Share News

వాహననం

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:31 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లాలో చివరగా ఉన్న కోదాడ మండలంలో పలు చౌరస్తాలు, మలుపులు ప్రమాదాలకు అలవాలంగా నిలుస్తున్నాయి.

వాహననం

రహదారిపైనే నిలుపుతున్న వాహనాలు

డ్రైవర్ల నిర్లక్ష్యంతో పోతున్న ప్రాణాలు

కోదాడరూరల్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లాలో చివరగా ఉన్న కోదాడ మండలంలో పలు చౌరస్తాలు, మలుపులు ప్రమాదాలకు అలవాలంగా నిలుస్తున్నాయి. రామాపురం క్రాస్‌రోడ్డు నుంచి కొమరబండ వరకు 15 కిలోమీటర్ల పరిధిలోని ఈ హైవేపై నవంబరు 20 నుంచి నెల వ్యవధిలో 13 ప్రమాదాలు జరగ్గా అందులో నలుగురు మృతి చెందారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎక్కువగా ప్రమాదాలు కొమరబండ-దుర్గాపురం రోడ్డు జంక్షన వద్ద జరుగుతున్నాయి. జాతీయ రహదారి నుంచి కోదాడకు వచ్చేందుకు అండర్‌పాస్‌ వంతెన లేకపోవడంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా రాత్రి సమయాల్లో జరుగుతున్నాయి. కొమరబండ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లాలంటే జాతీయరహదారిని దాటిల్సిన పరిస్థితి. విజయవాడ వైపు నుంచి కోదాడ పట్టణంలోకి రావాలంటే జాతీయ రహదారిని దాటాలి. ఈ క్రమంలో పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల దోరకుంట వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో ట్యాంకర్‌ పెద్దశబ్దాలతో పేలిపోయింది. దీంతో పక్కన వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హైవేపై పెట్రోలింగ్‌ వాహనాలు మచ్చుకు కూడా కనిపించడం లేదని వాహనదారులు తెలిపారు.

ఇదిలాఉండగా కొమరబండ, కట్టకొమ్మగూడెం బైపాస్‌, దుర్గాపురం, రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి.

చౌటుప్పల్‌ రూరల్‌ : హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రధాన మండలాల్లో యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం ఒకటి. ఈ మండల పరిధిలోని తుప్రానపేట నుంచి గుండ్లబావి వరకు 27కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉంది. రహదారి వెంబడి ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపైనే హోటళ్లు ఉండడం, టిఫిన, భోజనాల కోసం రోడ్డు పక్కన వాహనాలు నిలుపుతున్నారు. లింగోజిగూడెం, చౌటుప్పల్‌, ఎల్లగిరి, దండుమల్కాపురం ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువగా రోడ్లపైన నిలుపుతున్నారు. రోడ్డు పక్కన నిలిచి ఉన్న వాహనాలను వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలను గమనించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

కనిపించని పెట్రోలింగ్‌

చౌటుప్పల్‌ జాతీయ రహదారిపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెండు పెట్రోలింగ్‌ వాహనాలు ట్రాఫిక్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరో పెట్రోలింగ్‌ వాహనాలు జాతీయ రహదారికి తిరగడానికి కేటాయించారు. హైవేపై ఏదో ఒక చోట పెట్రోలింగ్‌ వాహనాలు నిలిపి తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్ల వెంట నిలిపిన డ్రైవర్లను చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

హైవే నిర్వహణ అస్తవ్యస్తం

కేతేపల్లి : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నిర్వహణ ఆరు నెలల నుంచి అస్తవ్యస్తంగా మారింది. 2011-12లో ఈ రహదారి విస్తరణ పనులు పూర్తి చేసిన జీఎమ్మార్‌ సంస్థ గత ఆరు నెలల క్రితం వరకూ ఈ రహదారిపై టోల్‌ వసూలు, రహదారి నిర్వహణ పనులు చూసేది. ఆరు నెలల క్రితం రహదారి నిర్వహణ, టోల్‌ వసూలు నుంచి జీఎమ్మార్‌ తప్పుకోవడంతో టోల్‌ వసూలు, రహదారి నిర్వహణలను ఎన్‌హెచ్‌ఏఐ వేర్వేరు సంస్థలకు తాత్కాలిక ప్రాతిపదికన అప్పగించింది. నాటి నుంచి ఈ హైవే నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో రహదారిపై ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలిపి వేస్తున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఏదైనా వాహనం పాడై రోడ్డుపై నిలిచిపోతే గతంలో హైవే పెట్రోలింగ్‌ వాహనం సదరు వాహనాన్ని రోడ్డు పక్కకు తరలించేది. ఇతర వాహనాలు దానికి ఢీకొని ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యలు తీసుకునేది.

