రహదారే జీవనాధారం
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:41 AM
అది జాతీయ రహదారి రోజుకు వేలాది వాహనాలు అటు ఇటు మెరుపు వేగంతో దూసుకుపోతుంటాయి.
ప్రమాదకరమని తెలిసినా..రోడ్డు పక్కనే చిరు వ్యాపారం
సీతాఫలాలు, జామ, మామిడి, తాటి ముంజలు విక్రయాలు
పొద్దంతా కష్టించినా పూట గడవడం కష్టమే..
బీబీనగర్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అది జాతీయ రహదారి రోజుకు వేలాది వాహనాలు అటు ఇటు మెరుపు వేగంతో దూసుకుపోతుంటాయి. రెప్ప మాటున ఆదమరిస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఉదయం నుం చి సాయంత్రం వరకు ఎండనకా..వాననకా చేతి లో పండ్ల కవర్లు పట్టుకుని గంటల తరబడి ఎండ లో నిలుచుంటారు. వాటిని విక్రయించేందుకు ఎదురుగా వచ్చే వాహనాల వద్దకు పోటీ పడి ఎదురెల్లి పండ్లు విక్రయిస్తుంటారు. ఇలా వచ్చిన డబ్బులతోనే వారు కుటుంబాలను వెళ్లదీయాలి. ఒక వేళ పండ్లు ఎవరూ కొనుగోలు చేయక పోతే నష్టాలనూ భరించాల్సిందే. ఇదీ చిరు వ్యాపారుల జీవన పోరాటం. ఎండనక వాననకా రహదారులపై వ్యాపారం చేస్తే తప్ప పూట గడవడం కష్టమే. కుటుంబ పోషణ కోసం ప్రమాదకర పరిస్థితుల్లో రహదారుల వెం ట చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిన్నారు. రెక్కాడితే గాని డొక్క నిండని చిరు వ్యాపారుల జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం.. బీబీనగర్ మండలంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గిరిజన, దళిత, నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతో మంది జాతీయ రహదారిని ఆధారం చేసుకుని గూడూరు టోల్ ప్లాజా వద్ద దాదాపు 100మంది చిరు వ్యాపారాలు చేస్తున్నారు. సీజనలు బట్టి మామిడి, సితాఫలాలు, జామ, తాటి ముంజలు, సపోట తదితర పండ్లను రహదారుల వెంట విక్రయిస్తున్నారు. మరి కొందరు ఇతర ప్రాంతాల నుంచి తాటి కాయలు, జామకాయలు ఆటోల్లో తీసుకువచ్చి విక్రయిస్తు జీవనం గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు పక్కనే తాటి కమ్మలు, చెట్ల కొమ్మల నీడన గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. చిన్న చి న్న వ్యాపారాల కోసం వారు ఒంటిపై ఉన్న కొద్దో గొప్పో బంగారాన్ని తాకట్టు పెట్టి కొందరు, అధిక వడ్డీలకు అప్పు తెచ్చి.. మరి కొందరు పండ్ల వ్యా పారం చేస్తున్నారు. దీంతో రోజంతా కష్టపడితే వచ్చే సంపాదనలో వడ్డీలకు పోగా మిగిలిన దాం తో కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమలాంటివారిని ప్రభుత్వం వ్యాపారాలు నిర్వహించేందుకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
జాతీయ రహదారే ఆధారం..
జిల్లాలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి(163) ఎంతో మంది చిరు వ్యాపారుల కు జీవనాధారంగా మారింది. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండ లం గూడూరు టోల్‌ప్లాజా వద్ద అలాగే ఆలేరు- వంగపల్లి బైపాస్ రహదారులు అడ్డాగా మారిం ది. నిత్యం రాకపోకలు కొనసాగించే వేలాది మం ది వాహనాదారులు దయ తలిచి వీరి వద్ద పండ్ల ను విక్రయిస్తేనే ఆరోజుకు వీరి ఆకలి తీరుతుంది.
రోడ్డు పక్కనే స్థలం కేటాయిస్తే..
గూడూరు టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న రైల్వేట్రాక్‌కు జాతీయ రహదారికి మధ్యన ఖళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని చదును చేస్తే చిరువ్యాపారం చేసుకోవడానికి స్టాళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుందని చిరు వ్యాపారులు పేర్కొంటున్నారు. అలాగే వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఎండలోనే రోజంతా
పొద్దుగాల నుంచి చీకటి అయ్యే వరకు నిలబడే ఉంటాం. సీజన్లను బట్టి జామ కాయలు, సీతాఫలాలు, మామిడి, సపోట ఇలా రకరకాల పండ్లను ఇతర ప్రాంతాల నుంచి కొనుకొచ్చుకుని ఇక్కడ విక్రయిస్తుంటాం. గంటల తరబడి రోడ్డు పక్కన ఎండలోనే నిలబడి విక్రయిస్తుంటాం. కాళ్లు, చేతులు నొప్పి పెట్టినా అన్నీ భరిస్తాం. ప్రభుత్వం మాలాంటోళ్లను ఆదుకోవాలి.
-ఈదమ్మ, పండ్ల వ్యాపారి, భట్టుగూడెం
భయం గుప్పిట్లో వ్యాపారం
రోడ్డు పక్కన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పండ్లను విక్రయిస్తున్నాం. వేలాది వాహనాలు అటు, ఇటు వేగంగా వెళుతుంటాయి. ఏమాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అయినప్పటికీ గత్యంతరం లేక భయం భయంగా గడుపుతూ పండ్లను విక్రయించి, జీవనం కొనసాగిస్తున్నాం.
-శాంతి, పండ్ల వ్యాపారి ఎర్రబెట్టు తండా
వ్యాపారాలకు స్థలం కేటాయించాలి
రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలి. జాతీయ రహదారి పక్కన ఖాళీగా ఉన్న స్థలాన్ని చిరు వ్యాపారులకు కేటాయించి సౌకర్యాలు కల్పించాలి. చిన్న చిన్న కొట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించి ప్రభుత్వం రుణాలు అందజేయాలి.
- బోడ కృష్ణ, పగిడిపల్లి