Share News

సాంబమసూరి కొనుగోలు చేయడంలేదు

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:24 AM

సాంబమసూరి రకం ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ హుజూర్‌నగర్‌లో రైతు నిరసనకు దిగాడు. బుధవారం ధాన్యం లోడు ట్రాక్టర్‌ రహదారిపై ఉంచి నిరసన వ్యక్తంచేయటంతో పలువురు రైతులు ఆందోళనకు మద్దతు పలికారు.

సాంబమసూరి కొనుగోలు చేయడంలేదు
హుజూర్‌నగర్‌లో ట్రాక్టరు అడ్డంగా పెట్టి నిరసన తెలుపుతున్న రైతు సైదులు

హుజూర్‌నగర్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సాంబమసూరి రకం ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ హుజూర్‌నగర్‌లో రైతు నిరసనకు దిగాడు. బుధవారం ధాన్యం లోడు ట్రాక్టర్‌ రహదారిపై ఉంచి నిరసన వ్యక్తంచేయటంతో పలువురు రైతులు ఆందోళనకు మద్దతు పలికారు. హుజూర్‌నగర్‌ కు చెందిన అయిల సైదులుగౌడ్‌కు మూడు ఎకరాలతోపాటు మరో 10ఎకరాలు కౌలుకు తీసుకుని సాంబమసూరి రకం వరి సాగుచేశాడు. మొత్తం 80బస్తాల ధాన్యాన్ని ట్రాక్టర్‌పై బోరెంలో తెచ్చాడు. పట్టణంలోని మిల్లులకు తీసుకువెళితే సాంబమసూరి రకం వద్దంటూ నిరాకరించారు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన సైదులు పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రోడ్డుకు ట్రాక్టర్‌ను అడ్డంగా ఉంచి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ పట్టణంలో 20 మిల్లులు తిరిగినా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. రైతు నిరసనకు దిగటంతో అక్కడికి వచ్చిన పలువురు రైతులు సైదులుకు అండగా నిలిచారు. ఈ ఘటనతో ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సైదులుగౌడ్‌తో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీఇచ్చారు. దీంతో రైతు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌కు ధాన్యం తీసుకెళ్ళి ఆరబోశారు. అదనపు కలెక్టర్‌ రాంబాబు అక్కడికివెళ్లి సైదులుగౌడ్‌ తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి 17తేమ శాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఎండబెట్టుకుని కేంద్రాల్లో అమ్ముకోవాలని, బోనస్‌ కూడా వస్తుందని తెలిపారు.

మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలేదు : రైతు అయిల సైదులు

రెండురోజుల క్రితం పంటకోసి మిల్లులకు తీసుకువెళితే ఒక్క మిల్లు యజమాని కూడా కనికరించలేదు. క్వింటా ఽరూ.1000, 1500లకు అడిగారు. సాంబమసూరి ధాన్యం కొనుగోలు చేయబోమంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళాలంటే వాతావరణం అనుకూలంగా లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. వడ్లన్నీ తడిసిపోతాయి.

Updated Date - Nov 14 , 2024 | 12:24 AM