వార్డు ఆఫీసర్లు వచ్చేస్తున్నారు
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:22 AM
గ్రామాల్లో ప్రజలకు పాలనా పరమైన విధులను అందించేందుకు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. రెవెన్యూ పనులకు సం బంధించి ఆర్‌ఐలు, డీటీలు విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు180 మంది కేటాయింపు
వార్డుల్లో సమస్యల పరిష్కారంతోపాటు పన్నుల వసూళ్ల బాధ్యత
సమస్యలపై వార్డు ఆఫీసర్లను సంప్రదించాల్సిన ప్రజలు
సూర్యాపేట(కలెక్టరేట్), డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలకు పాలనా పరమైన విధులను అందించేందుకు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. రెవెన్యూ పనులకు సం బంధించి ఆర్‌ఐలు, డీటీలు విధులు నిర్వహిస్తున్నారు. మునిసిపాలిటీల్లో మాత్రం ప్రజలకు వా రి అవసరాల కోసం మునిసిపల్ కార్యాలయాల కు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. మునిసిపల్ కార్యాలయం నుంచే ప్రజలకు అవసరమై న సేవలు అందడంతోపాటు సమస్యల పరిష్కా రం లభిస్తుంది. కానీ ఇకనుంచి మునిసిపాలిటీల్లోని ప్రజలు మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లకుండానే వారు నివసిస్తున్న వార్డునుంచే వారి పనులను చక్కబెట్టుకోవచ్చు. అంతేకాకుండా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కూడా వార్డు ఆఫీసర్ల ద్వారా పరిష్కరించుకునే అవకాశం లభించింది. ప్రభుత్వం మునిసిపాలిటీల్లో ప్రజల కు పరిపాలనను చేరువ చేసేందుకు తాజాగా వార్డు ఆఫీసర్లను నియమించింది. మునిసిపల్ సేవలను మెరుగైన పర్యవేక్షణ, సమర్దవంతంగా అమలు చేయడంలో వార్డు ఆఫీసర్ల నియామ కం సహాయపడుతుందని ప్రభుత్వం భావించిం ది. అందుకోసం ఒక్కో వార్డుకు ఒక ఆఫీసర్‌ను కేటాయించనున్నారు. నూతనంగా నియమించిన ఆఫీసర్లు వారికి కేటాయించిన వార్డుల్లో ప్రతీరోజు పర్యటించి వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అందులో భా గంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీలకు 180మందిని ప్రభుత్వం కేటాయించింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 180 మంది వార్డు ఆఫీసర్లు
ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీలకు మొత్తం 180 మంది వార్డు ఆఫీసర్లను నియమించారు. నల్లగొండ జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీలుండగా 77మంది, సూర్యాపేట జిల్లాలో ఐదు మునిసిపాలిటీలుండగా 62 మంది, యాదాద్రి జిల్లాలో ఆరు మునిసిపాలిటీలకు 41మందిని కేటాయించారు. అయితే నల్లగొండ మునిసిపాలిటీకి 41 మంది, మిర్యాలగూడకు 22మంది, దేవరకొండకు నలుగురు, హాలియా, చిట్యాల, చండూరుకు ఒక్కొక్కరు, నకిరేకల్‌కు ఐదుగురు, నందికొండకు ఇద్దరిని కేటాయించారు. అదేవిధంగా సూర్యాపేట మునిసిపాలిటీకి 39 మం ది, కోదాడకు 12 మంది, హుజూర్‌నగర్‌కు 8 మంది, తిరుమలగిరికి ఇద్దరు, నేరేడుచర్లకు ఒక్కరిని కేటాయించారు. యాదాద్రి జిల్లాలో భువనగిరి మునిసిపాలిటీకి 23 మం ది, చౌటుప్పల్‌కు ఆరుగురు, యాదగిరిగుట్టకు ముగ్గురు, మోత్కూరుకు ముగ్గురు, ఆలేరుకు ముగ్గురు, భూధాన్‌పోచంపల్లికి ముగ్గురిని కేటాయించారు.
పన్నుల వసూళ్ల బాధ్యత
నూతనంగా మునిసిపాలిటీలకు కేటాయించబడిన వార్డు ఆఫీసర్లు వారికి కేటాయించిన వార్డుల్లో అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వార్డుల్లో ప్రతీ ఇంటికి వెళ్లి వారితో ఇంటి, నల్లా పన్నులు సకాలంలో వసూలు చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాల, వీధిలైట్ల నిర్వహణ, వార్డుల్లో నాటిన మొక్కల సంరక్షణ, కొత్తగా మొక్కలు నాటడం, తడిచెత్త, పొడి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్సుల జారీలాంటి వాటిపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. దీంతోపాటు వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ అధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కరింపచేయడం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. వార్డుల్లో ఎవరైనా ఏదైనా కారణంతో మరణిస్తే ఆ సమాచారాన్ని మునిసిపల్ అధికారులకు తెలియజేయడంలాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంది. వార్డుల్లో ప్రభుత్వం అందించే వివిధ రకాల పింఛన్ల అందజేతతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేసే ప్రతీ పథకాన్ని లబ్ధిదారులకు అందుతున్నాయా? లేవా? అనే విషయాలపై పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. వార్డుల్లో అంటువ్యాధుల నివారణ, నియంత్రణకోసం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
వార్డు ఆఫీసర్లను సంప్రదించాల్సిన ప్రజలు
మునిసిపాలిటీల్లోని ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకోసం ఇక నుంచి మునిసిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం నియామకం చేసిన వార్డు ఆఫీసర్ల దృష్టికి సమస్యలను తీసుకెళ్తే ఆ సమస్యల పరిష్కారంకోసం వార్డు ఆఫీసర్లు పని చేయనున్నారు. అంతేకాకుండా మునిసిపాలిటీల్లో ప్రజలకు వ్యక్తిగత పనులు ఉంటే కూడా వార్డు ఆఫీసర్ల ద్వారా సంబంధిత పనులను పూర్తి చేయించుకునే అవకాశం నెలకొంది.
ప్రభుత్వం వార్డు ఆఫీసర్లను కేటాయించింది: శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్, సూర్యాపేట.
ప్రభుత్వం ఇటీవల వార్డు ఆఫీసర్లను కేటాయించింది. సూర్యాపేటకు 39మందిని కేటాయించారు. వారికి త్వరలో వార్డులను కేటాయించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు అప్పగిస్తాం. వార్డు ఆఫీసర్లు వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు పన్నుల వసూళ్ల బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. కేటాయించిన వార్డులో అన్ని రకాల మునిసిపల్ పాలనాపరమైన సేవలను ప్రజలకు అందించాల్సి ఉంటుంది.