వికసిత్ భారత్ లక్ష్యం కావాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:08 AM
భారతదేశం 2047 నాటికి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని, అదే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆకాంక్షించారు. గురువారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు.
మహిళా సాధికారతతోనే భవిష్యత్ అభివృద్ధి
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
సూర్యాపేట(కలెక్టరేట్), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): భారతదేశం 2047 నాటికి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని, అదే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆకాంక్షించారు. గురువారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం సమావేశ మందిరంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 2021లో జిల్లాలో 73శాతంగా ఉన్న రక్తహీనతను ఈ ఏడాదికి 21శాతానికి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా రక్తహీనతను నివారించేందుకు ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛభారత్ అనేది కార్యక్రమం కాదని అదొక ఉద్యమమన్నారు. జిల్లాలో 475 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు ప్రకటించడం సంతోషకరమన్నారు. స్వచ్ఛభారత్‌లో అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలోని ప్రజలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో స్వయంసహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని, భవిష్యత్ అభివృద్ధి మహిళా సాధికారితపై ఆధారపడి ఉందన్నారు. మహిళల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు ఆర్థిక సాధికారత వస్తుందన్నారు. స్వయంశక్తితో ఉపాధి కల్పించుకుని విజయాలు సాధించిన మహిళలను సమాజానికి తెలియజేయాలని, అప్పుడే ఇతరులు వారిని స్ఫూర్తి తీసుకుని అభివృద్ధి చెందుతారన్నారు. జిల్లాలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. వారికి విద్యతో పాటు చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీపై అవగాహన కల్పిస్తే ఇంకా విజ్ఞానవంతులు అయ్యే అవకాశం ఉంటుందన్నారు.సమాజం అంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అన్నారు. ముందుగా కలెక్టరేట్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవానీశంకర్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, సూర్యాపేట, హుజూర్‌నగర్, తిరుమలగిరి మునిసిపల్ చైర్‌పర్సన్లు పెరుమాళ్ల అన్నపూర్ణ, అర్చన, అనసూర్య, కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు వెంకన్నయాదవ్ పాల్గొన్నారు.