Share News

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సన్నాహాలు

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:56 AM

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అక్కడక్కడ నిర్మించగా, అవి కొన్ని చోట్ల పూర్తికాగా, మరికొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచాయి. కనీసం పూర్తయిన ఇళ్లను సైతం గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించలేదు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సన్నాహాలు

ప్రతీ నియోజకవర్గానికి 3,500 కేటాయింపు

ఉమ్మడి జిల్లాలో తొలిదశలో 42వేల ఇళ్లకు ఆర్థికసాయం

సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం

అర్హుల ఎంపికకు ప్రత్యేక యాప్‌

వారంలోగా ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం

నల్లగొండ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అక్కడక్కడ నిర్మించగా, అవి కొన్ని చోట్ల పూర్తికాగా, మరికొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచాయి. కనీసం పూర్తయిన ఇళ్లను సైతం గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించలేదు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అబాసుపాలైంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక పేదలకు సొంతింటి కలపై దృష్టిసారించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున స్థలం ఉన్నవారికి ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొలిదశలో 42వేల ఇళ్లకు ఆర్థికసాయం మంజూరుకానుంది. జనాభా ప్రాతిపాదికన ప్రతీ గ్రామానికి ఎన్ని ఇళ్లకు సాయం కేటాయించాలనే దానిపై స్థానిక అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా అర్హులను ఎంపిక చేసి గ్రామసభల్లో జాబితాను ప్రదర్శించి, ఆ తరువాత ప్రకటిస్తారు. తొలుత సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే సాయం అందించనుంది. అందుకు అర్హుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన యాప్‌ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను రూపొందించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వివరాలతో సరిపోల్చేందుకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిసింది.

త్వరలో ఇందిరమ్మ కమిటీలు

ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇందిరమ్మ కమిటీలపై అధికారులు అక్టోబరు 20వ తేదీన ప్రభుత్వానికి నివేదించారు. ఈ కమిటీలను ఈ వారంలోగా ఆమోదించనున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాకు నియమించే ఇన్‌చార్జీ మంత్రి ఈ కమిటీలను ఆమోదించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేట జిల్లాలో 475, యాదాద్రి జిల్లాలో 421 పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా మూడు జిల్లాలో 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. అటూ పంచాయతీలు, ఇటూ మునిసిపాలిటీల్లోనూ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. పంచాయతీల్లో కార్యదర్శి ఇందిరమ్మ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మునిసిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఇతర అధికారులు బాధ్యులుగా ఉంటారు. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు ఆమోద ప్రక్రియ పూర్తి అయితే లబ్ధిదారుల ఎంపికలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. అదేవిధంగా ఈనెల 15వ తేదీ నుంచి గ్రామసభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో కమిటీలో ఐదుగురిని నియమించారు. గతంలో ప్రజాపాలన సందర్భంగా ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 6వ తేదీ నుంచి పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక చేపడుతారు.

రాజకీయ నేతల జోక్యం లేకుండా నివారించేనా?

గ్రామ, పట్టణస్థాయిలోని వార్డుల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులను ధ్రువీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లు లేనందున కార్యదర్శులకు బాధ్యత ఇవ్వగా, పట్టణ స్థాయిల్లో మాత్రం వార్డు కౌన్సిలర్లు ఇందిరమ్మ కమిటీల్లో ఉన్నారు. అయితే రాజకీయ జోక్యం లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం అధికారుల బాధ్యత. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నాయకులు జోక్యం ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులు 400చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలి. అందుకు ప్రభుత్వం రూ.5లక్షలు సాయంగా అందించనుంది. ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా నిర్వహించే యోచనలో ఉంది. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు ఆమోదం వస్తే పథకం వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి కూడా ఇబ్బందే. ఇక ఇళ్లు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే నియోజకవర్గానికి కేవలం 3,500 ఇళ్లు అంటే ఒక్కో గ్రామానికి ఎన్ని మంజూరవుతాయో తెలియదు. ఈ కేటాయిపు కూడా సమస్యగా మారే అవకాశం ఉంది. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం వచ్చే ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి ఇళ్ల సంఖ్యను పెంచుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 05 , 2024 | 12:56 AM