పోస్ట్.. పోస్ట్
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:37 AM
వృత్తి ఏదైనా పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారు. భిన్నమైన పనివిధానమైనా మెరుగైన విధు లు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు మహి ళా పోస్టల్ ఉద్యోగులు. పోస్ట్ ఉమెన్‌గా, గ్రామీణ డాక్ సేవక్‌లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మందికిపైగా మహిళలు పనిచేస్తూ సత్తా చాటుతున్నారు.
ఈ రంగంలోనూ రాణిస్తున్న మహిళలు
ఓ వైపు ఇంటి పనులు.. మరోవైపు విధులు
ఆటంకాలెదురవుతున్నా ఆత్మస్థైర్యంతో ముందుకు
ప్రశంసలు అందుకుంటున్న పోస్ట్ ఉమెన్‌లు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): వృత్తి ఏదైనా పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారు. భిన్నమైన పనివిధానమైనా మెరుగైన విధు లు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు మహి ళా పోస్టల్ ఉద్యోగులు. పోస్ట్ ఉమెన్‌గా, గ్రామీణ డాక్ సేవక్‌లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మందికిపైగా మహిళలు పనిచేస్తూ సత్తా చాటుతున్నారు. ఓ వైపు గృహిణిగా ఇంటిని చూసుకుంటూనే మరోవైపు ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా రు. పని చేసే క్రమంలో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురవుతున్నా చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకెళ్తున్నారు. సైకిళ్లపై, బైక్‌లపె రయ్...రయ్‌మని వెళ్తూ విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సహోద్యోగు లు, అధికారుల ప్రశంసలతో పాటు, ప్రజల మన్ననలు పొందుతూ నేటి యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళా పోస్ట్ ఉమెన్‌లపై ప్రత్యేక కథనం.
పోస్ట్ ఉమెన్, గ్రామీణ డాక్‌సేవక్ మిగతా ఉద్యోగాల్లా ఉండదు. పనివేళలు మొదలు, పని విధానం వరకు అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఇతర ఉద్యోగుల్లా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగం కాదు. కార్మికుల్లా ఎండైనా, వానైనా, చలైనా వెరకవకుండా పార్సిళ్ల బ్యాగులను మెడకు వేసుకొని ఇంటింటికీ తిరిగి అందజేయాల్సి ఉంటుంది. తెల్లవారుజామునే లేచి ఇంట్లో పనులు పూర్తిచేసుకొని, యూనిఫామ్ వేసుకొని సైకిల్‌పైనో, స్కూటీపైనో 8గంటలకు పోస్టాఫీసుకు చేరుకుంటారు. అక్కడ అధికారులు, సూపర్‌వైజర్ల నేతృత్వంలో సార్టింగ్ పూర్తయ్యాక బ్యాగులను, పార్సిళ్లను తీసుకొని అడ్రసుల జాబితా వెంటపెట్టుకొని వెళ్తారు. అడ్రస్ దొరక్కపోతే ఫోన్లు చేసి కనుక్కోవాలి. ఫోన్లో మాట్లాడే వారి భాష అర్థం కాకపోతే పక్కనున్న ఇంకొకరితో మాట్లాడించాలి. అంతేకాదు, కొందరు ఇచ్చిన అడ్రస్ సరిపోలకపోతే ఆ పార్సిల్‌ను మరోసారి క్రాస్ చెక్ చేసే బాధ్యత వీరిదే. పనిచేసే క్రమంలో కొన్నిచోట్ల మద్ధతు, ఆదరణ లభిస్తుంటే, మరికొన్ని చోట్ల మహిళలనే చులకన భావన, చిన్న చూపును వీరు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ అధిగమిస్తూ విధి నిర్వహణలో ముందుకెళ్తున్నారు. పేరుకు 8గంటల డ్యూటీ అయినా ఒక్కో రోజు 10 నుంచి 12గంటల వరకు సైతం పనిచేయాల్సి వస్తుంది. డ్యూటీ చార్ట్ ప్రకారం కేవలం పోస్ట్ ఉమెన్‌గా విధులేగాక, అదనంగా పోస్టల్‌శాఖ ఇటీవల చేపట్టిన ఇన్సూరెన్స్ పాలసీలు, డిపాజిట్లసేకరణ, పలు రకాల స్కీముల నిర్వహణ చేస్తూ అదనపు టాస్క్‌లను కూడా విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. పురుష ఉద్యోగులకు ధీటుగా వృత్తిలో రాణిస్తూ ఈ పోస్ట్ ఉమెన్‌లు ఆదర్శంగా నిలుస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు
