పీఏసీఎ్స చైర్మన్ల అధ్యయన యాత్ర
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:43 AM
నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) చైర్మన్లు అధ్యయన యాత్రకు వెళ్లనున్నారు.
24 నుంచి 29 వరకు కర్ణాటకలో పర్యటన
పీఏసీఎ్సల నిర్వహణ, అభివృద్ధిపై క్షేత్రస్థాయి పరిశీలన
నార్కట్పల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) చైర్మన్లు అధ్యయన యాత్రకు వెళ్లనున్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు కర్ణాటక రాష్ట్రంలో వారు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన నుంచి 25 ఉదయం బెంగళూరుకు చేరుకుంటారు. అదే రోజు కూర్టు, రాజాస్ర్టీట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. 26న మెడికేరి, దుబేరి, ఎలిఫెంట్ క్యాంపు, 27న మైసూర్, బృందావన గార్డెన, 28న శ్రీరంగపట్నం, చాముండీ హిల్స్ సందర్శించి అదే రోజు సాయంత్రం బెంగళూరు నుంచి తిరిగి సికింద్రాబాద్కు రైలులోనే బయలుదేరి 29న ఉదయం సికింద్రాబాద్కు చేరుకునేలా షెడ్యూల్ను డీసీసీబీ అధికారులు ఖరారు చేశారు.
పర్యటన ఉద్దేశం
కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటం అక్కడ పీఏసీఎ్సల నిర్వహణ, రైతు అవసరాలను తీరుస్తూ అవి ప్రగతిబాటలో కొనసాగుతున్న తీరును చైర్మన్లు స్వయంగా అధ్యయనం చేయనున్నారు. పీఏసీఎ్సలకు నిధుల సమీకరణ, స్వల్పకాలిక, ధీర్ఘకాలిక రుణాల పంపిణీ ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం సంఘం ద్వారా రుణాలు ఇచ్చే విఽధానం, రికవరీ పద్ధతులను వారు ఈ పర్యటనలో తెలుసుకోనున్నారు. కేంద్రం పీఏసీఎ్సలను మల్టీపర్పస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన నేపథ్యంలో సంఘాల నిర్వహణపై మరింత అవగాహన కోసమే ఈ అధ్యయన యాత్రకు జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారని చైర్మన్లు చెబుతున్నారు. కర్ణాటకలో లాభాల బాటలో నడుస్తున్న సంఘాలను సందర్శించి అవి అభివృద్ధి పథంలో కొనసాగడానికి చేపట్టిన సంస్కరణలు తదితర అంశాలను పరిశీలించి తెలంగాణలోనూ అదే మాదిరి విధానాన్ని అమలుపర్చే ఉద్దేశంతో ఈ అధ్యయన యాత్రకు చేపడుతున్నట్లు తెలుస్తుంది.
ఈ టూర్ మాకు ఎంతో ఉపకరించనుంది
కర్ణాటక రాష్ట్రంలో చేయనున్న ఎడ్యుకేషనల్ టూర్ మాకు ఎంతో ఉపకరిస్తుంది. ఆ రాష్ట్రంలో సహకార వ్యవస్థ నిర్వహణ తీరును మేం స్వయంగా తెలుసుకోగలిగే సదావకాశం. ఈ ఎడ్యుకేషనల్ టూర్ ద్వారా అక్కడి సహకార వ్యవస్థ నిర్మాణం, నిర్వహణలో వ్యత్యాసాన్ని, పద్ధతులను తెలుసుకోగలుగుతాం. సంఘ బలోపేతానికి దోహదపడే విధానాలను ఇక్కడ అమలుచేయగలిగే పరిస్థితులపై అవగాహన చేసుకుంటాం.
కసిరెడ్డి మధుసూదనరెడ్డి, నార్కట్పల్లి పీఏసీఎస్ చైర్మన