నేటి నుంచియూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:32 AM
టీఎస్ యూటీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక మహాసభలకు రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన ప్రాంగణంలో 28,29,30 తేదీల్లో మూడు రోజులపాటు ఈమహాసభలు జరగనున్నాయి.
నల్లగొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతిప్రతినిధి):టీఎస్ యూటీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక మహాసభలకు రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన ప్రాంగణంలో 28,29,30 తేదీల్లో మూడు రోజులపాటు ఈమహాసభలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎ్‌ఫసభ్యులు, నాయకులు ఈసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే నల్లగొండకు చేరుకున్నారు.
మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం లో యూటీఎఫ్ పతాకాలు, తోరణాలు కట్టారు. ఆహ్వానసంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు ఈ సభల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. సభల తొలి రోజు ఉద యం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో నల్లగొండలో మహాప్రదర్శన నిర్వహించనున్నారు. 11 గంటలకు ప్రారంభమయ్యే సభకు ముఖ్యఅతిథులుగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారు. అంతేగాక సభలో ఎంపీలు కుం దూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ.నరసింహారెడ్డి కూడా ప్రారంభ సభ కు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి మొదలయ్యే విద్యాసదస్సులో మాజీ ఎమ్మెల్సీ ప్రొ ఫెసర్ నాగేశ్వర్ ‘భారత ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ప్రజలు’ అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ ఎడిటర్ డాక్టర్ కె.శ్రీనివాస్ ‘విద్యలో రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై, ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ సంయుక్త కార్యదర్శి అయిషీ ఘోష్ ‘జాతీయ విద్యావిధానం- ప్రభుత్వ విద్యపై ప్రభావం’ అనే అంశంపై మాట్లాడరున్నారు. సాయంత్రం 6గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలకు సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ హాజరుకానున్నారు. రెండో రోజు 29న ఉదయం మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య ప్రసంగించనున్నారు. ప్రతినిధుల సభలో పలు కమిటీల నివేదికలను సమర్పిస్తారు. 30న జరిగే ప్రతినిధుల సభలో నివేదికలపై చర్చతో పాటు జిల్లాల నివేదికలు, తీర్మానాలు, కర్తవ్యాలపై చర్చిస్తారు. అదే రోజు మధ్యాహ్నం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకొని సాయంత్రానికి మహాసభలను ముగిస్తారు.
విద్యారంగ సమస్యలపై చర్చ
నల్లగొండలో మూడురోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి మహాసభల్లో విద్యారంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై చర్చించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, వాటి ద్వారానే నాణ్యమైన విద్యనందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మహాసభల్లో చర్చించి, తీర్మానిస్తారు. అదే విధంగా ఉపాధ్యాయుల సంక్షేమం, పెండింగ్ డీఏలు ఇతర సమస్యలపైనా చర్చించి ప్రభుత్వానికి సూచనలందజేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. యూటీఎఫ్ సమరశీల పోరాటాలతోనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దుకు నిర్ణయం తీసుకోవాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, పెండింగ్ డీఏలు విడుద చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా ఈ మహాసభల్లో మార్గనిర్దేశం చేస్తామని, రానున్న రెండేళ్లకు కార్యాచరణ కూడా రూపొందిస్తామని నిర్వాహకులు తెలిపారు.