పోస్ట్ ఉమెన్ క్షేత్రస్థాయిలో పార్సిళ్ల డెలివరీ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు పలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేఖలు మొద లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, ఇంటర్వ్యూ లెటర్లు, పాన్‌కార్డులు, ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులతో పాటు మరోవైపు పుస్తకాలు, రకరకాల పార్సిళ్లు పోస్టు ద్వారా వస్తే వాటిని సదరు అడ్ర్‌సలో డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టల్‌శాఖ నిబంధనల ప్రకారం కొన్నింటికి ఎలాంటి అకనాలెడ్జ్‌మెంట్ అవసరం లేకుండా డెలివరీ ఇస్తే సరిపోతుంది. మరికొన్నింటికి మాత్రం డెలివరీ తీసుకున్నట్టు సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నిబంధనలు తెలిసిన వారు సంతకం పెడుతుంటే, మరికొందరు మాత్రం సంతకం చేసేదిలేదని మొండికేస్తున్నారు. దీంతో ఇబ్బందులుపడుతున్నామని పోస్టల్ ఉమెన్‌లు పేర్కొంటున్నారు. ప్రధానంగా అడ్రస్ దొరక్కపోతే, వారి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి, వారిని వెతికి పట్టుకొని ఇవ్వాల్సి వస్తోందని, ఇలాంటి సమయంలో తమ బీట్ పరిధి దాటి వెళ్లాల్సి వస్తుండటంతో సమ యం ఎక్కువ పడుతోందని చెబుతున్నారు. లీగల్ నోటీసులు, బ్యాంకు నోటీసుల వంటివి వచ్చినప్పుడు కొందరు వాటిని చదివాక రిసీవ్ చేసుకుంటామని సతాయిస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో ఇబ్బంది ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. మరికొందరు ఇళ్లలోనే ఉండి కూడా తాము లేమని చెబుతుంటారని, ఆ లేఖ లేక నోటీస్ వారిది కాదని పేర్కొంటుంటారని, ఇలాంటి సమయాల్లో సమయం ఎక్కువ తీసుకోవడంతోపాటు చిరాకు కలుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికీ కొందరు పోస్ట్ ఉమెన్‌లతో అమర్యాదకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేయబుతున్నారని, గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ, చిన్నబుచ్చే ప్రయత్నాలు చేయడం మానుకునేలా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఒక్కోసారి పార్సిళ్ల బరువు అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మోయడం ఇబ్బంది కలుగుతుంది. నిర్ణీత బరువుకంటే ఎక్కువగా పార్సిల్స్ ఉన్నప్పుడు వర్క్‌షేర్ చేసేలా నిబంధనలు సడలించాలని వీరు కోరుతున్నారు. మరోవైపు ప్రతి రోజూ అదనపు సమయం కూడా పనిచేయాల్సి వస్తోందని, దీనికి ఓవర్ టైమ్ పేమెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. జాబ్‌చార్ట్ దాటి ఇన్సూరెన్స్‌లు, ఇతరత్రా టాస్క్‌లు కూడా చేస్తున్నామని, వాటి లక్ష్యాని చేరకుంటే తమను ఇబ్బంది పెట్టకుండా ఉన్నతాధికారులు చూడాలని కోరుతున్నారు.
