Share News

నేడు మృగశిర కార్తె

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:43 PM

మృగశిర కార్తె శనివారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజున చేపలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమని ప్రజల నమ్మకం. శుక్రవారం అన్ని వర్గాల ప్రజలు స్థోమతకు తగినట్టు మార్కెట్లలో చేపలను కొనుగోలు చేశారు.

నేడు మృగశిర కార్తె

ముమ్మరంగా చేపల విక్రయాలు

నల్లగొండ కల్చరల్‌, జూన్‌ 7: మృగశిర కార్తె శనివారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజున చేపలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమని ప్రజల నమ్మకం. శుక్రవారం అన్ని వర్గాల ప్రజలు స్థోమతకు తగినట్టు మార్కెట్లలో చేపలను కొనుగోలు చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారులు సైతం పెద్దమొత్తంలో చేపలను ఇప్పటికే దిగుమతి చేసుకుని నిల్వ చేశారు. చేపలకు డిమాండ్‌ ఏర్పడటంతో ధర కూడా పెంచి విక్రయిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌, పానగల్‌ బైపాస్‌ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, బస్టాండ్‌, రామగిరి, హైదరాబాద్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రహదారుల వెంట చేపలను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌, మోత్కూరు, తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా జరిగాయి. బొచ్చ, రవ్వ కిలో రూ.180 నుంచి రూ.200వరకు, పాంప్లెట్లు చిన్న సైజువి రూ.50 నుంచి రూ.60 వరకు, పెద్దసైజువి రూ.80 నుంచి రూ.100 వరకు, బురదమట్టలు రూ.400 నుంచి రూ.450 వరకు, కొర్రమేను రూ.500 నుంచి రూ.700 వరకు, రొయ్యలు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో చెరువుల్లో చేపల పెంపకం తగ్గింది. దీంతో చేపల ఉత్పత్తి కూడా కొద్దిగా తగ్గింది. నల్లగొండ జిల్లాకు తుమ్మలగూడెం, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, పానగల్లు ఉదయసముద్రం, నాగార్జునసాగర్‌, డిండి, మూసీ తదితర చెరువులతో పాటు గుంటూరు, బాపట్ల, తెనాలి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు చేపలను దిగుమతి చేసుకున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:43 PM