Share News

పేదవాని గూడుకు మోక్షం

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:59 PM

పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌కాలనీకి మోక్షం కలుగనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరనుంది.

పేదవాని గూడుకు మోక్షం

మోడల్‌ కాలనీ ఇళ్లకు రూ.74.80 కోట్లు మంజూరు

హామీ నెరవేర్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, జనవరి 29 : పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌కాలనీకి మోక్షం కలుగనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరనుంది. అసంపూర్తి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.74.80 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్‌నగర్‌లో 2 వేలకు పైగా గృహాలు ఒకేసారి నిర్మాణం పూర్తి కానున్నాయి. ఇదిలా ఉండగా హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయించారు. హుజూర్‌నగర్‌ పట్టణం ఫణిగిరిగట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్‌కాలనీ ఇళ్లకు మోక్షం కలిగింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం 2,160 ఇళ్ల నిర్మాణ పనులకోసం రూ.74.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు జీవో నెం.44ను విడుదల చేస్తూ ట్రాన్సపోర్ట్‌, రోడ్లు మరియు బిల్డింగ్‌ శాఖ పర్సనల్‌ సెక్రటరీ కేఎస్‌ శ్రీనివా్‌సరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

గతేడాది డిసెంబరు 23న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదటిసారి హుజూర్‌నగర్‌కు తీసుకువచ్చారు. ఆయనతో కలిసి మోడల్‌కాలనీ ఇళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో నెల రోజుల్లోనే నిధులు మంజూరు చేస్తామని ఉత్తమ్‌కు పొంగులేటి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా మోడల్‌కాలనీ పూర్తికి రూ.74.80 కోట్ల నిధులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మోడల్‌ కాలనీ నిర్మాణంపై హామీ ఇచ్చారు. అదేవిధంగా తాను పదేళ్ల కిందట మంత్రిగా ప్రారంభించిన కాలనీ నిర్మాణం తిరిగి మంత్రి హోదాలో మరోసారి నిధులు మంజూరు చేయించి పనుల పూర్తికి సిద్ధమవుతున్నారు. కాగా మంత్రి ఆదేశాల మేరు ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

హూజూర్‌నగర్‌ పట్టణంలోని మోడల్‌కాలనీపై గత ఏడాది డిసెంబరు 19న ఆంధ్రజ్యోతిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎడిషన్‌లో ‘‘మోడల్‌ కాలనీకి గ్రహణం వీడేనా’’ అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనం అనంతరం డిసెంబరు 23న మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు మోడల్‌ కాలనీని పరిశీలించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే రూ.74.80 కోట్ల నిధులు మంజూరు చేశారు.

Updated Date - Jan 29 , 2024 | 11:59 PM