రాజకీయ వేడి
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:41 AM
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు గడువు సమీపిస్తుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయవేడి పెరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడ మే లక్ష్యంగా నిర్దేశించుకున్న బీజేపీ, తొలి జాబితాలోనే భువనగిరి పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ, బీసీనేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌కు టికెట్‌ను ప్రకటించింది.
దూకుడు మీదున్న కమలదళం
కాషాయకండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే శానంపూడి
నల్లగొండ అభ్యర్థిగా ఆయనకు గ్రీన్‌సిగ్నల్..!
బలమైన అభ్యర్ధుల్నే బరిలో దించేందుకు గులాబీదళం వ్యూహం
నల్లగొండ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు గడువు సమీపిస్తుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయవేడి పెరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడ మే లక్ష్యంగా నిర్దేశించుకున్న బీజేపీ, తొలి జాబితాలోనే భువనగిరి పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ, బీసీనేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌కు టికెట్‌ను ప్రకటించింది. నల్లగొండ లోక్‌సభ స్థానంపైనా కన్నేసిన ఆ పార్టీ బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఆదివారం పార్టీలో చేర్చుకోవడంతో పాటు, ఆయనకు టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం హామీ ఇచ్చింది. నేడో, రేపో వెలువడే పార్టీ రెండో జాబితాలో నల్లగొండ అభ్యర్థిగా సైదిరెడ్డిని ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించడంతో ఉమ్మడి జిల్లాపై కమలదళం ప్రత్యేకంగా దృష్టి సారించిన విష యం బలపడుతోంది. రెండురోజుల క్రితం వరకు పార్టీ మారేందుకు ససేమిరా అని పేర్కొన్న సైదిరెడ్డి బీజేపీ అధిష్ఠానం నేరుగా రంగంలోకి దిగి చర్చలు జరపడంతో ఆదివారం బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎంపీ లు నగేశ్, సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో కలి సి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సైదిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా దాదాపు ఖరారవడంతో బీజేపీ ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు బలమైన అభ్యర్థులనే రంగంలోకి దింపి, కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో భారీ విజయాలు సాధించిన కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థిగా పీసీసీ రఽపధానకార్యదర్శిగా కుందూరు రఘువీర్‌రెడ్డికి టికెట్ ప్రకటించగా, భువనగిరి స్థానంలోనూ బలమైన అభ్యర్థినే బరిలో దింపే సంకేతాలిస్తోంది. బీఆర్‌ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించకపో గా, ఆ పార్టీకి చెందిన పూర్వనేతలనే బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దించుతుండడంతో గులాబీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా అంతా భావిస్తున్నారు. అధిష్ఠానం, ముఖ్యనేతలు మాత్రం కాంగ్రె స్, బీజేపీకి దీటైన అభ్యర్థులను నిలుపుతామని ప్రకటిస్తోంది. మొత్తంగా రెండు రోజుల్లో టిక్కెట్ల వ్యవహారం కొలిక్కిరానుండడంతో ఆసక్తికర రాజకీయాలు కనిపించనున్నాయి.
బీఆర్‌ఎ్‌సలో ‘గుత్తా’ కలకలం
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయు డు గుత్తా అమిత్‌రెడ్డి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని బీఆర్‌ఎస్ అధిష్ఠానానికి తెలియజేయడం ఆ పార్టీలో రాజకీయ దుమారం లేపింది. అసెంబ్లీ ఎన్నిక ల ఘట్టం ముగిసినప్పటి నుంచి అమిత్ బీఆర్‌ఎస్ తరఫున నల్లగొండ లేదా భువనగిరి స్థానాల్లో అధిష్ఠానం ఎక్కడ పోటీచేయమంటే అక్కడ నిలుస్తానని పేర్కొన్న అమిత్‌రెడ్డి, తాజాగా పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటించడం వెనక పార్టీలో అంతర్గత విభేదాలే కారణంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కాంగ్రె్‌సలో చేరుతారని, కీలక నేతను కలిశారని చర్చ జరిగినా, అలాంటి సమావేశమేదీ జరగలేదని, తాను బీఆర్‌ఎ్‌సను వీడడం లేదని, ఇదంతా ఊహాగానమేనని అమిత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకం డ్ల జగదీ్‌షరెడ్డి అమిత్‌రెడ్డిని పోటీచేయకుండా ఎవ్వరూ అడ్డుకోవడం లేదని, పోటీ చేస్తానని తానే ప్రకటించుకున్నారని, ఇప్పుడు అడ్డుకుంటున్నారని చెప్పడమేంటని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. రెండురోజుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని జగదీ్‌షరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి నల్లగొండ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచ ర్ల కృష్ణారెడ్డి, ఉద్యమనేత చాడకిషన్‌రెడ్డి, బీసీవర్గానికి చెందిన సుంకరి మల్లేశ్‌గౌడ్, ఎస్టీవర్గానికి చెందిన డాక్టర్ మాతృనాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ రాంచందర్‌నాయక్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భువనగిరి స్థానం నుంచి ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, క్యామ మల్లేశ్ తదితరుల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
భువనగిరి కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ
కాంగ్రెస్ నుంచి తొలి జాబితాలోనే నల్లగొండ స్థానానికి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డికి టికెట్ కేటాయించిన పార్టీ అధిష్ఠానం భువనగిరి సీటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు పట్టున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ తమ కుటుంబానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబడుతున్నట్టు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్‌కుమార్‌రెడ్డిలో ఒకరికి టికెట్ వస్తుందని కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు ఈ స్థానంలో పోటీచేసేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్‌నేత, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు కూడా టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ టికెట్ విషయం అధిష్ఠానం తేల్చేస్తుందని, పార్టీ వ్యూహకర్త సునీల్‌కనుగోలు బృందం నిర్వహించే సర్వే కూడా అభ్యర్థి ఎంపికలో కీలకమవుతుందని పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీలో చేరిన శానంపూడి సైదిరెడ్డి
హుజూర్‌నగర్, మార్చి 10: హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి ఆదివారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. సైదిరెడ్డికి తరుణ్‌చుగ్ బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు. బీఆర్‌ఎస్ నుంచి నల్లగొండ ఎంపీ టికెట్ కోసం సైదిరెడ్డి ప్రయత్నించగా, ఆ పార్టీ నిరాకరించిందని, బీజేపీ నుంచి అవకాశం ఇస్తామని హామీ ఇవ్వటంతో ఆయన ఆ పార్టీలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో చేరిన సైదిరెడ్డి ఆ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 7,600ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2019 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డిపై 43,435ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2023 నవంబరు 30న జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 44,888ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుంచి కొంతకాలం స్తబ్దుగా ఉన్న సైదిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.