Share News

పల్లెలో విరిసిన పద్మం ‘కూరెళ్ల’

ABN , Publish Date - Jan 27 , 2024 | 12:55 AM

పల్లెటూరి కవి, విమర్శకుడు, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన కూరెళ్ల విఠలాచార్యకు అరుదైన గౌరవం దక్కింది.

పల్లెలో విరిసిన పద్మం ‘కూరెళ్ల’

మోత్కూరు, జనవరి 26 : పల్లెటూరి కవి, విమర్శకుడు, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన కూరెళ్ల విఠలాచార్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి సమాజానికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు విజ్ఞానాన్ని అందిస్తున్న ఆయన 2021 డిసెంబరు 6న మనకీబాతలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోగా, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ’ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో జన్మించిన కూరెళ్ల విఠలాచార్య విద్యార్థి దశ నుంచే కవితలు రాశారు. వెల్లంకి స్వగ్రామం కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రామన్నపేట మండలం మునిపంపులలో 1959లో చేరారు. 1960లో యాదగిరిగుట్ట మండలం వడాయిగూడెం పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆ గ్రామస్థులు తమ పిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. దాంతో పిల్లల తల్లిదండ్రులకే చదువు నేర్పాలన్న సంకల్పంతో ‘సచ్చేలోపు... సంతకమైనా నేర్చుకో.’.. అన్న నినాదంతో ఆయన వారికి పలకలు కొనిచ్చి తల్లిదండ్రులకు చదువు నేర్పించారు. వారి పిల్లలను బడికి పంపేలా కృషి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు.

కలం నుంచి 25 రచనలు

కూరెళ్ల విఠలాచార్య ఇప్పటివరకు 25 రచనలు చేయగా అందులో 22 ముద్రితమయ్యాయి. మిగిలిన మూడు పుస్తకాలు ముద్రించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన రచనల్లో విఠలేశ్వర శతకం, శిల్పాచార్యులు. తెలుగు నవలల్లో స్వాతంత్రోద్యమ చిత్రణ(పీహెచడీ సిద్ధాంత గ్రంథం), తెలుగులో గొలుసు కట్టు నవలలు(ఎంఫిల్‌ సిద్ధాంత గ్రంథం) పుస్తకాలు ఆయనకు బాగా పేరు తెచ్చాయి. వీటితో పాటు స్వాతంత్రోద్యమం-ఆంధ్రప్రదేశలోని దాని స్వరూపం, మధురకవి కూరెళ్ల పీఠికలు, స్మృత్యంజలి, కవితాచందనం, తెలంగాణ కాగడాలు- సీస మాలిక, కూరెళ్ల వ్యాసాలు, మా ఊరి వెలుగు, కవిరాజు ఏలె ఎల్లయ్య, చద్దిమూటలు, దొందూ దొందే, సింగి-సింగడు(నాటిక), మన కథ(బుర్ర కథ), హైదరాబాద్‌ సంస్థానం-నల్లగొండ జిల్లాలో రజాకార్ల దురంతాలు, కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌, వంద శీర్షికలు, వంద సీసాలు, తెలంగాణోద్యమ కవితలు, కూరెళ్ల నానీలు, గోవిలాపం పుస్తకాలను రచించి ముద్రించారు. మరో మూడు పుస్తకాలు ముద్రించాల్సి ఉంది.

ఇల్లే గ్రంథాలయం

విఠలాచార్య చదువుకునే సమయంలో పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందిపడ్డారు. తోటి విద్యార్థులు పగలు చదువుకున్నాక రాత్రి పడుకునే సమయంలో వారి వద్ద నుంచి పుస్తకాలు తీసుకుని రాత్రి చదివి ఉదయం తిరిగి ఇచ్చేవారు. నాడు భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాల్లో తప్ప గ్రంథాలయాలు అందుబాటులో ఉండేవికావు. పుస్తకాల కోసం ఎంతో ఇబ్బంది పడ్డ ఆయన గ్రామీణ విద్యార్థులు, యువకులు, పరిశోధకులకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాం తంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో వెల్లంకిలో స్థలం అడగ్గా ఎవరూ ఇవ్వలేదు. దీంతో తన సొంత ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేసి ఇంటిని సాహిత్య కుటీరంగా మార్చారు. తనకున్న ఆరు ఎకరాల భూమి పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇచ్చి, ఆ భూమికి ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షలను గ్రంథాలయానికి వెచ్చించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని 13 ఫిబ్రవరి 2014న అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు ప్రారంభించారు. ఆనాడు 5 వేల పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయం నేడు రెండు లక్షల పుస్తకాలతో రాష్ట్రంలో అతిపెద్డ గ్రామీణ గ్రంథాలయంగా నిలిచింది. 550చదరపు గజాల తన ఇంటి స్థలంలో సుమారు 200 బీరువాలు పట్టేలా, ఎక్కువ మంది కూర్చొని చదువుకునేలా విశాలమైన భవనం నిర్మించారు. ఆ భవనాన్ని ఫిబ్రవరిలో గవర్నర్‌ చేత ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గవర్నర్‌ తమిళిసైని కలిసి గ్రంథాలయ ప్రారంభానికి సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. గ్రంథాలయానికి ఎక్కువ పుస్తకాలు సేకరించేందుకు గాను ‘గ్రంథ భిక్ష’ పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తన శిష్యుల్లో జిల్లాకు ఒకరిని బాధ్యులుగా నిర్ణయించి, వారి ద్వారా దాతల నుంచి పుస్తకాలు సేకరించారు.

