Share News

ఎన్నాళ్లో వేచిన ఉదయం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:55 AM

పారిశ్రామిక విస్తరణతో ఉన్న చెరువులు ఎండిపోతున్న ‘దృశ్యం’.. సాగు చేయడానికి పంట నీరు కాదు కదా కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లభించని ‘దైన్యం’.. ఫ్లోరైడ్‌తో రక్షిత మంచినీటి కోసం ఢిల్లీ పాలకులను కలిసి మొరపెట్టుకున్న ‘కాలం’..

ఎన్నాళ్లో వేచిన ఉదయం

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేడే

నాలుగు నియోజకవర్గాల్లోలక్ష ఎకరాలకు నీరిచ్చే పథకం

మంత్రి కోమటిరెడ్డి కలల ప్రాజెక్టు

పారిశ్రామిక విస్తరణతో ఉన్న చెరువులు ఎండిపోతున్న ‘దృశ్యం’.. సాగు చేయడానికి పంట నీరు కాదు కదా కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లభించని ‘దైన్యం’.. ఫ్లోరైడ్‌తో రక్షిత మంచినీటి కోసం ఢిల్లీ పాలకులను కలిసి మొరపెట్టుకున్న ‘కాలం’.. ఇదంతా 17 ఏళ్ల కిందటి ‘గతం’.. అమాత్య పదవి వదులుకున్నందుకు దక్కిన ‘ఫలితం’.. రాదనుకున్న ప్రాజెక్టును సాధించిన ‘భగీరథ యత్నం’.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ‘కలల సాగరం’ నేడు జాతికి అంకితం!

నల్లగొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశ్యంతో చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల-ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఫ్లోరోసి్‌సతో బాధపడే తన సొం త గ్రామం, పరిసర ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు 2007లో ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏఎమ్మార్పీ ద్వారా బ్రాహ్మణవెల్లెంలకు నీటి ని తీసుకువచ్చి ఇక్కడ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని పథకానికి రూపకల్పన చేశారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఈ పథకానికి రూ.699కోట్లు మంజూరు చేయించారు. 2007లో సీఎం వైఎ్‌సఆర్‌ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. 2009లో పనులు ప్రారంభించగా, 2013 వరకు పనులు వేగంగా సాగినా పథకం పూర్తికాలేదు. అనంతరం గత పదేళ్లలో ఈ పథకం ముందుకు సాగలేదు. గత ఎన్నికలకు ముందు పంపుహౌస్‌, లిఫ్టుల పనులు పూర్తిచేసి ట్రయల్‌రన్‌ నిర్వహించినా, రిజర్వాయర్‌, కాల్వల పను లు అలాగే ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చా క ఈ పథకానికి రూ.100కోట్ల నిధులు కేటాయించడంతోపాటు, పెండింగ్‌ పనులపై దృష్టిపెట్టింది. తాజాగా రిజర్వాయర్‌ని నీటితో నింపారు. కాల్వల నిర్మాణాలకు భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. శనివారం ఈరిజర్వాయర్‌కు నీటిని వి డుదల చేయించడంతో పాటు, పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. మరో ఆరునెలల్లో కాల్వల నిర్మాణం పూర్తిచేసేందుకుఅవసరమైన రూ.400 కోట్ల నిధులను శనివారం సీఎం మంజూరు చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

