రిజర్వేషన్లపై స్పష్టత కోసమే అభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:04 AM
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత కోసమే కులసంఘాలు, వ్యక్తులు, సంస్థలతో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన చైర్మన, విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు తెలిపారు.
నల్లగొండ టౌన, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత కోసమే కులసంఘాలు, వ్యక్తులు, సంస్థలతో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన చైర్మన, విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి బీసీ కులసంఘాలు, ఇతర కులసంఘాలు, వ్యక్తులు, సంస్థల నుంచి స్థానికసంస్థల్లో రిజర్వేషన్ల దామాషాపై ఆర్జీలను, విజ్ఞాపనపత్రాలను స్వీకరించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలో అనే ముఖ్యఉద్దేశంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక డెడికేటెడ్ కమిషన ఏర్పాటైందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేశామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశారన్నారు. త్వరలోనే ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జనాభాలో బీసీల శాతం మేరకు రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువమంది విజ్ఞాపనలు అందించారన్నారు. అదేవిధంగా పని కులాలను ఏ, బీ, సీ, డీలుగా విభజిస్తే బాగుంటుందని సూచించారని తెలిపారు. స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని కులాలకు తమకు అవకాశాలు కల్పించాలని, సమగ్ర సర్వే తదితర అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు అందాయని ఆయన తెలిపారు. అంతకుముందు జిల్లాకు చేరుకున్న డెడికేటెడ్ కమిషన చైర్మన వెంకటేశ్వరరావుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములునాయక్ ఘనస్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో వివిధ వర్గాల నుంచి ఆర్జీలను స్వీకరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సమాచార హక్కు పరిరక్షణ కమిటీ చైర్మన కేశవులు, పలు సంఘాల నేతలు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన కార్యదర్శి బీ సైదులు, డీఆర్‌వో అమరేందర్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నజీమ్‌అలీ, యాదాద్రి , సూర్యాపేట జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు యాదయ్య, అనసూయ, రాష్ట్ర బీసీ కార్పొరేషన అధికారి రమేష్ తదితరులు ఉన్నారు.