అద్దె భవనాల్లో అరకొర వసతులు
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:22 AM
స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ సొం త భవనాన్ని నిర్మించడంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వంతో విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు.
స్థలం ఉన్నా హాస్టల్ భవనాలు నిర్మించని ప్రభుత్వం
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
భువనగిరి టౌన, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ సొం త భవనాన్ని నిర్మించడంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వంతో విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర అద్దె భవనాల వసతి గృహాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం భువనగిరి ఖాజీ మహల్లాలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖకు సుమారు 1100 గజాల సొంత స్థలం ఉంది. ఆ స్థలంలో 1972లో సొంత భవనంలో ప్రారంభమైన ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో అధికారులు 2017లో హాస్టల్‌ను అద్దె భవనానికి తరలించారు. మరుసటి సంవత్సరం భువనగిరికి ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం కూడా మంజూరు అయ్యింది. ఆ హాస్టల్‌కూడా అప్పటి నుంచి అద్దె భవనంలోనే కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం సకాలంలో అద్దెలు చెల్లించకపోతుండడం, సరిపడా సౌకర్యాలు లేవని ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే ఆగ్రహావేశాలతో స్థానిక అధికారులు పలుమార్లు అద్దె భవనాలను మారుస్తున్నారు. అద్దె భవనం చిరునామా మారినప్పుడల్లా బాలికలు తమ సా మాగ్రిని చేతబట్టుకొని నూతన భవనంలోకి వెళుతున్నారు. హాస్టల్ వార్డెన్స, సిబ్బంది కూడా ఇదే దైన్య స్థితి కానీ సొంత స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ సొంత భవనాలను నిర్మించాలనే స్పృహ ప్రభుత్వానికి కొరవడిందని బాలికలతోపాటు తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.
ప్రతీ నెలా రూ.90వేల అద్దె
భువనగిరిలో అన్ని సంక్షేమ శాఖల హాస్టల్స్ కొనసాగుతున్నాయి. వాటిలో కొన్నింటికి సొంత భవనాలు ఉండగా మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కానీ ఎస్సీ, బాలికల వసతి గృహాలను నిర్మించేందుకు అనువైన స్థలం ఉన్నప్పటికీ సొంత భవనాలను నిర్మించకపోవడంతో రెండు వేర్వేరు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ప్రతీ నెలా రెండు అద్దె భవనాలకు ప్రభుత్వం సుమారు రూ.90వేల అద్దెను చెల్లిస్తోంది. బాలికల కళాశాల హాస్టల్‌లో ఏకంగా 180 మంది బాలికలు ఉండగా జనరల్ హాస్టల్‌లో సుమారు 60మంది పైబడి విద్యార్థినులు ఉంటున్నారు. కానీ అద్దె భవనాల్లో సరైన వసతులు లేక చదువుపై ఏకాగ్రత చూపలేకపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సుమా రు 7 సంవత్సరాల నుంచి అద్దె భవనాలకు వేలాది రూపాయలు అద్దెను చెల్లిస్తున్న ప్రభుత్వం అందుబాటులో ఉన్న స్థలంలో రెండు లేదా 3 అంతస్తుల్లో సొంత భవనాలను నిర్మిస్తే బాలికలకు పూర్తి వసతితో కూడిన భవనాలు సమకూరుతాయని, పైగా ప్రభుత్వానికి అద్దె భారం తప్పుతుందంటున్నారు. అయితే 2017లో సొంత భవనాన్ని ఖాళీచేసిన వెంటనే నూతన భవనానికి రూ.2కోట్లు మంజూరయ్యాయని, అప్పటి నేతలు, అధికారులు హంగామా చేశారు. కానీ వాస్తవంలో మాత్రం భిన్నంగా ఉంది. ఇప్పటికైనా సొంత భవనాలను నిర్మించి బాలికల వెతలను తీర్చాలని పలువురు కోరుతున్నారు.
సొంత భవనాల కోసం నివేదిక పంపాం
అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్స్‌తో బాలికలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది నిజమే. ప్రభుత్వ భవనాల్లో ఉండే వసతులు, సౌకర్యాలు అద్దె భవనాల్లో లభించవు. అయితే భువనగిరి ఖాజీమహల్లాలో నిరుపయోగంగా ఉన్న వెయ్యి గజాల స్థలంలో ఎస్సీ బాలికల వసతి గృహాల నిర్మాణానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వ బాబూ జగ్జీవనరామ్ చాత్రి నివాస్ యోజన పథకానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు, నిధులు మంజూరు కాగానే నిర్మాణ పనులు చేపడుతాం.
-ముక్కాల జయపాల్‌రెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారి