‘ప్రజావాణి’ దరఖాస్తులు పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:04 AM
‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు.
నల్లగొండ టౌన, జనవరి 29: ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని వాటిని శాఖల వారీగా అధికారులకు పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత కేశవ్‌పాటిల్, జె.శ్రీనివాస్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
పట్టభద్రులు ఓటర్‌గా నమోదు చేసుకోవాలి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటు హక్కుకోసం అర్హులైనవారు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2023 నవంబరు 1కి మూడేళ్ల ముందు డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తర్ణులైన వారు ఓటరుగా నమోదుకు అర్హులని తెలిపారు. దరఖాస్తుకు చివరి గడువు ఫిబ్రవరి 6వ తేదీ అని తెలిపారు.
జంతు సంక్షేమ నిబంధనలు పాటించాలి
జంతు సంక్షేమం కోసం రూపొందించిన నిబంధనలను ప్రతీ ఒక్కరు పాటించాలని కలెక్టర్ హరిచందన అన్నారు. జంతు సంక్షేమ పక్షోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. పక్షోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని పశువు వైద్యశాలలో శునకాలకు రెబిస్ వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీడీ సుబ్బారావు, సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు, రాజకొండరెడ్డి, డాక్టర్ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తుల కోసం పీఎం విశ్వకర్మ పథకం
కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింని కలెక్టర్ హరిచందన తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 18 రకాల వృత్తుల వారు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.