మండలాల్లో సాధారణ వర్షపాతానికి చేరుకుంది. అయినా భారీ వర్షాలు లేక జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి పెద్దగా నీరు చేరలేదు. దీంతో భూగర్భజలాలలు అడుగంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి భూగర్భ నీటిమట్టం మరింత దిగువకు పడిపోయింది. గత ఏడాది సెప్టెంబరులో 4.25మీటర్ల లోతులో భూగర్భ నీటిమట్టం ఉండగా, ఈసారి 8.87మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాది కంటే అదనంగా 4.62మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలో అత్యధికంగా నారాయణపూర్ మండలంలో గత ఏడాదితో పోలిస్తే 12.82మీటర్ల లోతుకు నీటిమట్టం చేరింది.
యాసంగి సాగుకు కష్టకాలమే
జిల్లాలో అధిక శాతం మంది రైతులు బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అయితే భూగర్భజలాలు అడుగంటడంతో వ్యవసాయ బోరుబావులు ఎండుముఖం పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్‌లో సాధారణ వర్షపాతం 545.5మి.మీకు ఇప్పటివరకు 631.1మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం. జిల్లాలో 17 మండలాలకు తొమ్మి ది మండలాల్లో సాధారణ, మరో 8 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా చిరుజల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలే తప్ప భారీ వర్షాలు లేవు. గత ఏడాది జూలైలో భారీవర్షాలు కురవడంతో చెరువులన్నీ కళకళలాడాయి. ఈ చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు బోరుబావులను వేసుకున్నారు. అయితే ప్రస్తుతం చెరువుల్లో నీరు లేక భూగర్భజలాలు ఇంకిపోవడంతో యా సంగిలో పంటలు సాగుచేయలేని పరిస్థితిని రైతులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
నిండని చెరువులు
జిల్లాలో వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. జిల్లాలో మొత్తం 803 చెరువులు ఉన్నాయి. అందులో 0-25శాతం మేర నిండిన చెరువులు 319 ఉన్నాయి. 25-50శాతం మేర నిండినవి 198 చెరువులు, 50-75శాతం నిండిన చెరువులు 111 వరకు, 75-100 శాతం నిండిన చెరువులు 98 ఉన్నాయి. ఇక పూర్తిస్థాయిలో నిండి అలుగు పోసిన చెరువులు కేవలం 77 మాత్రమే ఉన్నాయి.
భారీ వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరక ఆయకట్టు సాగునోచుకోలేదు. అంతేగాక ఈ సారి చేపల పెంపకంపై కూడా ప్రభావం పడింది. గత ఏడాది 750 చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేపల పిల్లలను వదలగా, ఈసారి 450 చెరువులకే పరిమితం చేస్తూ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
గణనీయంగా పడిపోయిన నీటిమట్టం
జిల్లాలో సరిపడా వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. సంస్థాన్‌నారాయణపురం మండలంలో 19. 65 మీటర్ల లోతుకు భూగర్భ నీటిమట్టం పడిపోయింది. ఆత్మకూర్(ఎం)లో 17.22మీటర్ల లోతులో, బీబీనగర్‌లో 13.11మీ, రామన్నపేటలో 10.53మీ, తుర్కపల్లిలో 9.87 మీ, రాజపేటలో 9.87మీ, ఆలేరులో 9.84మీ, భువనగిరిలో 9.53 మీ, మో టకొండూరులో 8.99 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. బొమ్మలరామారంలో 8.67మీటర్ల లోతులో, మోత్కురులో 8.48మీ, యాదగిరిగుట్టలో 8.51మీ, గుండాలలో 8.20మీ, వలిగొండలో 5.41మీ, చౌటుప్పల్‌లో 3.86మీ, భూదాన్‌పోచంపల్లిలో 3.58మీ, అడ్డగూడూరులో 3.59 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ఆగస్టులో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా కాస్తా భూగర్భజలాలు మెరుగైనా, వచ్చే వేసవిలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.