Share News

టోకెన్లు షురూ

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:04 AM

జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. వానాకాలంలో రైతులు ఎక్కువగా సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు. కొంతమేర మాత్రమే దొడ్డురకం ధాన్యం సాగైంది.

టోకెన్లు షురూ

మిర్యాలగూడ మిల్లులకు ధాన్యం తరలించేందుకు టోకెన్‌ విధానం

రోజుకు 900 టోకెన్లు జారీ చేయనున్న వ్యవసాయశాఖాధికారులు

ఇది ఉంటేనే మిల్లుల్లో ధాన్యం కొనుగోలు

మిల్లుల వద్ద రద్దీ పెరగకుండా అధికారుల చర్యలు

సూర్యాపేట(కలెక్టరేట్‌), నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. వానాకాలంలో రైతులు ఎక్కువగా సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు. కొంతమేర మాత్రమే దొడ్డురకం ధాన్యం సాగైంది. అయితే ప్రభు త్వం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి దొడ్డు రకంతో పాటు సన్నరకం ధాన్యా న్ని కొనుగోలు చేస్తోంది.సన్నరకం ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.2,3 20 తో పాటు అదనంగా రూ.500 బోనస్‌ కూడా ఇస్తోంది. అయినా జిల్లా రైతులు మిర్యాలగూడలోని రైస్‌మిల్లులకు సన్నరకం ధాన్యం విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోని రైస్‌ మిల్లుల వద్ద ఏర్పడుతున్న రద్దీని నివారించేందుకు అధికారులు టోకెన్‌ విధానాన్ని అమలుచేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే తే మ శాతం 17లోపు ఉండాలి. తేమశాతం 17 రావాలంటే సన్నరకం ధాన్యాన్ని కనీసం 10రోజుల పాటు ఆరబెట్టాలి. అంతేగాక ఆరబెట్టిన ధాన్యం తూకం తక్కువగా వస్తుంది. ఈ లోగా వర్షం వస్తే ధాన్యం తడుస్తుందనే భయంతో రైతులు యంత్రాల ద్వారా వరి నూర్పిడి చేసి నేరుగా పొలాల నుంచే ట్రాక్టర్లలో మిర్యాలగూడ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. సన్నరకం ధాన్యానికి మిల్లుల వద్ద క్వింటాకు రూ.2,200 నుంచి రూ.2400 వరకు ధర వస్తోంది. పచ్చి ధాన్యం కావడంతో తూకం కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపడంల లేదు. దీంతో మిర్యాలగూడెంలోని మిల్లుల వద్ద రద్దీ పెరిగి దిగుమతులు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లాలో అధికారులు సన్నరకం ధాన్యం విక్రయించే రైతులకు టోకెన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ధాన్యం విక్రయించాలంటే టోకెన్‌ తప్పనిసరి

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రైస్‌ మిల్లులకు సన్నరకం ధాన్యం తరలించాలంటే కచ్చితంగా టోకెన్‌ ఉండాల్సిందే. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా సన్నరకం ధాన్యం సాగైంది. రైతులంతా ఒకేసారి పంటల నూర్పిడి చేసి మిర్యాలగూడ మిల్లులకు తరలిస్తుండటంతో అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ధాన్యం లారీలు బారులుతీరాయి. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సూర్యాపేట జిల్లాలోని రైతులు సన్నరకం ధాన్యాన్ని మిర్యాలగూడలో విక్రయించేందుకు ప్రతీ రోజు 900 ట్రాక్టర్లకు టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు సూర్యాపేట వ్యవసాయశాఖాధికారులు రైతులకు అందజేస్తున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలోని రైతులు వారి పాస్‌బుక్‌ వెంట తీసుకుని నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి వద్ద ఉన్న వ్యవసాయ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులకు చూపితే టోకెన్లు ఇస్తారు. సూర్యాపేట నియోజకవర్గంలోని రైతులు సూర్యాపేటలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్లు తీసుకోవాలి. టోకెన్‌ లేని ధాన్యం వాహనాలను చెక్‌పోస్టు వద్ద అధికారులు నిలివేస్తున్నారు.

రద్దీ పెరగడంతోనే: శ్రీధర్‌రెడ్డి, డీఏవో

రైతులు ఒకేసారి పెద్ద ఎత్తున సన్నరకం ధాన్యాన్ని విక్రయించేందుకు మిర్యాలగూడలోని మిల్లుల వద్దకు వెళ్తుండడంతో, అక్కడ దిగుమతులు కాక ఇబ్బందులు పడుతున్నారు. సన్నరకం ధాన్యాన్ని ఆరబెట్టి 17శాతం తేమతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు మద్దతు ధర రూ.2320తో పాటు అదనంగా బోనస్‌ రూ.500 కలిపి మొత్తం రూ.2,820 ధర పొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాక సన్నరకం ధాన్యాన్ని నిల్వ చేసి మూడు నుంచి నాలుగు నెలల్లో క్వింటా రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయించవచ్చు. గత ఏడాది నిల్వ చేసిన రైతులకు అధిక ధర లభించింది. రైతులంతా ఒకేసారి పంట నూర్పిడి చేయకుండా కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలి.

చిల్లేపల్లి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌

నేరేడుచర్ల, నవంబరు 14: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలోని మిల్లుల్లో ధాన్యం విక్రయించేందుకు వెళ్లే వాహనాలు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి టోల్‌ప్లాజా వద్ద పెద్ద సంఖ్యలో నిలిచాయి. మిర్యాలగూడ మిల్లుల్లో రైతులు ధాన్యం విక్రయించేందుకు అవసరమైన టోకెన్లను గురువారం ఉదయం నుంచి వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చిల్లేపల్లి టోల్‌ప్లాజా వద్ద జారీ చేశారు. సూర్యాపేట, పెన్‌పహాడ్‌, హుజూర్‌నగర్‌, గరిడేపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల మండలాల నుంచి సుమారు 1,000 ట్రాక్టర్లు ధాన్యం లోడుతో రావడంతో రహదారిపై వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. చిల్లేపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆరు వరుసల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ట్రాఫిక్‌ జాం కొనసాగింది. ఇదే సమయంలో ట్రాక్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటు ఓ లారీ చిల్లేపల్లి మూసీ వంతెనపై నిలిచిపోవడం మరింత ఇబ్బందిని కలిగించింది.

Updated Date - Nov 15 , 2024 | 01:04 AM