ప్రస్తుతం అలాంటిదేమీ లేకపోవడంతో డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. హైవేపై డివైడర్ల వెంట, వైవే వెంట గల గ్రామాల్లోని సర్వీసు రోడ్లపైన పేరుకపోయిన ఇసుక, మట్టిని తొలగించే వారు సైతం లేకుండాపోయారు. దీంతో హైవే, గ్రామాల్లోని సర్వీసు రోడ్లు మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. హైవేపై ఎడమ వైపున ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు గల రోడ్డు పూర్తిగా మట్టితో నిండిపోయి బ్రైక్‌ వేస్తే వాహనాలు జారి పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే రహదారిపై ఇరువైపులా ప్రయాణించే వాహనాల హెడ్‌లైట్ల వెళుతూ రాత్రివేళల్లో ఎదుటి వాహనాలపై పడకుండా ఉండేందుకు హైవే మధ్యలో గల డివైడర్‌పై పెంచిన పూల మొక్కలకు నీరు పోసేవారు లేకపోవడంతో పెద్ద ఎత్తున మొక్కలు ఎండిపోతున్నాయి.

ఎక్కడపడితే అక్కడే

కోదాడ : కోదాడ- జడ్చర్ల రాష్ట్ర రహదారిపై అతివేగంతో కూడిన డ్రైవింగ్‌, రహదారిపై వాహనాలను నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చిలుకూరు మండలంలో బాలాజీనగర్‌ నుంచి ముక్త్యాల కాల్వ వరకు ఎనిమిది కిలోమీటర్ల హైవే ఉంది. కొత్తగా నిర్మించిన రహదారిపై డివైడర్‌ లేకపోవడం, డివైడర్లు, ప్రధానజంక్షన్ల వద్ద సూచిక బోర్డులు లేకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలంలో రాయినిగూడెం బ్రిడ్జి నుంచి ఎల్‌బీ నగర్‌ వరకు 14 కిలోమీటర్ల రహదారి ఉండగా ఈ ఏడాదిలో 23 ప్రమాదాలు జరగ్గా అందులో 11మంది చనిపోయారు. 15 మంది క్షతగాత్రులయ్యారు. ప్రధానంగా రాయినిగూడెం, అప్పన్నపేట, అప్పిరెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు, ఎల్బీనగర్‌ చౌరస్తాలో ప్రమాదాలు జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌ పరిధిలో నాలుగు ప్రమాదాలు జరగ్గా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అమ్మో...హైదరాబాద్‌-వరంగల్‌ హైవే

భువనగిరి టౌన: యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణ పరిధిలోని నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయరహదారి ప్రమాదాలకు నెలవుగా మారి ంది. ఈ ఏడాదిలో 29 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 11 మంది మృతి చెందారు. 40 మంది వరకు గాయపడ్డారు. సింగన్నగూడెం చౌరస్తా, రామకృష్ణాపురం క్రాస్‌రోడ్‌, రేణుక ఎల్లమ్మ, స్వర్ణగిరి ఆలయాల జంక్షన, డాల్ఫిన హోటల్‌ ప్రమాదాలకు కేంద్రాలుగా ఉన్నాయి. తాజాగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రహదారి పక్కనే పలు కారణాలతో ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేస్తుండడం, రాంగ్‌ డ్రైవింగ్‌ మితిమీరిన వేగం, తదితర కారణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దశలవారీగా పెట్రోలింగ్‌, నిర్వహిస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు.

ఒక్క మండలంలో ఏడాదిలో 9 మంది

వేములపల్లి: నల్లగొండ జిల్లా పరిధిలో నార్కట్‌పల్లి నుంచి దామరచర్ల మండలం వరకు విస్తరించి ఉన్న నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. సుమారు 92 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రోడ్డు నిర్మాణ సమయంలో మూలమలుపుల వద్ద, రహదారికి చేరుకొనే పలు రోడ్ల వద్ద సాంకేతిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో వేముపల్లి మండలంలో 18 ప్రమాదాలు చోటుచేసుకోగా 9 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - Dec 26 , 2024 | 12:31 AM