నూతన మెనూ మాతోకాదు
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:07 AM
ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఇటీవల ప్రభుత్వం నూతన మెనూను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతీ రోజు నూత న మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత ధరలతో సాధ్యంకాని మెనూ
ఒక్కో విద్యార్థికి కనీసం రోజుకు రూ.100కేటాయించాలని డిమాండ్
కలెక్టర్లకు వినతిపత్రాలు
ఉమ్మడి జిల్లాలో 273 సంక్షేమ హాస్టళ్లు
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట (కలెక్టరేట్): ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఇటీవల ప్రభుత్వం నూతన మెనూను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతీ రోజు నూత న మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నూతన మెనూ అమలును హాస్టళ్లలో అట్టహాసంగా ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రారంభించారు. అయితే ప్రస్తుత ధరలతో ఈ మెనూ అమలు సాధ్యం కాదని వార్డెన్లు తేల్చి చెబుతున్నారు. దీంతో కొన్ని చోట్ల వార్డెన్లు పాత మెనూనే అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలతో నూతన మెనూ అమలు చేయడం సాధ్యకాదని వార్డెన్లు చెబుతుండగా, ప్రభుత్వం నూత న మెనూ ప్రకటించినా, వాటి ధరలు, విద్యార్థులకు ఎన్ని గ్రాములు అందించాలో మాత్రం ప్రకటించలేదు. ఒక్కో విద్యార్థికి ఎన్ని గ్రాముల చికెన్, మటన్ అందించాలో మె నూలో లేదు. అంతేగాక నూతన మెనూ ప్రకా రం ప్రతీ రోజు ఆరు నుంచి ఏడు రకాల కూరలు వడ్డించాలి. దీంతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు అందించాలి. ఇవన్నీ అమలు చేయాలంటే సాధ్యంకాదని వార్డెన్లు చెబుతున్నారు. మెనూ అమలుకు జిల్లా సంక్షేమాధికారులు ఒత్తిడి తేవడం భావ్యం కాదంటున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కనీసం రోజుకు రూ.100 కేటాయిస్తేనే ప్రకటించిన మెనూ అమలు చేయడం సాధ్యమవుతుందంటున్నారు. దీంతో వార్డెన్లు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే వినతి పత్రాలు కూడా అందజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇస్తేనే విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందే అవకాశం ఉంది.
ధరలు, గ్రాముల వివరాలు ప్రకటించాలంటున్న వార్డెన్లు
నూతన మెనూ అమలు చేయాలంటే ముం దుగా ఆహార పదార్థాల ధరలు, ఒక్కో విద్యార్థికి ప్రతి రోజు ఆహారంలో అందించాల్సిన కూరలు, వాటి పరిమాణాన్ని ప్రకటించాలంటున్నారు వార్డెన్లు. అప్పుడే విద్యార్థుల సంఖ్యను బట్టి నూతన మెనూ అమలు చేయడం సాధ్యం అవుతుంది. ప్రస్తుతం మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330, 8వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు నెలకు రూ.2100 ప్రభు త్వం డైట్ చార్జీగా ఇస్తోంది. అయితే విద్యార్థులకు రోజూ ఉదయం ఏదో ఒక టిఫిన్, మధ్యాహ్నాం అన్నం, పప్పు, సాంబారు మాత్రమే ఇస్తున్నారు. రాత్రి సమయంలో అన్నం, ఏదైనా కాయగూరలతో కూర, మజ్జిగతో పాటు వారంలో ఐదు రోజులు కోడిగుడ్డు అమలు చేస్తున్నారు.
రూ.100 కేటాయిస్తేనే
ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన నూతన మెనూ పక్కాగా అమలు చేయాలం టే ఒక్కో విద్యార్థికి రూ.100 కేటాయించాలని వార్డెన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువులతోపాటు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీం తో ధరలను దృష్టిలో పెట్టుకుని మెనూ సిద్ధం చేయా ల్సి ఉంటుంది. ప్రభుత్వం నూతన మెనూ ప్రకటించక ముందే ఆయా సంక్షేమశాఖల కమిషనర్లు కొత్త మె నూ సిద్ధం చేశారు. దాన్ని అమలు చేయాలంటేనే ఇ బ్బందులు పడుతున్నామని, నూతన మెనూ మరింత ఇబ్బందికరంగా ఉందని వార్డెన్లు వాపోతున్నారు.కానీ, నూతన మెనూలో రోజుకు ఆరు నుంచి ఏడు రకాల కూరలు వడ్డించాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో 273 ప్రభుత్వ హాస్టళ్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖలకు చెందిన హాస్టళ్లు మొత్తం 273 ఉన్నాయి. ఈ హాస్టళ్లల్లో మొత్తం 23వేల మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. అందులో సూర్యాపేట జిల్లా పరిధిలో 81 హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లు 36 ఉండ గా, ప్రీమెట్రిక్ హాస్టళ్లు 30, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు ఆరు ఉన్నాయి. ఈ హాస్టళ్లల్లో సుమారు 2,900 మంది విద్యార్థులు వసతి పొందున్నారు. అదే విధంగా బీసీ హాస్టళ్లు 24 ఉన్నాయి. అందులో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 15, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు 9 ఉన్నాయి. ఈ హాస్టళ్లల్లో సుమారు 2,500 మంది విద్యార్థులు వసతి పొందున్నారు. దీంతో పాటు ఎస్టీ హాస్టళ్లు 21 ఉన్నాయి. అందులో ప్రీమెట్రిక్ 13, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు 8 ఉన్నాయి. వీటిలో సుమారు 2,800 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 60 ఉండగా, అందులో 4,700 మంది విద్యార్థులు, ఎస్టీ హాస్టళ్లు 42 ఉండగా, అందులో 5వేల మంది, బీసీ హాస్టళ్లు 46 ఉండగా అందులో 2,200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. యాదాద్రి జిల్లాలో బీసీ హాస్టళ్లు 15 ఉండగా, అందులో 972 మంది విద్యార్థులు, ఎస్సీ హాస్టళ్లు 21 ఉండగా 1,462 మంది, ఎస్టీ హాస్టళ్లు 8 ఉండగా, 570 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
గురుకులాల్లో కాస్త మెరుగు
ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు విషయంలో గురుకుల విద్యాలయాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గురుకులాలకు ఆహారం అందించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. రోజు వారీగా విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాల్సిన కూరగాయలు, కిరాణ సరుకులు, పండ్లు, చికెన్, మటన్, గుడ్లు, పాలు వంటి వాటిని ఈ కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వచ్చిన సరుకులు, కూరగాయలను విద్యార్థులకు వండి పెట్టే పనిని కూడా ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పగించింది. దీంతో అక్కడ నూతన మెనూ అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవు.
కలెక్టర్లకు వినతి
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన మెనూ అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ వార్డెన్లు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశారు. అంతేగాకుండా ధరలు, గ్రాములు ప్రకటించకుండా మెనూ అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొందరు సంక్షేమాధికారులు వార్డెన్లపై ఒత్తిడి తెస్తున్నారని కలెక్టర్లకు వివరించారు. తమపై వెంటనే ఒత్తిళ్లను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: లత, సూర్యాపేట జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి
ప్రభుత్వ హాస్టళ్లలో నూతన మెనూ అమలు విషయంలో వార్డెన్లు ఇప్పటికే కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుత ధరలతో నూతన మెనూ అమలు చేయడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు పాత మెనూనే అమలు చేస్తున్నాం. వార్డెన్లపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదు.
ధరల ప్రకారం మెనూ సిద్ధం చేయాలి: ఎం.సైదులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రస్తుత మార్కెట్ ధరలను పరిశీలించి నూతన మెనూను సిద్ధం చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ఇప్పటి ధరలతో అమలు చేయడం సాఽధ్యం కావడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నాం. ప్రభుత్వం ధరలు, గ్రాముల వివరాలు ప్రకటించాలి. బీసీ వెల్ఫేర్ కమిషనర్ ఇటీవల తయారు చేసిన మెనూను ప్రస్తుతం అమలు చేస్తున్నాం. నూతన మెనూ అమలు విషయంలో వార్డెన్లపై ఒత్తిడి తగ్గించాలి. అదే విధంగా హాస్టల్ ట్యూటర్లకు నెలకు కనీసం రూ.6వేల వేతనంగా అందించాలి.