Share News

పెండింగ్‌ మార్కెట్‌ కమిటీలపై ఉత్కంఠ!

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:42 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమై న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్‌ పదవుల కోసం కీలక నాయకుల నడుమ పోటాపోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

పెండింగ్‌ మార్కెట్‌ కమిటీలపై ఉత్కంఠ!

ఉమ్మడి జిల్లాలో ఏడు కమిటీలపై కుదరని ఏకాభిప్రాయం

సూర్యాపేట, మిర్యాలగూడ పీఠాలు దక్కించుకునేదెవరనే ఆసక్తి

కోదాడ, హుజూర్‌నగర్‌ కమిటీలపై కొనసాగుతున్న కసరత్తు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమై న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్‌ పదవుల కోసం కీలక నాయకుల నడుమ పోటాపోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు. కొన్ని కమిటీలపై ఆశావహుల నడుమ పోటీ ఉంటే, మరికొన్ని కమిటీల్లో నియామకాలపై కీలకనేతల మధ్య అభిప్రాయబేధాలుండడం జాప్యానికి కారణంగా తెలుస్తోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 21 మార్కెట్‌ కమిటీలకు ఇప్పటికే 14 కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటుకాగా, మిగిలిన సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, చౌటుప్పల్‌, చండూరు మార్కెట్‌ కమిటీల పాలకవర్గాలు ఏర్పాటు కాలేదు. ఈ కమిటీలకు ఎవరిని ఛైర్మన్లుగా నియమిస్తారనే అంశంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కీలకమైన ద్వితీయశ్రేణి నాయకులు ఈ ఛైర్మన్‌ పదవులు ఆశిస్తుండడంతో ఎవరిని ఎంపికచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మిర్యాలగూడ మార్కెట్‌ దక్కేదెవరికో..?

మిర్యాలగూడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. గతపదేళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీనే నమ్ముకొని పనిచేసిన వర్గాలకివ్వాలనే వాదనకు తోడుగా,పార్టీకోసం గతఎన్నికల్లో బలంగా పోరాడిన నాయకులకు ప్రాధాన్యమివ్వాలనే సూచనలు పార్టీలో అన్నిస్థాయిల్లో వ్యక్తమవుతున్నాయని కీలకనేతలు చె బుతున్నారు. ఇక్కడ ఛైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ కావడంతో బీసీవర్గాలకివ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అన్ని సమీకరణాలు సరిపోలేలా ఛైర్‌పర్సన్‌ని ఎంపిక చేసేందుకు కసరత్తు సాగుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌ సతీమ ణి కృష్ణవేణి, మిర్యాలగూడ మం డలం కిష్టాపురానికి చెందిన సారెడ్డి అనూష శంకర్‌రెడ్డి, మిర్యాలగూడ మండల అధ్యక్షుడు గాయం ఉపేందర్‌రెడ్డి సతీమణి గాయం రజిత పేర్లని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంపిక వ్యవహారంలో గత రెండు దశాబ్థాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుండడం, ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతోందని కాంగ్రె్‌సలో చర్చ సాగుతోంది.

రాజగోపాల్‌రెడ్డి ఆశీస్సులకోసం నిరీక్షణ

మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్‌ మార్కెట్‌ క మిటీల చైర్మన్‌ పదవులకోసం తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రె డ్డి ఆశీస్సులు పొందడం ద్వారా చైర్మన్‌ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ము మ్మరంచేశారు. పనే ప్రామాణికంగా ఎంపిక చేస్తామని ఆశావహులకు ఎమ్మెల్యే స్పష్టం చేస్తుండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. చండూరు మార్కెట్‌ చైర్మన్‌ పదవి బీసీలకు రిజర్వ్‌ కావడంతో ఈపదవికోసం గట్టుప్పల్‌ మాజీ సర్పంచ్‌ జనార్దన్‌, చండూరు ముఖ్యనేత కోడి గిరిబాబు, మాజీ సర్పంచులు బూడిద లింగయ్యయాదవ్‌(ఇప్పర్తి), చెరుపల్లి వెంకటేశం(పలివెల) బలంగా పోటీపడుతున్నా రు. వీరిలో చైర్మన్‌ పదవికి ఎమ్మెల్యే ఎవరిని ఎంపికచేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి కనబడుతోంది. మరోవైపు ఎస్సీ వర్గానికి రిజర్వ్‌ అయిన చౌటుప్పల్‌ మార్కెట్‌ చైర్మన్‌ పదవికోసం బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉబ్బ వెంకటయ్య, చిన్న కొండూ రు మాజీ సర్పంచ్‌ బక్క శ్రీనివాస్‌, సీనియర్‌నేత బోయ రాంచందర్‌ పోటీపడుతున్నారు.

