Share News

కులపెద్దల తీరుతో దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:00 AM

భూవివాదం పరిష్కారంపై కులపెద్దలు చెప్పిన మాట వినకపోవడంతో తమను ఏ కార్యక్రమానికీ రానివ్వడం లేదనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

కులపెద్దల తీరుతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌, వసంత

రామన్నపేట, అక్టోబరు 1: భూవివాదం పరిష్కారంపై కులపెద్దలు చెప్పిన మాట వినకపోవడంతో తమను ఏ కార్యక్రమానికీ రానివ్వడం లేదనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునిపంపులకు చెందిన సోదరులు కల్లూరి నర్సింహ, కల్లూరి రమే్‌షలు తండ్రి నుంచి తమకు సంక్రమించిన ఆరు ఎకరాల భూమిని చెరి మూడు ఎకరాలు పంచుకున్నారు. ఇద్దరూ కల్లుగీత పనులు చేసుకుంటూ, వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. భూమి పంపిణీ సక్రమంగా జరగలేదని, కొన్నిచోట్ల ఎగుడుదిగుడుగా ఉందని, కొలతలు సరిగా లేవని ఆరు నెలలుగా సోదరుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై గ్రామంలో పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా వారు సూచించిన పరిష్కారాన్ని తమ్ముడు రమేష్‌ అంగీకరించలేదు. అప్పటినుంచి అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోంది. గత నెల 26వ తేదీన గ్రామంలో జరిగిన బోనాల పండుగలో తమ కుల దేవతకు బోనాలు పెట్టకుండా కులపెద్దలు అడ్డుకున్నారని రమేష్‌ రామన్నపేట పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశాడు. తమ మాట విననందుకు క్షమాపణ చెప్పాలని కులపెద్దలు రమే్‌షకు తేల్చిచెప్పినా అందుకు నిరాకరించాడు. వరుస ఘటనలతో మనస్తాపానికి గురైన రమేష్‌, వసంత దంపతులు సోమవారం తమ వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి, తమ పిల్లలను(ముగ్గురు కుమారులు) బాగా చూసుకోవాలని బంధువులకు ఫోనలో సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన మామిళ్ల అశోక్‌, మామిడి పాండురెడ్డి, ఉడుతల శ్రీను, తాళ్లపల్లి దుర్గయ్య, తొలుపునూరి చంద్రశేఖర్‌, ఉయ్యాల నర్సింహ తదితరులు అవమానించటంతో మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు వెంటనే పొలం వద్దకు వెళ్లి చూడగా, అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్‌ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి సమాచారాన్ని తెలుసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట ఎస్‌ఐ మల్లయ్య తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 12:00 AM