తల్లి చేతిలో కుమారుడు మృతి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:51 PM
మద్యం మత్తులో దాడి చేస్తున్న కుమారుడిపైకి తల్లి తిరగబడింది. ఆ దాడిలో కుమారుడు మృతి చెందాడు.
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 6 : మద్యం మత్తులో దాడి చేస్తున్న కుమారుడిపైకి తల్లి తిరగబడింది. ఆ దాడిలో కుమారుడు మృతి చెందాడు. సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఈ సంఘటన జరిగింది. సాగర్ సీఐ భీసన్న, ఎస్‌ఐ సంపత తెలిపిన వివరాల ప్రకారం సాగర్ పైలానకాలనీకి చెందిన అవివాహితుడైన సామల రమేష్(45) లారీక్లీనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమేష్‌కు గతంలోనే తండ్రి చనిపోగా తల్లి బాలమ్మతో పాటు ఇద్దరు చెల్లెలు సుశీల, సునీత ఉన్నారు. రమేష్ రోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి తల్లితో పాటు చెల్లెళ్లను వేధిస్తుండేవాడు. వారం రోజుల క్రితం లారీక్లీనర్‌గా విధులు ముగించుకుని వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న రమేష్ ఇంట్లో నిద్రిస్తున్న తల్లి బాలమ్మ గొంతుపై కాలు పెట్టి తొక్కుతుండగా గమనించిన ఇద్దరు చెల్లెళ్లు అన్నను వారించి లాగగా, వారిని వెనక్కు నెట్టేశాడు. ఈక్రమంలో తేరుకుని పైకి లేచిన తల్లి పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో కుమారుడి తలపై మోదింది. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లి, చెల్లెళ్లు పక్కింట్లో తలదాచుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు.