బేతవోలులో ముగిసిన చెరువు అలుగు వివాదం
ABN , Publish Date - Feb 03 , 2024 | 11:05 PM
మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది.
చిలుకూరు, ఫిబ్రవరి 3 : మండలంలోని బేతవోలు వీర్లదేవి చెరువు అలుగు వివాదం శనివారం ముగిసింది. చెరువు అలుగును గత ఏడాది ఆగస్టు 1వ తేదీన కొందరు కూల్చివేశారు. ఆ రోజు నుంచి చెరువు అలుగు నిర్మించడంలో జాప్యం చేయడంతో వివాదం నెలకొంది. చెరువు కింది రైతులు అలుగు నిర్మించాలని కోరుతుండగా, చెరువు మునక భూముల్లో పంటలు పండించుకునే రైతులు చెరువు అలుగు ఎత్తు తగ్గించాలని వాగ్వాదానికి దిగారు. అయితే వేసవిలో చెరువు ఆయకట్టు భూములకు హుజూర్‌నగర్ పట్టణానికి మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని, చెరువు అలుగు నిర్మించి నీటిని నిల్వ చేయాలని గ్రామస్థులు కోరారు. ప్రస్తుతం సాగర్ ప్రధాన కాల్వ నుంచి బేతవోలు చెరువును నింపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ చెరువు అలుగు నిర్మించాలని శనివారం వీర్లదేవి చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు అలుగు పనులు ప్రారంభించడంతో అలుగు ఎత్తు విషయమై చెరువు కింద రైతులకు, చెరువు పైన మునక భూములను పండించుకుంటున్న రైతులకు మధ్య వివాదం మొదలైంది. అయితే బేతవోలు చెరువు వద్దకు చేరుకున్న ఎస్‌ఐ చల్లా శ్రీనివాస్, ఏఎ్‌సఐ పులి వెంకటేశ్వర్లు, ఇరిగేషన డీఈ స్వప్న, ఏఈ మానసలు రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి చెరువు అలుగు నిర్మించాలని తీర్మానించారు. దీంతో కొద్దిరోజులుగా నెలకొన్న వీర్లదేవిచెరువు అలుగు వివాదానికి తెరపడింది. చెరువు అలుగును అక్రమంగా తొలగించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, చెరువు అలుగు జోలికి రైతులు ఎవరూ వెళ్లవద్దని ఇరిగేషన, పోలీస్ అధికారులు రైతులను హెచ్చరించారు.