పల్లె చెంతకు స్పెషలిస్ట్ వైద్యులు
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:05 AM
పేద, మధ్యతరగతి ప్రజలు రోగాలబారిన పడినప్పుడు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో ప్రజలు అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
12రకాల వైద్య సేవలు
పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
మొదటిరోజు 178 మందికి సేవలు
జిల్లాలో మొత్తం 29మంది స్పెషలిస్ట్ వైద్యులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పేద, మధ్యతరగతి ప్రజలు రోగాలబారిన పడినప్పుడు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో ప్రజలు అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. చిన్నపాటి వైద్యానికి కూడా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయల ఖర్చు అవుతోంది. గుండె, కిడ్నీ, మెదడు, ఊపిరితిత్తులు, తదితర వ్యాధులబారిన పడిన రోగులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక వ్యాధులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి ఉచితంగా స్పెషలి్‌స్టలతో వైద్యసేవలు అం దించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు జిల్లాను పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేయగా, వైద్యసేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
పెద్ద జబ్బులబారిన పడిన ఇంటి యజమాని వైద్య ఖర్చులు భరించలేక పలు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాయి. వైద్యసేవలకు హైదరాబాద్‌నగరానికి వెళ్లాల్సి రావడంతోపాటు స్పెషలిస్ట్ వైద్యుడిని సంప్రదించాలంటే ముందస్తు అపాయింట్‌మెంట్ ఉండాలి. వైద్యంతో పాటు రవాణా ఖర్చులు భారమవుతున్నాయి. అయితే పేదలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రభు త్వం పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని నిర్ణయించింది. పల్లెల్లోనే ప్రత్యేక వైద్యులు ఆరోగ్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంది. స్పెషలిస్ట్ వైద్యుల సేవలు అందించేందుకు జిల్లాను పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. జిల్లాలోని 23 పీహెచ్‌సీల్లో శుక్రవారం నుంచి ఈ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 12 మంది స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ప్రారంభించారు. వారానికి మూడురోజులు వీరు రోగులకు సేవలందించనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో వీరు సేవలందించనున్నారు. జిల్లా యంత్రాంగం ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నెలరోజుల పాటు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు వీరు సేవలు అందిస్తారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్న 28 పీహెచ్‌సీలు, ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌తో పాటు బస్తీదవాఖానా, పల్లె దవాఖానాల్లో 29మంది స్పెషలిస్ట్ వైద్యులు రోగులకు సేవలందించనున్నారు. మొత్తం మూ డు బృందాలుగా వైద్య సేవలందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. స్పెషలిస్ట్ వైద్యుల్లో ఐదుగు రు చిన్నపిల్లల కోసం, ఐదుగురు గైనకాలజిస్టులు, ముగ్గు రు కంటి వైద్యులు, ముగ్గురు ఆర్థోపెడిక్, ముగ్గురు జనర ల్ మెడిసిన్, ముగ్గురు ఊపరితిత్తుల, ఇద్దరు చెవి, ము క్కు, గొంతు, ఒకరు సైకాలజిస్టు, ఒకరు డెంటిస్ట్, ఒకరు ఫిజియోథెరఫిస్టు, ఒకరు డెర్మటాలజిస్టు, ఒకరు జనరల్ సర్జన్ ఉంటారు. షెడ్యూల్ ప్రకారం ఈ బృందాలు ఆయా ఆస్పత్రుల్లో సేవలందిస్తాయి. తొలి రోజు శుక్రవారం జిల్లాలోని యాదగిరిగుట్ట, నారాయణపూర్ పీహెచ్‌సీలో పిల్లల వైద్యసేవలు, రాజాపేట, భువనగిరి పీహెచ్‌సీల్లో గర్భిణుల సేవలు, పోచంపల్లిలో మానసిక రోగుల సేవలు, తంగడుపల్లిలో దంత ఆరోగ్యసేవలు, ఆత్మకూరు(ఎం)లో కంటి వైద్యసేవలు, బొమ్మలరామారంలో చెవి, గొంతు, ముక్కు, గుండాలలో ఫిజియోథెరఫి, వలిగొండలో జనరల్ మెడిసి న్, బీబీనగర్‌లో జనరల్ మెడిసిన్, కొండమడుగులో పల్మనాలజీ సేవలు, మోత్కురులో జనరల్ సర్జన్ సేవలందించారు. జిల్లా వ్యాప్తంగా 178మంది రోగులకు తొలిరోజు స్పెషలిస్ట్ వైద్యులు వైద్యసేవలు అందించారు.
12రకాల వైద్య సేవలు
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు 12రకాల వైద్య సేవలను అందించనున్నారు. వీటిలో గర్భిణులు, నియోనాటల్, శిశుఆరోగ్య సంరక్షణ సేవలు, బాల్యం, కౌమార ఆరోగ్య సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో సహా సంక్రమించే వ్యాధులు, సాధారణ అంటువ్యాధులు, తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న రోగాల కోసం ఔట్‌పేషెంట్ కేర్, వ్యాధుల స్ర్కీనింగ్, నివారణ, వృద్ధులు, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు, సాధారణ ఆప్తమాలిక్, చెవి, ముక్కు, గొంతు సమస్యల రక్షణ, ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ, అత్యవసర వైద్యసేవలు అందించనున్నారు. వైద్యులు రోగులను క్షుణ్ణంగా పరిశీలించి, జబ్బు తగ్గేలా చికిత్సలు అందిస్తారు.
ప్రజలు వినియోగించుకోవాలి
డాక్టర్ యశోద, డిప్యూటీ డీఎంహెచ్‌వో
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలరోజుల పాటు పలు రకాల స్పెష్టలిస్ట్ వైద్యులు సేవలందిస్తారు. ప్రజలంతా వీరి సేవలను వినియోగించుకోవాలి. పలు రోగాలబారిన పడిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. జిల్లాలో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలు, బస్తీ,పల్లె దవాఖానాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రత్యేక వైద్యుల సేవలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 12రకాల స్పెషలిస్టు వైద్యులు సేవలందించారు. షెడ్యూల్ ప్రకారం వారంలో మూడు రోజుల పాటు రోగులను పరిశీలించనున్నారు. ఉదయం 8నుంచి సాయంత్రం 3గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటారు.