సాగునీటి కోసం ఎదురుచూపు
ABN , Publish Date - Feb 08 , 2024 | 11:58 PM
సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-2 కింద చివరి ఆయకట్టు ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-2 కింద చివరి ఆయకట్టు ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. 20 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశలో సీఎంలుగా ఉన్న నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు రూ.1100 కోట్లతో ఎస్సారెస్పీ-2ను చేపట్టారు. 1.44 లక్షల ఎకరాల సాగు లక్ష్యంతో ఏర్పాటుచేసిన కాల్వలు పూర్తిగా ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో సుమారు 40 వేల ఎకరాలకు పైగా సాగునీరందడం లేదు. పదేళ్ల నుంచి కాల్వలకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా వారబంధీ పద్ధతిలో 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో చివరి భూములకు నీరందకక బీళ్లుగా మారుతున్నాయి.
_ (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)/అర్వపల్లి
ఎస్సీరెస్పీ మొదటి దశ కాల్వలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా, రెండవ దశ సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా మైలవరం సమీపంలోని లోయర్‌మానేరు నుంచి జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగుకు నీరు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాలోని ఎస్సారెస్పీ-2 పరిధిలోని తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని కాల్వలోకి మొదటి నీరు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి గ్రామసమీపంలోనే డీబీఎం-69, డీబీఎం-70 కాల్వలకు నీరు వెళ్తుంది. డీబీఎం-69 పరిధిలో తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు నీరందుతుండగా, డీబీఎం-70 ద్వారా నాగారం మండలానికి చేరుతుంది. అక్కడి నుంచి ఎస్సారెస్పీ-2 దశలోని ప్రధాన కాల్వ అయిన డీబీఎం-71కు నీటి మార్గం కొనసాగుతుంది.
మూడు నియోజకవర్గాల పరిధిలో 70 కిలోమీటర్లు
ఎస్సారెస్పీ-2 దశలో ప్రధాన కాల్వ డీబీఎం-71 పరిధి 70 కిలోమీటర్లు. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం, అర్వపల్లి మండలాలు, సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెనపహాడ్ మండలాలు, కోదాడ నియోజకవర్గ పరిధిలో మోతె మండలాల పరిధిలోని 192 గ్రామాల్లో ఈ కాల్వ కొనసాగుతుంది. వెలిశాల నుంచి మొదలైన జిల్లాలోని నడిగూడెం మండలం వరకు ఎస్సారెస్పీ-2 ఉంది. మొత్తం కాల్వ పరిధిలో చెరువులు, కుంటలు కలిపి 350లకుపైగా ఉన్నాయి.
సామర్ధ్యం కన్నా తక్కువగా నీటి విడుదల
కాల్వ తవ్విన సమయంలో 2,000 క్యూసెక్కులకు సరిపోయేలా ఏర్పాటుచేశారు. అయితే ఏనాడూ 1500 క్యూసెక్కులకు మించి నీటిని విడుదలచేసిన దాఖలాలు లేవు. గోదావరి నదీ పరివాహకంలో నీటి లభ్యత ఎక్కువ మోతాదులో ఉన్న సమయంలోనూ నీటి విడుదల 1500 క్యూసెక్కులు మించలేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీనికి తోడు రెండు దశాబ్దాల కింద తవ్విన కాల్వలు కావడంతో కాంక్రీట్ లైనింగ్ లేక 30 శాతం నీరంతా వృథాగా పోతోంది. మెయిన, ఉపకాల్వల్లో పిచ్చిచెట్లు మొలిచి, పూడికలతో పూడకపోయి అధ్వానంగా తయారయ్యాయి.
మంత్రులు పరిశీలనతో సరి!
ఎస్సారెస్పీ-2 పథకం కింద తుంగతుర్తి మండలంలోని రుద్రమచెరువు, వెంపటి చెరువు, గొట్టిపర్తి చెరువు, బండరామారం చెరువులను నీటి సామర్థ్యాన్ని పెంచి ప్రాజెక్టులుగా మార్చాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఈ మేరకు రుద్రమచెరువును రిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీ్‌షరావు ఒకసారి పరిశీలించారు. అదేవిధంగా కేతిరెడ్డి ఆనకట్టు కూడా ఒక టీఎంసీగా మార్చాలని ప్రతిపాదించినా ఆలోచన కార్యరూపం దాల్చలేదు.
తూతూ మంత్రంగా తూములు, లైనింగ్ మరమ్మతులు
శ్రీరాంసాగర్ మెయినకాల్వలు 150కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఏడేళ్ల కిందట రూ.12కోట్లతో నాగారం మండలం ఈటూరు నుంచి అర్వపల్లి మండలం గోపాల్‌రెడ్డినగర్ వరకు కాల్వల లైనింగ్ పనులు చేపట్టి వదిలేశారు. ఆరేళ్ల క్రితం రూ.2కోట్లతో 45 తూములకు మరమ్మతులు చేసినా శ్రీరాంసాగర్ నీరు విడుదల చేసినప్పుడల్లా ప్రతి ఏటా తుప్పుపట్టడంతో రైతులు తూములను ఎత్తేసమయంలో అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
చివరి భూములకు నీరేది?
గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయకట్టు చివరలో ఉన్న పెనపహాడ్, మోతె, చివ్వెంల మండలాలకు నీరందిన దాఖలాలు లేవు. వానాకాలం, యాసంగి పంటలకు నీరందిస్తున్నా సరిపోను విడుదల చేయడం లేదు. నడిగూడెం, చివ్వెంల, మద్దిరాల, నూతనకల్, మోతె, పెనపహాడ్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లోని చివరి భూములకు ఇంతవరకు నీరు అందిన దాఖలాలు లేవు. ఎస్సారెస్పీ అధికారులకు నీళ్లు అందడం లేదని రైతులు ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఈ నెల 5వ తేదీన నీటిని విడుదల చేసినప్పటికీ, 1500 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయడంతో గురువారం నాటికి సూర్యాపేట మండలం వరకు నీరు చేరుకున్నాయి.
ఆరేళ్లు గడిచినా...
శ్రీరాంసాగర్ 69, 70, 71 డీబీఎం మెయిన కాల్వలతో పాటు ఉపకాల్వలు పటిష్ఠతను కోల్పోయి అక్కడక్కడా అధ్వానంగా మారాయి. మెయిన, ఉపకాల్వల కోసం పునర్జీవన పథకం కింద రూ.300 కోట్ల ప్రతిపాదనలు రూపొందించి ఆరేళ్లు గడిచినా కాల్వల పునరుద్ధరణ పనులు నేటి వరకు మొదలుపెట్టలేదు. అర్వపల్లి రామన్నగూడెం ఉపకాల్వ గత ఏడాదిగా కంపచెట్లు పెరిగి, మట్టి పూడకపోయి 50శాతం మేర నీరు వృథా అయినా ఎవరూ పట్టించుకోలేదు. నేటికి ఆ కాల్వ పరిస్థితి అధ్వానంగా మారింది. అర్వపల్లి మండలంలో ఉపకాల్వలైన 8-ఎల్, 9-ఎల్, 10-ఎల్, 11-ఆర్, 12- ఎల్, 13-ఆర్, 14-ఎల్, 15-ఎల్, 16-ఆర్, మైనర్ ఉపకాల్వలు ఉన్నాయి. అర్వపల్లి మండలంలో కాసర్లపాడు గ్రామంలో 12 గొలుసుకట్టు చెరువులు ఉన్నా నేటి వరకు ఆ చెరువులకు నీరు అందడంలేదు. అయితే వీటికి ఉపకాల్వలు లేక చుట్టుపక్కల పొలాలకకు సాగునీరందడం లేదు.
కాల్వలకు లైనింగ్ పనులు చేపట్టాలి
శ్రీరాంసాగర్ రెండోదశ మెయిన కాల్వలకు, ఉప కాల్వలకు కాంక్రిట్ లైనింగ్ పనులు చేపట్టి నిరంతరం గోదావరి జలాలను అందించాలి. పూడిపోయిన కాల్వల్లో మరమత్తులు చేపట్టి పిచ్చి మొక్కలను తొలగించాలి. వారబందీ కాకుండా నిరంతరం నీటిని విడుదల చేయాలి.
- బైరబోయిన భూమయ్య, అర్వపల్లి రైతు
నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపాం
శ్రీరాంసాగర్ మెయిన కాల్వలు, ఉపకాల్వల్లో పూడిక తీత కోసం నాలుగేళ్ల క్రితమే నిధులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాలేదు. జిల్లాలో 300 చెరువులకు కాళేశ్వరం జలాలు అందిస్తున్నాం. శ్రీరాంసాగర్ కాల్వల పనుల కోసం రూ.350 కోట్లు ప్రతిపాదనలు పంపించాం. చివరి భూములకు నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
- సత్యనారాయణ, డీఈ