Share News

సిమెంటు పరిశ్రమను అడ్డుకుంటాం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:49 AM

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని, తరిమికొడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.

సిమెంటు పరిశ్రమను అడ్డుకుంటాం
ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంటే చూస్తామా..?

ఏకమై తరిమికొడతాం

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

భువనగిరి కలెక్టరేట్‌/భువనగిరి టౌన/ రామన్నపేట, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని, తరిమికొడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. రామన్నపేటలో నెలకొల్పుతున్న సిమెంటు ఫ్యాక్టరీని రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రాణాలైన అర్పించి అంబుజా సిమెంటు ఫ్యాక్టరీని ఆపేస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసే వరకు తిరుగుబాటు చేస్తామని అన్నారు. ఈసందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ రామన్నపేట పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని పలువురు రైతుల వద్ద గతంలో సుమారు 360 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నేడు ఆ రైతుల ప్రాణాలను మింగే పరిశ్రమ నిర్మిస్తామంటే ఊరుకోబోమన్నారు. వ్యవసాయం, కులవృత్తులపై ఆధారపడిన ప్రజలకు పరిశ్రమ ఏర్పాటుతో గాలి, నీరు కాలుష్యకారంగా మారి వ్యవసాయం జరగక ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఉపాధి కోల్పోయి ప్రజలు వలసలు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. జనావాసాలకు దూరంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా ఎటూ చుట్టు రెండు కిలో మీటర్ల పరిధిలో ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ దయతో భూముల దరలు పెరిగితే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎంతో మంది ఉపాధి దొరికిందని అన్నారు. ఫ్యాక్టరీని నిలుపుదల చేయకుంటే తిరుగుబాటు చేస్తామని జైలుకైనా వెళతామని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనివ్వబోమని హెచ్చరించారు. ప్రజాఆరోగ్యం కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామన్నారు. భువనగిరి మునిసిపల్‌ మాజీ చైర్మన ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు ఇట్టబోయిన గోపాల్‌, నర్సింహ, నాకోటి నగేశ, మల్లేశం, దయాకర్‌, బొక్క మాధవరెడ్డి, నకిరేకల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా వ్యతిరేకిద్దాం: అఖిలపక్షం

అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం బుధవారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను రాజకీయాలకతీతంగా వ్యతిరేకించి కాలుష్య పరిశ్రమను పారదోలాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పరిశ్రమ మూలంగా రామన్నపేట పర్యావరణ ప్రజారోగ్యం దెబ్బతిని భవిష్యత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మండల ప్రజలంతా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్ల అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, పర్యావరణ పరిరక్షణ వేదిక మండల కన్వీనర్‌ జెల్లెల పెంటయ్య, కోకన్వీనర్‌ ఎండీ.రేహన, అఖిలపక్ష నాయకులు పల్లపు దుర్గయ్య, ఊట్కూరి నరసింహ, బొడ్డుపల్లి వెంకటేశం, గోదాసు పృథ్విరాజ్‌, ఎండీ.ఫజల్‌బేగ్‌, జమీరుద్దీన, నకిరెకంటి నరేందర్‌, గూనిరాజు, హనుమంతు, గొరిగె సోములు పాల్గొన్నారు.

కాలుష్య కారక పరిశ్రమ వద్దు: సీఐటీయూ

ప్రజల ప్రాణాలను హరించే కాలుష్య కారక పరిశ్రమ వస్తే మా బతుకులకు ఉరే అంటూ సిమెంట్‌ పరిశ్రమ గేటు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో మంగళవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కాలుష్య కారక సిమెంట్‌ పరిశ్రమలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గొరిగే సోములు, గాదె నరేందర్‌, గాదె కృష్ణ, వంగాల మారయ్య, నకిరెకంటి రాము, మోటె అంజయ్య, ఏనుగ నరసింహ, రేగు అంజయ్య, గొరిగె మల్లేశం, రాసాల రమేష్‌, షానగండ వెంకటేశ్వర్లు, తరిగొప్పుల వెంకట్‌రెడ్డి, తన్నీరు దుర్గారావు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి సీపీఎం బహిరంగ లేఖ

రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రికి సీపీఎం బహిరంగ లేఖ రాసింది. ఈ మేరకు సీఎంకు రాసిన బహిరంగ లేఖను సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ మంగళవారం భువనగిరిలో విడుదల చేశారు. సిమెంట్‌ పరిశ్రమ ప్రజారోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలం జనావాసాలకు సమీపంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో వ్యవసాయ భూములపై ప్రభావం చూపుతుందని పాడి రైతుల జీవనాధారమైన పశువులకు గాసం దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో పరిసరాలు కలుషితమవుతాయని గురువారం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని లేఖలో సీఎంను కోరారు.

Updated Date - Oct 23 , 2024 | 12:49 AM