శ్యామ్‌బెనగల్‌కు పోచంపల్లితో ప్రత్యేక అనుబంధం
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:48 AM
అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, పద్మశ్రీ శ్యామ్‌బెనగల్‌కు యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లితో ప్రత్యేక అనుబంధం ఉంది.
భూదానపోచంపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, పద్మశ్రీ శ్యామ్‌బెనగల్‌కు యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లితో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985లో పారిశ్రామికీకరణతో చేనేత, చేతివృత్తులు ఎలా అంతరించిపోతున్నాయో తెలిపేందుకు ఆయన హిందీలో ‘సుస్మాన’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో ప్రముఖ నటుడు ఓంపురి, నటి షబానాఅజ్మీ నటించారు. ఈ సినిమాను అప్పట్లో భూదానపోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో చేనేత కార్మికుడు కొంగరి సుందరయ్య ఇంటిలో 40రోజుల పాటు చిత్రీకరించారు. అంతేగాక భూదానపోచంపల్లి పట్టణంలోని ప్రముఖ వస్త్ర శిల్పి చిలివేరు రామలింగం ఇంటి వద్ధ, చేనేత సహకార సంఘం ఆవరణలో ఈ సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరిం చారు. రాత్రి పట్టణంలోని 101 దర్వాజల భవనంలో వారు బస చేసేవారు. నాడు సరైన వాహన సదుపాయాలు లేకపోవడంతో తిరిగి ఉదయం సైకిళ్లు, స్కూటర్లపై షూటింగ్ కోసమని ముక్తాపూర్ గ్రామానికి చేరుకునేవారు. చాలాకాలం పాటు షూటింగ్ జరగడంతో స్థానికులతో శ్యామ్‌బెనగల్‌తో పాటు సినిమాలో నటించిన నటులకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. షూటింగ్‌కు అన్నిరకాలుగా సహకరించినందుకు తన అన్న మాజీ జడ్పీటీసీ కొంగరి భాస్కర్‌కు దర్శకుడు శ్యామ్‌బెనగల్ నవరత్నాలు పొదిగిన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారని మాజీ సర్పంచ కొంగరి క్రిష్ణ గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో తన అమ్మ మెడలోని బంగారు గొలుసును సినిమాలోని నటి షబానా అజ్మీ ధరించారని ఆయన తెలిపారు. శ్యామ్ బెనగల్ మృతితో పట్టణంలోని కర్నాటి మల్లేశ్వర్, గాడిపల్లి పరమేశ్వర్, చిలివేరు గోవర్ధన, చిలివేరు మృత్యుంజయ, ఏలె భిక్షపతి, బోగ రాములుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న సుస్మాన
పారిశ్రామికీకరణ నేపథ్యంలో గ్రామీణ చేనేత కార్మికుల పోరాటం, బతుకు ఆరాటం ఇతివృత్తంపై నిర్మించిన ‘సుస్మాన’ సినిమాకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 1987లో విడుదలైన ఈ సినిమా పనోరమ ఫిల్మ్ ఫెస్టివల్, ది చికాగో ఫిల్మ్ ఫెస్టివల్, సిడ్నీ, మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.