కుటుంబ సభ్యుల మద్దతు ఉండటం వల్లేఞ: ఎం.కవిత, పోస్ట్‌ఉమెన్, శివాజీనగర్, నల్లగొండ
ఇతర ఉద్యోగాలకంటే కొంత భిన్నమైన పనివిధానం ఈ ఉద్యోగంలో ఉంటుంది. ఇంటింటికీ తిరిగి పోస్టల్ పార్సిళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అడ్ర్‌సలు దొరక్క ఇబ్బందిపడాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో మహిళలుగా ఇబ్బంది పడుతుంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలో బిజీగా ఉండాల్సి వస్తున్నా, మా కుటుంబీకులు పూర్తి మద్దతుగా నిలుస్తుండటం వల్లే మేం ఈ వృత్తిలో రాణించగలుగుతున్నాం. ఏ రోజు పని ఆ రోజే పూర్తిచేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో సహోద్యోగులు, అధికారులు మాకు అండగా ఉంటుండడంతో ఇబ్బందిలేకుండా పని పూర్తిచేయగలుగుతున్నాం.
నిబంధనలు తెలియక కొందరు ఇబ్బంది పెడుతుంటారు: కొలని కవిత, పోస్ట్ ఉమెన్, నల్లగొండ
మహిళగా ఉద్యోగాన్ని నిర్వర్తించడంలో ఏనాడూ ఇబ్బంది పడలేదు. పోస్ట్‌మెన్ లాగానే నేను కూడా ఉదయాన్నే వచ్చి మాకిచ్చిన పార్సిళ్లు తీసుకొని ఇంటింటికీ వెళ్లి డెలివరీ ఇచ్చి వస్తాం. అయితే కొందరు పోస్టల్ రూల్స్ తెలియక సతాయిస్తుంటారు. పాన్‌కార్డులు, పాస్‌పోర్టుల వంటివి డెలవరీ ఇచ్చినప్పుడు ఎకనాలెడ్జిమెంట్‌పై సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొందరు చక్కగా అర్థం చేసుకొని సహకరిస్తారు. కొందరు మాత్రం మేం సంతకం ఎందుకు పెట్టాలి... మేం సంతకం పెట్టేది లేదని సతాయిస్తుంటారు. అలాంటప్పుడు వారికి నచ్చజెప్పడం, విషయాన్ని వివరించడం కొంత ఇబ్బందిగా ఉంటోంది. మాకు ఒక్కో డెలివరీకి సగటున రెండు నిమిషాలే సమయం ఉంటుంది. కానీ, మొత్తం డెలివరీలు పూర్తయ్యేటప్పటికి అదనపు సమయమే పడుతోంది. అయినా వందశాతం పని పూర్తయ్యాకే విధులు ముగిస్తాం.
నేను చేరిన రోజుల్లో వింతగా చూసేవారు: గాదెపాక భాగ్యమ్మ, హెడ్ పోస్ట్‌ఉమెన్, నల్లగొండ
నేను 2010లో పోస్ట్ ఉమెన్‌గా విధుల్లో చేరా. అప్పట్లో నేను ఒక్కదాన్నే మహిళను. మిగతా అందరూ పురుషులే. పోస్టు డెలవరీలు ఇవ్వడానికి వెళ్లినప్పుడు నన్ను అందరూ విచిత్రంగా చూసేవారు. మా కొలీగ్స్, అధికారులు మాత్రం బాగా సపోర్టివ్‌గా ఉండేవారు. అప్పట్లో మహిళలు ఈ ప్రొఫెషన్‌లోకి రావాలంటే కొంత జంకేవారు. ఇప్పడు పరిస్థితి మారింది. పురుషులతో సమానంగా మహిళలు ఇప్పుడు రాణిస్తున్నారు. ఇప్పుడు పోస్ట్ ఉమెన్స్ కూడా ధైర్యంగా పనిచేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు బైక్స్, మోపెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో నేను సైకిల్‌పై, లేకపోతే నడిచివెళ్లి డెలివరీలు ఇచ్చేదాన్ని. నా తోటి సిబ్బంది, అధికారులు, కుటుంబీకులు ఇచ్చిన మద్దతు వల్లే ఇంతదూరం ప్రయాణించి ఇప్పుడు హెడ్‌పోస్ట్ ఉమెన్‌గా పనిచేస్తున్నా.
