తండ్రి మరణం తట్టుకోలేక తనయుడి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:45 AM
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ తనయుడు తనువు చాలించాడు. ఓ వైపు తండ్రి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో శుక్రవారం జరిగింది.
ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు
సంస్థాననారాయణపురం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ తనయుడు తనువు చాలించాడు. ఓ వైపు తండ్రి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములు(75) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు. రాములుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడి వివాహం జరిగింది. చిన్న కుమారుడు శ్రీశైలం(40)కు పెళ్లి కాలేదు. ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి రాములు అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. తండ్రి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం స్వగ్రామంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తండ్రి మరణంతో శ్రీశైలం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఓవైపు తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఇంట్లోనుంచి బయటికి వెళ్లిపోయాడు. చివరి క్షణంలో శ్రీశైలం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులంతా చుట్టుపక్కల వెతికారు. తమ వ్యవసాయ బావి పక్కనే ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రీకుమారులిద్దరి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తండ్రీకుమారుల అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రీ కొడుకుల మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.