Share News

హైకోర్టు ఉత్తర్వుతో నిలిచిన అవిశ్వాస ఫలితం

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:11 AM

హైకోర్టు ఆదేశంతో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్‌ చైర్మన ముప్పారపు రామయ్యపై అవిశ్వాస ఫలితాన్ని నిలిపివేసినట్లు జిల్లా కోఆపరేటివ్‌ అధికారి శ్రీధర్‌ తెలిపారు.

హైకోర్టు ఉత్తర్వుతో నిలిచిన అవిశ్వాస ఫలితం
విజయం తమదేనని ప్రకటిస్తున్న డైరెక్టర్లు

గరిడేపల్లి, ఫిబ్రవరి 2 : హైకోర్టు ఆదేశంతో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్‌ చైర్మన ముప్పారపు రామయ్యపై అవిశ్వాస ఫలితాన్ని నిలిపివేసినట్లు జిల్లా కోఆపరేటివ్‌ అధికారి శ్రీధర్‌ తెలిపారు. శుక్రవారం కీతవారిగూడెంలోని పీఏసీఎస్‌ సంఘ కార్యాలయంలో చైర్మనపై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. అయితే అవిశ్వాసంపై చైర్మన హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 5వ తేదీ వరకు ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 5వ తేదీ తర్వాత హైకోర్టు సూచనల ప్రకారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాయినిగూడెం పీఏసీఎస్‌ పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉండగా అందులో కాంగ్రెస్‌ పార్టీ నలుగురు, మిగిలిన తొమ్మిది మంది బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. అనంతరం చైర్మనగా కాచవారిగూడెం గ్రామానికి చెందిన ముప్పారపు రామయ్య, కీతవారిగూడెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి రామనాథంను వైస్‌చైర్మనగా ఎన్నుకున్నారు. కొంతకాలానికి ఒక డైరక్టర్‌ చనిపోగా 12 మంది డైరెక్టర్లు ప్రస్తుతం ఉన్నారు. అందులో బీఆర్‌ఎ్‌సకు చెందిన 8మందిలో ఐదుగురు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ బలం తొమ్మిదికి చేరింది. బీఆర్‌ఎస్‌ బలం మూడుకు పడిపోయింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పావులు కదిపి చైర్మన అక్రమాలపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ జనవరి 10న జిల్లా కోఆపరేటివ్‌ అధికారికి 9 మంది డైరెకర్లు నోటీసు అందించారు. అవిశ్వాసం ఈ నెల 2వ నిర్వహిస్తామని డీసీవో ప్రకటించారు. అయితే జనవరి 24న చైర్మన హైకోర్టును ఆశ్రయించగా ఫలితాన్ని ప్రకటించవద్దని స్టే ఇచ్చింది. ఇదిలా ఉండగా శుక్రవారం తొమ్మిది మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరయ్యారు. చైర్మన ముప్పారపు రామయ్య, వైస్‌చైర్మన బొల్లెపల్లి రామనాథం మరో బీఆర్‌ఎస్‌ డైరక్టర్‌ హాజరుకాలేదు. తొమ్మిది మంది సమావేశానికి రావడంతో కోరం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. అనంతరం హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 5 వరకు ఫలితాన్ని వాయిదా వేస్తున్నట్లు డీసీవో శ్రీధర్‌ తెలిపారు.

పీఏసీఎ్‌సను భ్రష్టుపట్టించారు: అల్లం ప్రభాకర్‌రెడ్డి

రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద పీఏసీఎ్‌సగా రైతులకు సేవలందిస్తున్న రాయినిగూడెం పీఏసీఎ్‌సను బీఆర్‌ఎస్‌ నాయకులు, చైర్మన భ్రష్టుపట్టించారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసాన్ని ఎదుర్కోలేక కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అందుకు చైర్మన, వైస్‌చైర్మనలు సమావేశానికి హాజరు కాలేదన్నారు. త్వరలో చైర్మనను ఎన్నుకుంటారని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయంలో గోదాం నిర్మాణ సమయంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, బ్యాంకులో దొంగతనం జరిగిందని అప్పటి అధికార పార్టీ అండతో నిజాన్ని బయటికి రాకుండా నిలువరించారని ఆరోపించారు. చైర్మన ఎన్నిక జరిగిన వెంటనే పీఏసీఎ్‌సలో అక్రమాలను రైతులకు తెలియజేస్తామన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 12:11 AM