నల్లమల అటవీ ప్రాంతంలో సఫారీ ట్రిప్
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:56 AM
సాగర్ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు కృష్ణమ్మ సోయగాలు తిలకించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు సఫారీ ట్రిప్‌ను ప్రారంభించినట్లు అటవీ శాఖ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ తెలిపారు.
వ్యూపాయింట్ వరకు రూ.1000, అడవిలోకి రూ.1500
నాగార్జునసాగర్, జనవరి 26:సాగర్ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు కృష్ణమ్మ సోయగాలు తిలకించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు సఫారీ ట్రిప్‌ను ప్రారంభించినట్లు అటవీ శాఖ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మట్లాడారు. అర్బన పార్క్‌లో పర్యాటకులను తిప్పేందుకు రూ.15లక్షలతో నూతనంగా సఫారీ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. సఫారీ వాహనంలో వ్యూపాయింట్ వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించినందుకు రూ.1000, వ్యూపాయింట్ నుంచి సహజ అడవిలో మొత్తం 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రూ.1500ల టికెట్ ధరలు నిర్ణయించామన్నారు. సఫారీ వాహనంలో ఎనిమిది మంది కూర్చునేందుకు వీలుంటుందని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రిప్పులను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి రోజూ ఈ ట్రిప్పులు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటాయన్నారు. పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.