Share News

యాదరుషి, భక్త ప్రహ్లాదకు ప్రత్యేక మండపాలు

ABN , Publish Date - Dec 17 , 2024 | 11:56 PM

మహిమాన్విత స్వయంభు లక్ష్మీనరసింహస్వా మి కోసం యాదగిరిగుట్టపై మహా తపస్సు చేసిన యాదరుషి, పరమ భక్తుడు భక్త ప్రహ్లాదుడిని దర్శించుకునేలా ప్రత్యేక మండపాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆల య అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

యాదరుషి, భక్త ప్రహ్లాదకు ప్రత్యేక మండపాలు

గిరి ప్రదక్షిణ దారిలో నిర్మాణం

రెండో ఘాట్‌ రోడ్డులో యాదరుషికి మండపం

సత్యనారాయణస్వామి వ్రత మండపం వెనుక భక్త ప్రహ్లాద మండపం

తుది దశలో పనులు

స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని విగ్రహాల ప్రతిష్ఠ

యాదాద్రి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహిమాన్విత స్వయంభు లక్ష్మీనరసింహస్వా మి కోసం యాదగిరిగుట్టపై మహా తపస్సు చేసిన యాదరుషి, పరమ భక్తుడు భక్త ప్రహ్లాదుడిని దర్శించుకునేలా ప్రత్యేక మండపాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆల య అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పుణ్యక్షేత్రానికి కారణమైన యాదరుషితో పాటు భక్తప్రహ్లాదుడికి గిరి ప్రదక్షిణ దారిలో మండపాలు నిర్మించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గిరి ప్రదక్షిణ దారిలో యాదరుషి మండపాన్ని రెండోఘాట్‌ వద్ద, ప్రహ్లాదుడి మండపాన్ని సత్యనారాయణస్వామి వ్రత మండపం వెనుక గిరి ప్రదిక్షణదారి వెం ట నిర్మించారు. వారం రోజుల్లోగా ఇక్కడ విగ్రహాలను ప్రత్ఠించనున్నారు. ఒక్కో మండప నిర్మాణానికి రూ.4లక్షలు, మొత్తంగా రూ.8లక్షలతో మండపాల నిర్మాణంతోపాటు చుట్టు పక్కన గార్డెనింగ్‌, భక్తులు దర్శనార్థం మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఈ నెల 26న స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా అందుబాటులోకి తేనున్నారు.

ఆధ్యాత్మికంగా.. ఆధునికంగా..

యాదరుషితో పాటు భక్త ప్రహ్లాదుడి పేరు మీద యాదగిరిగుట్ట ప్రసిద్ధికెక్కింది. ఆలయ పునర్నిర్మాణం,విస్తరణలో భాగంగా యాదరుషి విగ్రహాన్ని కొండ కింద తులసి కాటేజీ వద్ద మర్రి చెట్టు వద్ద ఏర్పాటుచేశారు. రోడ్డు డివైడర్‌కు పక్కనే ఉండటంతో యాదరుషిని భక్తులు దర్శించుకునే వె సులుబాటు లేకుండా పోయింది. దీంతో యాదరుషి మండపాన్ని మరోచోట ఆధ్యాత్మికంగా..ఆధునికంగా నిర్మించాలని అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కొండ కింద గిరి ప్రదక్షిణ దారిలో మండపాలను నిర్మించారు. యాదరుషి, భక్త ప్రహ్లాదుడి విగ్రహలతో పాటు గుట్ట ప్రాశస్త్యం కూడా మండపాల వద్ద లిఖిత రూపంగా అందుబాటులో ఉంచనున్నారు.

‘గిరి ప్రదక్షిణ’ భక్తులకు సౌకర్యాలు

స్థానిక భక్తులు యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏళ్లుగా ఉండగా, స్వామివారి చెంత గిరి ప్రదక్షిణ ఉంటుందనే విషయం ఇతర జిల్లాలు, రాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు అవగాహన లేదు. దీంతో అరుణాచలం, సింహాచలం తరహాలో గుట్టలోనూ గిరిప్రదక్షిణను ఆలయ అధికారులు ప్రారంభించారు. సాధారణ భక్తులతోపాటు ఇటీవల అయ్యప్ప మాలధారులతో గిరిప్రదక్షిణ చేయించారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో గిరిప్రదక్షిణ భక్తులకు మార్గంలో ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గుట్ట చుట్టూ 2.5కిలోమీటర్ల మేరకు భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. గిరిప్రదక్షిణ దారిలో సిమెంట్‌ ప్లేవర్స్‌ టైల్స్‌ ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ప్లెక్సీలు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, గుట్ట చుట్టూ లైటింగ్‌, మౌలిక వసతులు కల్పించారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

అందుబాటులోకి యాదరుషి, ప్రహ్లాదుడి మండపాలు : భాస్కర్‌రావు, ఆలయ ఈవో, యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు యాదరుషి, ప్రహ్లాదుడికి గిరిప్రదక్షిణ దారిలో ప్రత్యేకంగా మండపాలు నిర్మించాం. వీటిని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ నెల 26న స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురుష్కరించుకుని యాదరుషి, భక్త ప్రహ్లాదుడి మండపాల్లో దర్శనాలు ప్రారంభిస్తాం. అదేవిధంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం. గిరి ప్రదక్షిణ చేపట్టే భక్తులకు వసతులు కల్పించాం. దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. స్వామివారి సన్నిధిలో వసతులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Dec 17 , 2024 | 11:56 PM