ఖిల్లా అభివృద్ధికి మార్గం సుగమం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:58 AM
కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీదర్శన్’ పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. ప్రతిపాదిత రోప్‌వే పనులకోసం 27 మంది రైతులనుం చి ఎకరం 13గుంటల భూమి సేకరణ పూర్తయింది. ఇందుకు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.67లక్షలను చెల్లించనుంది.
పూర్తయున ప్రైవేట్ భూమి సేకరణ
భువనగిరి టౌన్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీదర్శన్’ పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. ప్రతిపాదిత రోప్‌వే పనులకోసం 27 మంది రైతులనుం చి ఎకరం 13గుంటల భూమి సేకరణ పూర్తయింది. ఇందుకు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.67లక్షలను చెల్లించనుంది. ఈమేరకు భూ నిర్వాసితులు రెండు మూడు రోజుల్లో పర్యాటకశాఖకు భూమిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. రిజిస్ర్టేషన్ పూర్తయిన వెంటనే రూ.100 కోట్లతో ప్రతిపాదిత అభివృద్ధి పనులను చేపడతారు. ప్రస్తుతం సేకరించిన ఎకరం 13 గుంటల స్థలంలో రోప్‌వే బేస్ క్యాంపు నుంచి ఖిల్లా వరకు తీగల మార్గంకోసం పిల్లర్లను నిర్మిస్తారు. పిల్లర్ల వెంట ఇరువైపులా రోడ్డు నిర్మిస్తారు. కాగా రోప్‌వే బేస్ క్యాంపుకోసం బైపా్‌సరోడ్డు వెంట 2013లోనే రెండు ఎకరాల 38గుంటల ప్రైవేట్ స్థలాన్ని సేకరించి అప్పట్లోనే నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది. దీంతో అప్పటినుంచి వాయిదా పడుతున్న రోప్‌వే, తదితర అభివృద్ధి పనులకు ‘స్వదేశీదర్శన్’ పథకం ద్వారా ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఎల్‌అండ్‌టీ రూపొందించిన డీపీఆర్ ఆధారంగా పర్యాటకశాఖ టెండర్లను ఖరారు చేయనుంది. అభివృద్ధి పనుల్లో ప్రధాన అంకంగా పేర్కొనే భూ సేకరణ పూర్తికావడంతో స్థానికుల్లో ఖిల్లా అభివృద్ధి పనులపై అశలు, అంచనాలు చిగురుస్తున్నాయి. ఈ మేరకు అధికారులు శ్రద్ధ చూపుతూ అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.