తోబుట్టువుల్లా ఆదరిస్తుండడం వల్లే: పి.కవిత, పోస్ట్ ఉమెన్, గాంధీనగర్, నల్లగొండ
నేను రెండేళ్లుగా పోస్ట్ ఉమెన్‌గా పనిచేస్తున్నా. ఇటు కార్యాలయంలో తోటి సిబ్బంది, అటు ప్రజలు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. తోబుట్టువుల్లా పలకరిస్తారు. పనిలో తోడ్పాడునందిస్తుంటారు. ఎండ సమయంలో డెలివరీలకు వెళ్లినప్పుడు పలువురు ఇళ్ల వద్ద మంచినీళ్లు తాగాలని, మరికొందరైతే ఆత్మీయంగా భోజనం చేయాలని, కాసేపు కూర్చోవాలని చెబుతుండడం మాకు ఉత్సాహాన్నిస్తోంది. సొంత కుటుంబసభ్యుల మాదిరిగా మాకు మద్దతుగా ఉంటున్నారు. పోస్టల్ డెలివరీలలో ఒక్కోసారి ఎక్కువ పార్సిళ్లు న్నప్పుడు ఇంటివెళ్లడం ఆలస్యమవుతోంది. ఇంట్లో కూడా మాకు పూర్తి మద్దతు లభిస్తుండటం వల్లే మేం విజయవంతంగా ఈ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం.
కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకుంటూ: ఆరూరి జానమ్మ, పోస్ట్ ఉమెన్, బోయవాడ, నల్లగొండ
మహిళలమైనప్పటికీ అందరు ఉద్యోగుల్లానే మేం పోస్ట్ ఉమెన్‌గా మా విధులు విజయవంతంగా నిర్వర్తిస్తున్నాం. ఆఫీసు నుంచి ఏ టాస్క్ ఇచ్చినా కష్టపడి, అందరి ప్రోత్సాహం, మద్దతుతో నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేస్తాం. ఏరోజు డెలివరీలు ఆ రోజే వందశాతం ఇచ్చేస్తాం. మహిళలుగా కుటుంబాన్ని ఓవైపు చూసుకుంటూ, మరోవైపు ఉద్యోగం చేస్తున్నాం. రెండువైపులా సమన్వయం చేసుకునే క్రమంలో ఇక్కడ సహోద్యోగులు, అధికారులు సహకరిస్తుంటే, అక్కడ భర్త, పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు అండగా ఉంటున్నారు. అందువల్లే భిన్నమైన ఈ ఉద్యోగాన్ని మేం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చేయగలుగుతున్నాం.
బాగా పనిచేస్తున్నారు: ఎర్ర స్వర్ణలత, హెడ్‌పో్‌స్టమాస్టర్, నల్లగొండ
పోస్ట్ ఉమెన్, జీడీఎస్ (ఉమెన్) చాలా బాగా పనిచేస్తున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా 100శాతం పోస్టల్ డెలివరీలతో పాటు, డిపార్ట్‌మెంట్ ఇస్తున్న ఇతర టాస్క్‌లు కూడా నెరవేరుస్తున్నారు. బీమా పాలసీలు, పికప్ సర్వీసులు కూడా నిర్వర్తిస్తున్నారు. నిర్ణీత సమయం 8గంటలే అయినప్పటికీ పని గంటలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 15 ఏళ్ల క్రితం కంటే ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా జాయినవుతున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం.