కుటుంబ సర్వేకు సన్నద్ధం
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:40 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వేకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈనెల 6వ తేదీ నుంచి సర్వే పూర్తిస్థాయిలో ప్రారంభంకానుంది.
6వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం
ఉమ్మడి జిల్లాలో 8వేల మంది ఎన్యూమరేటర్లు
తొలుత ఇంటింటికీ స్టిక్కరింగ్‌తో పాటు నెంబర్లు
(ఆంధ్రజ్యోతి.నల్లగొండ,యాదాద్రి,సూర్యాపేట కలెక్టరేట్): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వేకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈనెల 6వ తేదీ నుంచి సర్వే పూర్తిస్థాయిలో ప్రారంభంకానుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను ఎన్యూమరేటర్లు నిర్వహించనున్నారు.
సమగ్ర సర్వే సందర్భంగా అన్ని గ్రామాలతోపాటు, పట్టణాల్లో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు. అనంతరం సర్వే పూర్తయినట్టు ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించి నెంబర్లు కేటాయిస్తారు. ఎన్యూమరేటర్లు మ్యాప్‌తో ఇళ్ల జాబితాను, పూర్తి వివరాలను వారి వద్ద ఉంచుకుంటారు. ఎన్యూమరేటర్‌కు ఏవైనా సందేహాలు వస్తే వారికి సూపర్‌వైజర్లు, మండలస్థాయి అధికారులు అందుబాటులో ఉండి అనుమానాలను నివృత్తి చేస్తారు. ఎన్యూమరేటర్లు పూర్తి చేసిన ఫాంలను, ఇళ్లకు అతికించి న స్టిక్కర్లును ఆయా ఇళ్ల జాబితాను సూపర్‌వైజర్లు పరిశీలిస్తారు. మునిసిపల్ పట్టణ ప్రాంతాల్లో నిర్దేశించిన ఎన్యూమరేటర్‌లతో పాటు రిజర్వ్‌లో మరికొంత మంది ఎన్యూమరేటర్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచుతున్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు,ఎన్యూమరేటర్ల సర్వేను పరిశీలిస్తారు. సమగ్ర కు టుంబ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజల సహకారం తప్పనిసరి నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం సర్వేపై వారికి సమాచారం ఇచ్చే ఆలోచనలో ఉంది.
ఇంటింటి సర్వేకు 8వేల మందికిపైగా
ఉమ్మడి జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వేకు మొత్తం 8వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు అవసరం. నల్లగొం డ జిల్లాలో 4వేల మంది అవసరం కాగా, ఇప్పటికే సుమారు 2,800మంది అందుబాటులో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 2,600మంది, యాదాద్రి జిల్లాలో 1,800 అవసరం. నల్లగొండ జిల్లాలో సుమారు 5లక్షల కుటుంబాలు, యాదాద్రి జిల్లాలో మొత్తం 2,31,896 కుటుంబాలను ఎన్యూమరేటర్లు సర్వే చేయనున్నారు. ఎన్యూమరేటర్లుగా అత్యధికంగా టీచర్లను నియమించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఎన్యూమరేటర్లలో తొల ుత కొంతమందిని నియమించి మిగతా వారిని తరువాత తీసుకోనున్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ శాఖల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీఆర్‌పీలను ఎన్యూమరేటర్‌లుగా తీసుకోనున్నారు. సర్వే నిర్వహించిన అనంతరం వెంటనే డేటా ఎంట్రీ చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను, సిస్టమ్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఎన్యూమరేటర్‌లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు తయారు చేసి ఇవ్వడంతో పాటు స్టిక్కర్లను ఇప్పటికే ముద్రించి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా ఎస్జీటీ టీచర్లతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో ఈనెల 4, 5వ తేదీన శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల టీచర్లతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇతర శాఖల సిబ్బంది సహకారం కూడా తీసుకోనుంది.
పకడ్బందీ నిర్వహణ కోసం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఇళ్ల జాబితాను తయారు చేయడంతోపాటు సమగ్ర కుటుంబ సర్వేపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. సర్వే వివరాల సేకరణ అనంతరం ఏకకాలంలో డేటాను కంప్యూటరైజేషన్ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డేటా ఎంట్రీలో తప్పుడు వివరాలు నమోదు కాకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సర్వే విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ప్రతీ ఎన్యూమరేటర్ 150 ఇళ్లను సర్వే చేయనున్నారు. ఈనెల 6వ ప్రారంభంకానున్న ఈ సర్వే 19వ తేదీ వరకు కొనసాగనుంది.
పకడ్బందీగా కుటుంబ సర్వే: ఇలా త్రిపాఠి, నల్లగొండ జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. సమగ్ర ఇంటింటి సర్వేకు జిల్లాలో 4వేల మంది ఎన్యూమరేటర్లు అవసరం కాగా, ఇప్పటికే 2,800మంది అందుబాటులో ఉన్నారు. ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా తీసుకున్నాం. సర్వే అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్‌లతో వివరాలను ఆన్‌లైన్ చేస్తాం. సమగ్ర ఇంటింటి సర్వేపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో విస్తృత ప్రచారం చేశాం. సర్వే నిర్వహించే ఎస్జీటీ టీచర్లకు ఈనెల 4, 5 తేదీల్లో శిక్షణ కూడా ఇస్తాం.