Share News

ఆ మేడం రూటే సప‘రేటు’

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:10 AM

ఆ తహసీల్దార్‌ కార్యాలయంలో దళారులు రాజ్యమేలుతున్నారు. మధ్యవర్తులు చెప్పిందే వేదం అన్నట్లు అధికారులు ఫైళ్లు చక్కబెడుతుంటారు. అడిగినంత ముట్టజెపితే గంటల్లో పని, లేదంటే రోజుల తరబడి ప్రదక్షిణలు. ఏ సర్టిఫికేట్‌ కావాలన్నా.. భూ రిజిస్ట్రేషన్‌ జరగాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే.

ఆ మేడం రూటే సప‘రేటు’

తహసీల్దార్‌ కార్యాలంలో దళారులదే రాజ్యం

కార్యాలయ విభాగాలపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం

పనినిబట్టి రేట్‌ ఫిక్స్‌

మధ్యవర్తులతో బేరసారాలు

నేరుగా వెళ్లిన అర్జీదారులపై కస్సుబుస్సు

- మిర్యాలగూడ అర్బన్‌: ఆ తహసీల్దార్‌ కార్యాలయంలో దళారులు రాజ్యమేలుతున్నారు. మధ్యవర్తులు చెప్పిందే వేదం అన్నట్లు అధికారులు ఫైళ్లు చక్కబెడుతుంటారు. అడిగినంత ముట్టజెపితే గంటల్లో పని, లేదంటే రోజుల తరబడి ప్రదక్షిణలు. ఏ సర్టిఫికేట్‌ కావాలన్నా.. భూ రిజిస్ట్రేషన్‌ జరగాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే. కార్యాలయ విభాగాలపై పర్యవేక్షణ జరిపి అక్రమాలకు తావివ్వకుండా చూడాల్సిన ఉన్నతాధికారే ముడుపులకు అలవాటు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సొంతశాఖకు మచ్చతెచ్చేలా ఆ అధికారి తీరుతో కిందిస్థాయి ఉద్యోగులు నలిగిపోతున్నారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాయానికి కూతవేటు దూరంలో కోదాడ-జడ్చర్ల రహదారిపై ఉన్న ఓ రెవెన్యూ కార్యాలయంలో నిత్యం జరుతున్న తంతు ఇదీ.

ఎన్నికల బదిలీల్లో భాగంగా పదోన్నతిపై ఏడాది క్రితం ఇక్కడికి వచ్చిన అధికారి అనతికాలంలోనే అక్రమార్జనకు మార్గం సుగమమం చేసుకున్నారు. నిత్యం కార్యాలయాని కి వచ్చే ఒకరిద్దరు దళారులతో చేతులు కలిపి మాముళ్లు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 32 గ్రామపంచాయతీలున్న ఈ మండలంలో వ్యవసాయ భూము ల క్రయ, విక్రయాలు ఒక రీతిగా సాగుతున్నాయి. జాతీయ రహదారి ఏర్పాటుతో స్థిరాస్తి వ్యాపారులు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూరిజిస్ట్రేన్లు పుంజుకున్నాయి. నిత్యం సగటున 10 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అయితే బ్యాంకులో రుణం తీసుకొని, అవసరం కొద్దీ చిన్న, సన్నకారు రైతులు భూమి విక్రయించుకుంటే రిజిస్ట్రేషన్‌కు తిప్పలు పెడుతున్నారు. ఒక్కో రిజిస్ట్రేన్‌కు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దళారుల మితిమీరిన పెత్తనంతో దిగువశ్రేణి ఉద్యోలు ఇబ్బందిపడుతున్నారు. ఆ అధికారి నియమించుకున్న ప్రైవేట్‌ వ్యక్తులు ఫైల్‌పై ఓ గుర్తు పెడతారట. అది చూసిన మేడానికి దాని విలువెంతో తెలిసి ఫైల్‌ క్లియర్‌ చేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

పనికో రేటు

కార్యాలయంలో పనికోరేటు ఫిక్స్‌ చేసినట్టు ప్రచారంలో ఉంది. ధరణి పోర్టల్‌లో చేర్పులు, మార్పులు జరగాలంటే రూ.2వేల నుంచి రూ.5వేల వరకు అప్పజెప్పాల్సి వస్తోం ది. మిస్సింగ్‌ సర్వేనెంబర్ల గుర్తింపు, డిజిటల్‌ సిగ్నేచర్‌కు సైతం ధరణి సెక్షన్‌లో మాముళ్లు తీసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం చేసుకున్న దరఖాస్తులపై విచారణ జరిపేందుకు అధికారి వెళ్లాలంటే ముందుగా ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాల్సిందే. ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ జారీచేయాలంటే వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోందని మండల వాసులు వాపోతున్నారు. డీఆర్‌లో అర్జీదారుల వివరాలు నమోదు చేయకుండానే పత్రాలు జారీ చేసి అక్రమాలు బయట పడకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

అర్జీదారులపై ఆగ్రహం

ప్రజలు అవసరం నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే ధ్రువపత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. ఇదేంటని మేడం వద్దకు వెళ్తే ఎవరు పంపారంటూ శివాలెత్తిపోయి ఫిర్యాదులను విసిరికొట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సామాస్య ప్రజలు ఆమె ఛాంబర్‌లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అదే తాను నియమించుకున్న ప్రైవేటు వ్యక్తులను తోడ్కొని వెళ్తే సమాధానం లభిస్తోందన్న ప్రచారంఉంది. ప్రైవేట్‌ వ్యక్తులు ఏ సెక్షన్లలోనైనా సరే ఉద్యోగులతో సమానంగా కుర్చీల్లో తిష్టవేసి ఫైళ్లను లెక్కిస్తున్నారు. రికార్డుగదిలో వీరి హవా మితిమీరింది. మేడం అండదండతో ఖసరా పహాణీ, పహాణీలను బయటకు తెచ్చి జిరాక్స్‌ తీయిస్తున్నారు. దీంతో ఆ విభాగం అధికారి సేవలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి.

విద్యార్థులకు తప్పని ప్రదక్షిణలు

విద్యాసంవత్సరానికి అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాలు పొందేందుకు విద్యార్థులు రోజులు తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. మీ-సేవలో వివరాలు అప్‌లోడ్‌ చేశాక, దరఖాస్తులను పరిశీలించి ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉండా, తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. డిజిటల్‌ సంతకం చేయాలన్నా.. ముద్ర పడాలన్నా.. పచ్చ నోటు ఇచ్చుకోవాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, చోటామోటా లీడర్లకు పనులు జరుగుతున్న నేపథ్యంలో సదరు అధికారితీరుపై నోరు మొదపడం లేదని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలంలో యథేచ్చగా సాగుతున్న చేతివాటంపై విచారణ జరిపి శాఖాపర చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:10 AM