మొదటిదశలో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా పనులు

లక్ష ఎకరాలకు నిర్దేశించిన బ్రాహ్మణవెల్లెంల-ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కింద మొదటి దశలో 48,972 ఎకరాలకు ఈ ఏడాది నీరిచ్చేందుకు నిర్ణయించారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో 23వేల ఎకరాలు, నల్లగొం డ నియోజవర్గంలో 24వేల ఎకరా లు, మునుగోడులో 3వేల ఎకరాలకు తొలివిడతలో సాగునీటిని ఇస్తారు. 18.575కిలోమీటర్ల ఎడమ ప్రధాన కాల్వలో పెండింగ్‌ పనులకు, దాని పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ-1లో 18కిలో మీటర్ల కాల్వ పనుల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు 12కిలోమీటర్ల కాల్వ తవ్వకానికి, అదేవిధంగా కుడిప్రధాన కాల్వ 25కిలోమీటర్లలో పెండింగ్‌ పనులకు అవసరమైన భూసేకరణ చేయనున్నారు. దీని పరిధిలో నిర్మాణంలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ-2 కింద 22కిలోమీటర్ల కాల్వ నిమిత్తం అవసరమైన భూసేకరణకు, కాల్వల నిర్మాణ పనులకు మొత్తంగా సుమారు రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. అందులో ఇప్పటికే రూ.37కోట్ల నిధులతో భూసేకరణకు అవార్డు ప్రకటించగా, మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 3,838 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 1,657 ఎకరాల భూమిని సేకరించగా, మిగిలిన భూమి సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి రైతులతో అంగీకారం కుదిరింది. మొదటిదశలో ఈ ప్రాజెక్టు కింద కుడి ప్రధాన కాల్వ రెండో డిస్ట్రిబ్యూటరీ కింద 18వేల ఎకరాలకు, ఎడమ ప్రధాన కాల్వ డిస్ట్రిబ్యూటరీ-2 కింద 31,390 ఎకరాలకు కలిపి మొత్తం 49వేల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చేలా పనులు సాగుతున్నాయి.

నాలుగు నియోజకవర్గాలు 90 గ్రామాలు

ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే నల్లగొండ, నకిరేకల్‌, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరందుతుంది. నల్లగొండ సమీపంలోని పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌ నుంచి అండర్‌ టన్నెల్‌ ద్వారా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కుడి, ఎడమకాల్వల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పథకాన్ని రూపొందించారు. నార్కట్‌పల్లి, నల్లగొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టంగూరు మండలాల్లో ఆయకట్టు ఏర్పడుతుంది. అంతేగాక భూగర్భ జలాలు పెంపొందుతాయి.

ప్రాజెక్టు స్వరూపం

నార్కట్‌పల్లి: లక్ష ఎకరాలకు సాగునీరందించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుకు నల్లగొండ ఉదయ సముద్రం రిజర్వాయర్‌ నుంచి 6.9కి.మీల పొడవులో ఉండే అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా పిట్టంపల్లి వద్ద ఉన్న సొరంగమార్గం వరకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి 4.7 డయా మీటరు వెడల్పుతో 1.0625కి.మీల దూరం వరకు సొరంగమార్గం ద్వారా చౌడంపల్లి వద్ద నిర్మించిన సర్జీపూల్‌కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి పంప్‌హౌ్‌సలో ఒకొక్కటి 16 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు మోటార్లతో 95 మీటర్ల ఎత్తులో ఉన్న రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తారు. ఒక్కో మోటారు 450 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయగలదు. 0.305 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్‌కు నీటిని చేర్చి అక్కడి నుంచి కుడి, ఎడమల కాల్వలకు లక్ష ఎకరాలకు సాగునీటిని డిస్ట్రిబ్యూటరీల ద్వారా అందించనున్నారు.

బీ.వెల్లెంలకు వస్తున్న రెండో సీఎం రేవంత్‌రెడ్డి

బీ.వెల్లెంల గ్రామాన్ని సందర్శిస్తున్న రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి నిలవనున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండు పర్యాయాలు బీ.వెల్లెంలను సందర్శించారు. ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు ఓ పర్యాయం రాగా, పల్లెబాటలో భాగంగా దళితులకు ఉచిత విద్యుత్‌ పథకం ప్రారంభించేందుకు మరోసారి, మొత్తంగా రెండు సార్లు రాజశేఖర్‌రెడ్డి ఈ గ్రామాన్ని సందర్శించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ గ్రామానికి రానున్నారు.

నేటి నుంచే యాదాద్రి వెలుగులు

పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం

వీర్లపాలెం వద్ద 2015లో ప్రారంభమైన వైటీపీఎస్‌ నిర్మాణ పనులు

ప్లాంట్‌లో ఉద్యోగాలివ్వాలని నిర్వాసితుల డిమాండ్‌

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నాలుగువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో విద్యుదుత్పాదన ప్రక్రియను ముఖ్యమంత్రి అనుమల రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నా రు. ఈ మేరకు జెన్‌కో యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. వైటీపీఎ్‌సలో తొలిదశలో 800 మెగావాట్ల యూనిట్‌-2 నుంచి శనివారం నుంచి విద్యుదుత్పత్తి ప్రక్రియ మొదలవనుంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్‌, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్‌ ఇలాత్రిపాఠి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జెన్‌కో అధికారులు తెలిపారు.

