రెండు రోజులకో దొంగతనం
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:58 PM
వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు నెలల కాలంలో 38 చోరీలు జరిగాయి. జిల్లాలో రెండు నెలల్లో సరాసరిగా రెండు రోజులకు ఒకటి చొప్పున చోరీలు జరగ్గా, రూ.70 లక్షల సొత్తు అపహరణకు గురైంది.
60 రోజుల్లో 38 చోరీలు - రూ.70 లక్షల సొత్తు అపహరణ
చోద్యం చూస్తున్న పోలీసులు - పనిచేయని సీసీ కెమెరాలు
సూర్యాపేటక్రైం, జనవరి 29 : వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు నెలల కాలంలో 38 చోరీలు జరిగాయి. జిల్లాలో రెండు నెలల్లో సరాసరిగా రెండు రోజులకు ఒకటి చొప్పున చోరీలు జరగ్గా, రూ.70 లక్షల సొత్తు అపహరణకు గురైంది. దీంతో తాళం వేసి ఎక్కడికి వెళ్లాలన్నా భయపడాల్సి వస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌కాలనీలో జలగం కళమ్మ శనివారం రాత్రి తాళం వేసి స్థానిక బంధువుల ఇంటికి వెళ్లింది. వచ్చి చూసే సరికి చోరీ జరిగింది. సుమారు రూ.లక్ష విలువైన వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా చైనస్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.
జిల్లాలోని అన్నిప్రాంతాల్లోనూ చోరీలు మామూలయ్యాయి. కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌లలో పలు నివాసాల్లో చోరీలు జరిగి లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంతనగదు అపహరణకు గురైంది. గతేడాది డిసెంబరు 1 నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 38 చోరీలు జరగగా సుమారు రూ.70లక్షల మేర సొమ్ము అపహరణకు గురైంది. జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన చోరీలో సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. అదేవిధంగా శ్రీశ్రీనగర్‌కాలనీ, క్రిష్ణానగర్ కాలనీలోని మూడు నివాసాల్లో ఒకే రోజు దొంగలు పడ్డారు. వీటితో పాటు శ్రీరాంనగర్‌కాలనీ, విద్యానగర్‌లో కూడా తాళం వేసి ఉన్న నివాసాల్లో చోరీలు జరిగాయి. వీటితో పాటు పెనపహాడ్, మేళ్లచెర్వు, చివ్వెంల, కోదాడ పట్టణం, హుజూర్‌నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల పరిధిలో ఇటీవల చోరీలు జరిగాయి. ఆయా చోరీలకు సంబంధించి పోలీసులు ఎవరినీ పట్టుకోలేదు. గతేడాది డిసెంబరులో జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ న్యాయవాది నివాసంలో దొంగలు చోరీకి పాల్పడి ఇంట్లోని సుమారు రూ.4లక్షల నగదు, ఆరు వేల అమెరికా డాలర్లు, పది తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలోని ఉపాధ్యాయుడి నివాసంలో దొంగలు సుమారు రూ.10 లక్షల విలువ చేసే 17తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా వజ్ర టౌనషి్‌పలో జరిగిన చోరీలో సుమారు 5తులాల వెండి, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఇలా జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట చోరీ జరుగుతూనే ఉంది.
ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే భయం
జిల్లాలో ప్రజలు ఇంటికి తాళం వేసి పనినిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇతర ప్రాంతం నుంచి ఇంటికి వచ్చేలోపు చోరీ జరుగుతోంది. కొంతమంది చోరీలకు భయపడి వివిధ బ్యాంకుల్లో డబ్బులు వెచ్చించి లాకర్లు తీసుకుని విలువైన ఆభరణాలను భద్రపర్చుకుంటున్నారు.
పోలీసు నిఘా కరువు
పోలీసుల నిర్లక్ష్య వైఖరి దొంగతనాలకు ఆస్కారం ఇస్తుందన్న ఆరోపణలుఉన్నాయి. చోరీలకు సంబంధించి కొన్నిచోట్ల ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. అంతేకాక కేసు కూడా నమోదుచేయడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో బాధితులను వివిధరకాల ప్రశ్నలు వేసి ఫిర్యాదు చేయకుండా చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. గతేడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎక్కువగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో చోరీలు విపరీతంగా పెరిగాయి. విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న పోలీసులు చోరీలకు పాల్పడిన వారిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. నిత్యం ఉదయం, రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేయాల్సి ఉంది. కానీ వివిధ రకాల విధులు, సిబ్బ ంది కొరత కారణంగా పెట్రోలింగ్ సరిగా చేయడం లేదు. పలువురు పోలీస్ అధికారులు పోలీ్‌సస్టేషన్లలో తక్కువ సమయం కేటాయిస్తూ వారి సొంత పనులకు సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,500 సీసీటీవీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. వీటిలో కొన్ని మరమ్మతుకు గురైతే వాటిని పట్టించుకోవడం లేదు. సీసీటీవీ కెమెరాలు పనిచేస్తే నేరాల చేధన సులభమవుతోంది. ఇదిలా ఉండగా చోరీలను అరికట్టడానికి ఎస్పీ రాహుల్‌హెగ్డే జిల్లాలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. చోరీలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, జరిగిన చోరీ కేసులను త్వరగా చేధించాలని ఆదేశించారు.
దొంగలను పట్టుకుంటాం
చోరీలకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటాం. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితుల వివరాలు విధిగా పోలీసులకు అందించాలి.సీసీటీవీ కెమెరాలు పనిచేసేటట్లు చూస్తాం. చోరీకి గురైన సొమ్మును తిరిగి రాబడతాం. అవసరమైన చోట్ల సిబ్బందిని నియమిస్తాం. పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం.
- రాహుల్ హెగ్డే, ఎస్పీ