దీపావళికి టపాసులు రెడీ
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:06 AM
వెలుగుల పండుగ దీపావళి రోజున బాణాసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే టపాసుల దుకాణాలు వెలిశాయి. అయితే తాత్కాలికంగా ఏర్పాటుచేసే ఈ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.
ఇప్పటికే దుకాణాల ఏర్పాటు
అనుమతులు తప్పనిసరి
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 217 దరఖాస్తులు
భువనగిరి టౌన్, నల్లగొండ, సూర్యాపేటక్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వెలుగుల పండుగ దీపావళి రోజున బాణాసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే టపాసుల దుకాణాలు వెలిశాయి. అయితే తాత్కాలికంగా ఏర్పాటుచేసే ఈ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి. అంతేగాక దుకాణాల ఏర్పాటు, టపాసులను కాల్చడంలో జాగ్రత్తలు తీసుకుంటేనే ఆనంద దీపావళి అవుతుంది. కాగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 217 దుకాణాల ఏర్పాటుకు మాత్రమే నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పండుగ మరో ఐదు రోజులు ఉండగా, ఇప్పటికే కొందరు బహిరంగ ప్రదేశాల్లో టపాసులను విక్రయిస్తున్నారు. వీరంతా అనుమతులు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
అనుమతులు, జాగ్రత్తలు తప్పనిసరి
బాణాసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బాణాసంచా విక్రయాలకు శాశ్వత అనుమతులు ఉండగా, సంవత్సరంలో 15 రోజుల పాటు విక్రయాలకు తాత్కాలిక అనుమతులను అధికారులు ఇస్తుంటారు. ఈ మేరకు యాదాద్రి జిల్లాలో భువనగిరిలో మూడు, చౌటుప్పల్‌లో 2, మోత్కూరులో 1 శాశ్వత బాణాసంచా విక్రయాల దుకాణాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో శాశ్వత దుకాణాలు 14 ఉన్నాయి. వీటి యజమానులు ఏటా రూ.2వేల ఫీజు చెల్లించి అనుమతులను రెన్యువల్ చేసుకుంటారు. అయితే తాత్కాలిక అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీపావళి సీజన్‌లోనే తాత్కాలిక అనుమతులకు ఎక్కువగా దరఖాస్తులు వస్తుంటాయి. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో జజీట్ఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽలో రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు. అయితే అగ్నిమాపకశాఖ అధికారులు జారీ చేసే అనుమతుల ఆధారంగా సమీపంలోని పోలీ్‌సస్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆధారంగా పోలీసు అధికారులు క్షేత్రపరిశీలన చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటే ఎన్‌వోసీ జారీ చేస్తారు. ఆ రెండు ఎన్‌వోసీల ఆధారంగా స్థానిక సంస్థల అధికారులు మరోమారు క్షేత్రపరిశీలన చేసి ఎన్‌వోసీ ఇస్తారు. మూడు శాఖల అనుమతులు పొందాకే విక్రయాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ అనుమతులు 15 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. యాదాద్రి జిల్లాలో తాత్కాలిక దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు 42 దరఖాస్తులు రాగా, 12 దరఖాస్తులను అగ్నిమాపకశాఖ తిరస్కరించింది. మిగతా దరఖాస్తులు పరిశీలన స్థాయిలో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 128 తాత్కాలిక దుకాణాలకు అధికారులు లైసెన్స్ జారీచేశారు. సూర్యాపేట జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించేందుకు జిల్లాలోని పోలీస్, మునిసిపల్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులకు ఇప్పటి వరకు 70 దుకాణాలకు తాత్కాలిక అనుమతులు పొందేందుకు ధరఖాస్తులు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 36, కోదాడలో 26, హుజుర్‌నగర్‌లో 8 దుకాణాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చాయి. కాగా కొంతమంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేయగా, వారిని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని అధికారులు సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోదాడలోని రాంమూర్తినగర్‌లో, హుజుర్‌నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ పక్కన ఖాళీ స్థలంలో అనుమతులు పొందిన నిర్వాహకులు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేశారు.
నిబంధనలు ఇలా..