నిలిచిపోయిన సూర్యాపేట చైర్మన్‌ ఎంపిక

రాష్ట్రంలోనే కీలకమైన సూర్యాపేట మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ఛైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యానికి కాంగ్రె్‌సలోని ఆనియోజకవర్గ కీలకనేతలిద్దరి నడు మ ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మాజీమంత్రి, తన ముఖ్య అనుచరుడు కొప్పుల వేణారెడ్డికి ఛైర్మన్‌ పదవితో పాటు, వీరన్ననాయక్‌కి వైస్‌ఛైర్మన్‌ పదవి, ఇతర డైరెక్టర్‌ పదవులకు పేర్లు సూచిస్తూ మార్కెటింగ్‌శాఖకు సిఫార్సు చేశారు. అయితే కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్గం ఈ జాబితాను అంగీకరించలేదు. మాజీమంత్రి అనుచరుడే అయిన మరో కీలకనేత పోతుభాస్కర్‌ చైర్మన్‌గా, గట్టు శ్రీనివాస్‌ వైస్‌ చైర్మన్‌గా కమిటీని మార్కెటింగ్‌శాఖ ఖరారు చేసినప్పటికీ భాస్క ర్‌ చైర్మన్‌ బాధ్యతలు తీసుకోవడానికి సుముఖత చూపకపోవడంతో ఆ కమిటీ కూడా పెండింగ్‌లో పడిపోయింది. మాజీమంత్రి ముఖ్య అనుచరుడు తప్ప ఆయన ఇతర ఏ పేరు సూచించినా చైర్మన్‌ పదవికి అంగీకరిస్తామని కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్గం అధిష్ఠానానికి తెలియజేయడం, అందుకు మాజీమంత్రి ససేమిరా అంటుండడం వల్లే ఈ కమిటీ నియామకం నిలిచిపోయిందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చసాగుతోంది. ఇటీవల పార్టీ సమావేశాల్లో మాజీమంత్రి ముఖ్య అనుచరుడు బహిరంగంగానే తనకు పదవులు ప్రధానం కాద ని, కార్యకర్తల సంక్షేమమే ముఖ్యమని పేర్కొం టూ వాడివేడి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. ఈ కమిటీ ఛైర్మన్‌ వ్యవహారం రాష్ట్రస్థాయి నేతల వరకు వెళ్లిందని, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సిందేననే అభిప్రాయం వెల్లడవుతోంది.

కోదాడ, హుజూర్‌నగర్‌ మార్కెట్‌ కమిటీల కోసం కొనసాగుతున్న కసరత్తు

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ మార్కెట్‌ కమిటీల నియామకానికి తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. ఇక్కడ కమిటీల్లో చైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవులతోపాటు డైరెక్టర్‌ పదవులకోసం ఆశావహులు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కు సిఫార్సు చేసుకుంటున్నారు. కోదాడ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌కావడంతో ఆ వర్గానికి చెందిన కీలకనేతలు పదవి ఆశిస్తున్నారు. ప్రధానంగా నడిగూడెం మాజీ జడ్పీటీసీ ఏపూరి సుధీర్‌ సతీమణి తిరుపతమ్మతోపాటు, నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి పేర్లపై చర్చ సాగుతోంది. హుజూర్‌నగర్‌ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పదవికి సీనియర్‌ నాయకుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. హుజూర్‌నగర్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌ సతీమణి రాధికా దేశ్‌ముఖ్‌తోపాటు, మఠంపల్లి మాజీసర్పంచ్‌ ఆదూరి స్రవంతి కిషోర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ మండల అధ్యక్షుడు చక్కెర వీరారెడ్డి సతీమణి చక్కెర సైదమ్మ మధ్య పోటీ నెలకొంది. ఈ ముగ్గురూ మంత్రికి సన్నిహితులే కావడంతో పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవుల ఎంపికతోపాటు ఆయా డైరెక్టర్ల పదవులకు ఎవరిని ఎంపికచేయాలనే విషయంలో మంత్రి ఉత్తమ్‌, ఎమ్మెల్యే పద్మావతి ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారని, విమర్శలు, వివాదాలకు తావులేకుండా పనిచేసే నాయకులకు పదవులిచ్చారనే సంకేతాలిచ్చేలా ఎంపిక ఉంటుందని ముఖ్యనాయకులు పేర్కొంటున్నారు.

కొత్త, పాత నేతల నడుమ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ చైర్‌పర్సన్‌ పదవి విషయంలో పార్టీలో పాత నాయకులు, కొత్తనాయకుల నడుమ వివాదం నెలకొనడంతో ఎంపిక పెండింగ్‌లో పడింది. తొలుత చైర్‌పర్సన్‌గా బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాలకుర్తి రాజయ్య సతీమణి రామతార, వైస్‌చైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించారు. అయితే కొత్త, పాత వివాదం తలెత్తడంతో ఆ తర్వాత పార్టీ మండల అధ్యక్షుడు నరేష్‌ సతీమణి చామంతితోపాటు అర్వపల్లి మండలానికి చెందిన అభిషేక్‌రెడ్డి కుటుంబీకుల పేర్లు తెరమీదకొచ్చాయి. పాత, కొత్త నేతల నడుమ చైర్‌పర్సన్‌ పదవికోసం పోటాపోటీ నెలకొనడంతో ఇటీవల అందరికీ అమోదయోగ్యంగా ఉండేలా ఏకాభిప్రాయానికి వచ్చారని, త్వరలో ఉత్తర్వులు వస్తాయని చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, చైర్మన్లు

1. నల్లగొండ - జూకూరి రమేష్‌

2. దేవరకొండ - జమున మాధవరెడ్డి

3. మాల్‌ - దొంతం అలివేలు సంజీవరెడ్డి

4. హాలియా - తుమ్మలపల్లి చంద్రశేఖర్‌ రెడ్డి

5. నిడమనూరు - అంకతి సత్యం

6. చిట్యాల - నర్ర వినోద మోహన్‌రెడ్డి

7. నకిరేకల్‌ - గుత్తా మంజుల మాధవరెడ్డి

8. శాలిగౌరారం - పాదూరి శంకర్‌రెడ్డి

9. తుంగతుర్తి - తీగల గిరిధర్‌రెడ్డి

10. నేరేడుచర్ల - బెల్లంకొండ విజయ

11. భువనగిరి - కనుకుంట్ల రేఖ బాబూరావు

12. ఆలేరు - పీ.జ్యోతిరెడ్డి

13. మోత్కూరు - నూనెముంతల విమల వెంకటేశ్వర్లు

14. వలిగొండ - భూక్యా భీమా నాయక్‌

Updated Date - Dec 25 , 2024 | 11:42 PM