నిర్వహించిన పత్రికలు

బాపూ భారతి, మా తెలుగు తల్లి, వలివెలుగు, మన పురోగమనం, చిరంజీవి, ప్రియంవద, ముచికుంద, లేఖిని.

కూరెళ్ల ప్రోత్సాహంతో...

వెల్లంకిలో సత్యగాయత్రీ ఆశ్రమం, ఆచార్య కూరెళ్ల ఫౌండేషన, బతుకమ్మ తల్లి కళాబృందం, ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి భజనమండలి,అరుంధతి సేవా సంస్థ, పూర్వ విద్యార్థుల సమితి, మోత్కూరులో ప్రజాభారతి, నల్లగొండలో మిత్రభారతి, వలిగొండ కళాభారతి, చౌటుప్పల్‌లో అక్షర కళాభారతి,రామన్నపేటలో చైతన్య కళాస్రవంతి, సాహితీ స్నేహితులు, స్పందన, ఆత్మీయులు, బాల భాతి, యాదాద్రిభువనగిరి జిల్లా రచయితల సంఘం లాంటి సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తూ వాటి ద్వారా సాహిత్య, కళాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

అంకిత గ్రంథాలు

ఏనుగు నర్సింహారెడ్డి కావ్యం ‘నేనే’, డా.జనువాడ రామస్వామి ‘వేకుల రేఖలు, రాజదండం’, పెండెం జగదీశ్వర్‌ ‘ఆంధ్ర ప్రదేశ జానపద కథలు’ బండ్ల కృష్ణ’ కృష్ణ గీతాలు, బొడ్డు వెంకటేష్‌ ‘అష్టపదులు’, గంజి నర్సింహ ‘ముచికుంద మరియు ప్రేమ శతకం’, దాసోజు జ్ఞానేశ్వర్‌ ‘రణగీతం’ ఆయనకు అంకితమిచ్చారు.

కూరెళ్ల ఇతివృత్తంగా గ్రంథాలు

కూరెళ్లాన్వయ విఠలా(శతకం), కూరెళ్ల వారి జీవన రేఖలు(పద్యకావ్యం), సాహితీమూర్తి కూరెళ్ల, కూరెళ్ల జీవితం(పద్యకావ్యం), కూర్మిసరం, కవితల్లో కూరెళ్ల ఇతివృత్తంగా ప్రముఖులు పుస్తకాలు రాశారు. డాక్టర్‌ కూరెళ్ల వ్యక్తిత్వం-సాహిత్యంపై డాక్టర్‌ నాగపురి శ్రీనివాసులు, విఠలాచార్య విఠలేశ్వర శతకం-ఒక పరిశీలన అనే అంశంపై మల్లిఖార్జున పరిశోధక గ్రంథాలు రాశారు.

వరించిన పురస్కారాలు

విఠలాచార్య పలు పురస్కారాలను అందుకున్నారు. వాస్తు శిల్పి బీఎన.రెడ్డి, ప్రజాకవి సుద్దాల హన్మంతు, 1979 నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రధానాచార్య, రాష్ట్రోపాధ్యాయ సంఘం వారిచే నల్లగొండ స్వర్ణోత్సవ, నల్లగొండ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల చేత ‘ఆచార్య’ బిరుదు, 2019లో దాశరథి పురస్కారం. ఇప్పుడు పద్మశ్రీ వీటితో పాటు 35కు పైగా ఆయన వివిధ సంస్థల నుంచి అవార్డులు, 10 సంస్థల నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

కూరెళ్లకు పలువురి సన్మానం

కేంద్రం ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యను సీపీఎం నాయకులు ఘనంగా సన్మానించారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో విఠలాచార్యను కలిసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా పలు గ్రామాల సర్పంచలు, ఎంపీటీసీ సభ్యులు అభినందనలు తెలిపారు. ఆయా కార్యక్రమంలో మేక అశోక్‌రెడ్డి, కూరెళ్ల నరసింహచారి, జెల్లల పెంటయ్య పాల్గొన్నారు. వెల్లంకి సర్పంచ ఎడ్ల మహేందర్‌రెడ్డి విఠలాచార్యను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచలు, గ్రామ వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 12:55 AM