శాశ్వత బాణాసంచా దుకాణాలు కచ్చితంగా పట్టణాలు, గ్రామాల వెలుపలే ఉండాలి. తాత్కాలిక దుకాణాలు బహిరంగ స్థలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతీ దుకాణంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నియంత్రణకు వినియోగించే ఉపకరణాలను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసే ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములైతే సంబంధిత శాఖల అధికారుల అనుమతులు, ప్రైవేట్ స్థలాలు అయితే యజమానుల లిఖితపూర్వక అంగీకార పత్రాలు ఉండాలి. అగ్ని ప్రమాదాలకు దోహదపడే ఎలాంటి పదార్థాలు, వస్తువులు, దుకాణాల్లో ఉండరాదు. అలంకరణ సామగ్రిని వినియోగించరాదు. ఒక్కో దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. దుకాణాల ఏర్పాటుకు డెకరేషన్ క్లాత్ వినియోగించకూడదు. మైక్ సౌండ్స్, మితిమీరిన లైటింగ్ ఏర్పాటు చేయరాదు. దుకాణాల సమీపంలో బాణాసంచా కాల్చరాదు.
11 ఏళ్ల క్రితం భువనగిరిలో ముగ్గురు మృతి
భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్‌లో 11 ఏళ్ల క్రితం జనావాసాల మధ్య ఉన్న ఓ ఇంటిలో నిల్వ చేసిన బాణాసంచా పేలి ముగ్గురు మృతి చెందారు. ఇళ్లు భస్మీపటలం అయ్యాయి. దీపావళి పండుగ విక్రయాల కోసం తెచ్చిన స్టాక్‌ను సంబంధిత వ్యాపారి ఆ ఇంటిలో నిల్వ చేశాడు. కానీ, అనుమతులు తీసుకోకపోగా, ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. దీంతో దీపావళికి రెండు రోజుల ముందుగా అర్ధరాత్రి ఆ ఇంటిలో నిల్వ చేసిన బాణాసంచా అకస్మాత్తుగా పేలడంతో అదే ఇంటిలోని పక్క గదిలో ఉంటున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీంతో అప్పటి వరకు పట్టణంలో ఉన్న బాణాసంచా విక్రయ దుకాణాలను అధికారులు శివారు ప్రాంతానికి తరలించారు.
పేటలో ముడుపులు, చక్రం తిప్పుతున్న హోల్‌సేల్ డీలర్
దీపావళి పండుగకు బాణాసంచా విక్రయించే దుకాణాల అనుమతులకు పేటలో భారీగా ముడుపులు వివిధ శాఖల అధికారులకు చెల్లిస్తున్నట్టు సమాచారం. తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు పోలీస్, మునిసిపల్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఒక్కో దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు ఆయా శాఖల అధికారులకు రూ.15నుంచి రూ.20వేల వరకు ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రానికి చెందిన ఓ హోల్‌సేల్ డీలర్ అతడి వద్ద బాణాసంచా కొనుగోలు చేసిన వారికే అనుమతులు వచ్చేలా చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. గతంలో జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు జనసంచార ప్రదేశాల్లో పట్టణానికి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వ పెట్టడంతో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. అయినా పట్టణంలో చాలా ప్రదేశాల్లో బాణాసంచాను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం. బాణాసంచా దుకాణదారులు సిండికేట్‌గా ఏర్పడుతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలపై ఆర్థికభారం పడనుంది. రూ.10 ఉన్న టపాసులను దుకాణదారులు రూ.30గా విక్రయిస్తున్నారు. దుకాణాల అనుమతులు, ఏర్పాటు కోసం భారీగా డబ్బు చెల్లించడంతో ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అనుమతులు తీసుకోవాల్సిందే: ఎం.రాజేష్ చంద్ర, డీసీపీ యాదాద్రి జిల్లా
బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దుకాణాల నిర్వాహణలో ఏ మాత్రం అజాగ్రత్త చూపినా పెను ప్రమాదం జరుగుతుంది. అందుకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా అంతటా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాం. ఇళ్లలో విక్రయించినా, జనావాసాల మధ్య ఉండే కిరాణ, తదితర దుకాణాల్లో విక్రయించినా కేసులు నమోదు చేస్తాం.
నిబంధనల మేరకే అనుమతులు: సందేశ్ కుమార్, నల్లగొండ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి
జిల్లాలో బాణాసంచా విక్రయాలకు సంబంఽధించి అన్ని నిబంధనల మేరకే అనుమతులు ఇస్తున్నాం. జనావాసాల మధ్య విక్రయ కేంద్రాలకు అనుమతి లేదు. తాత్కాలిక లైసెన్స్ దారులు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తెలియజేశాం. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.
అనుమతులు లేకుండా విక్రయిస్తే చర్యలు: కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి
బాణాసంచా విక్రయాలకు వ్యాపారులు విధిగా అనుమతులు తీసుకోవాలి. మునిసిపల్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపకశాఖల ద్వారా అనుమతులు పొందాలి. ఎవరైనా అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బాణాసంచాల విక్రయాల కోసం తాత్కాలికంగా 15రోజుల వరకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నాం. అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటాం.