రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 23 , 2024 | 12:49 AM
ఏళ్లుగా బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించారు.
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోదీరాందేవ్
విద్యార్థుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
భువనగిరి కలెక్టరేట్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్ధుల ఫీజు బకాయిలు రూ.7,500కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ విద్యార్థికి రూ.20వేల స్కాలర్‌షిప్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాలను రూ.5వేల నుంచి రూ.20వేల వరకు, ఇంటర్ చదివే విద్యార్థులకు రూ.1,800 నుంచి రూ.15వేలకు పెంచాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ విద్యార్థికి విదేశీ విద్య స్కాలర్‌షిప్ ఇవ్వాలన్నారు. గురుకులాలకు మెరుగైన వసతులతో సొంత భవనాలు నిర్మించడమేగాక, ప్రతీ నియోజకవర్గానికి రెండు గురుకులాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐఐటీ, ఐఐఎం కోర్సులు చదివిన వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంతోపాటు పోటీ పరీక్షల కోసం జిల్లాకు మూడు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపితే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వట్టె మధు, కరుణాకర్‌రెడ్డి, చందు, బాలాజీ, విజ్ఞ, జశ్వంత్, మానస, శిరీష, రమాదేవి, ఉషశ్రీ, తదితరులు పాల్గొన్నారు.