యాదాద్రి పవర్‌ప్లాంటు మొత్తం ఐదు యూనిట్లుగా చేపట్టగా శనివారం యూనిట్‌-2లో విద్యుదుత్పాదన మొదలుకానుంది. యూనిట్‌-1 కూడా విద్యుదుత్పాదనకు సిద్ధమైంది. మిగిలిన మూడు యూనిట్ల లో కూడా 85శాతం పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు కీలకమైన విష్ణుపురం-పవర్‌ప్లాంట్‌ యార్డు వరకు చేపట్టిన 8.800కిలోమీటర్ల రైల్వేలైన్‌ కూడా పూర్తికాగా, బొగ్గు రవాణాకు దక్షిణమధ్య రైల్వే రెం డు వ్యాగన్లు కూడా కేటాయించిం ది. ఈ ప్లాంటుకు పూర్తిగా సింగరేణి బొగ్గును ఉపయోగించాలని నిర్ణయించారు. మొత్తం 2.20మిలియన్‌ యూనిట్ల బొగ్గును ఇక్కడ వినియోగించేందుకు సింగరేణి అనుమతించిం ది. మోటమర్రి-జగ్గయ్యపేట-విష్ణుపురం-పవర్‌ప్లాంట్‌ రైల్వే మార్గంలో బొగ్గు ప్లాంట్‌కు చేరనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. మరో వైపున విద్యుదుత్పత్తి జరిగిన వెంటనే విద్యుత్‌ పంపిణీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టవర్‌ లై న్‌ నిర్మాణం కూడా పూర్తయింది. ప్లాంట్‌కు అవసరమైన నీటి వినియోగం కోసం కృష్ణాజలాల నుంచి ఏడు టీఎంసీలు కేటాయించారు. కృష్ణాన ది నుంచి ప్లాంటు వరకు నీటి పైప్‌లైన్‌ నిర్మా ణం ఇప్పటికే పూర్తయింది. పవర్‌ప్లాంట్‌ వద్ద ఇతర అన్ని పనులు పూర్తిచేయడంతో పాటు, ఉద్యోగులు, అధికారులు, కార్మికుల నివాస నిమి త్తం తుంగపాడుబంధం-కృష్ణానది సంగమం వద్ద ప్రత్యేకంగా కాలనీని భారీ టవర్లతో ఏర్పా టు చేస్తున్నారు. దామరచర్ల నుంచి పవర్‌ప్లాం ట్‌ వరకు, అక్కడి నుంచి తుంగపాడు వాగు పక్కగా నూతనంగా నిర్మించే కాలనీ వరకు ప్రత్యేక రోడ్లను సైతం వేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఈ పనులన్నింటినీ వచ్చే ఏడాది కాలంలో పూర్తిచేయాలని నిర్ణయించారు.

2015లో మొదలైన పనులు

దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015, జూలై 8న అప్పటి సీఎం కే.చంద్రశేఖర్‌రావు యాదాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4,676 ఎకరాల విస్తీర్ణంలో రూ.25,099కోట్ల అంచనావ్యయంతో తొలుత ప్రాజెక్టును చేపట్టగా, కాలక్రమంగా అది రూ.30వేల కోట్లకు చేరింది. ఇక్కడ సేకరించిన భూములతో పాటు వీర్లపాలెం ఆవాసాలైన మోదుగులకుంటతండా, కర్పూరతండాలకు చెందిన 133 గిరిజన కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. వీరికి సమీపంలోని శాంతినగర్‌ శివారులో పునరావాసం కల్పించారు. ఈ గిరిజనులతో పాటు, భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటికొకరికి ఉద్యోగాలిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన, ఇళ్లు కోల్పోయినవారికి తప్పక ఉద్యోగాలిస్తామని ఇటీవల ప్లాంటు సందర్శన సమయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించడంతో సుమారు 1,560 మంది నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సమీప తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం తదితర ప్రభావిత గ్రామాలకు చెందిన భూములకూ పరిహారమివ్వాలని నిర్వాసితులు ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రారంభోత్సవ సందర్భంగానైనా తమ గోడు వినాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:55 AM