Share News

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 18 , 2024 | 11:46 PM

ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, నిల్వ ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
రాజాపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు

రాజాపేట, మే 18: ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, నిల్వ ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద రైతులు సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ఐకేపీ కేంద్రాలకు తరలించిన ధాన్యం అకాల వర్షంతో తడిసిందని, లారీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో చాలా రోజులుగా ఎదురుచూస్తున్నామని, నిర్వాహకులు పలు కారణాలు చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని అన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో రైతులు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, దాచపల్లి రాజు, మెండు భగవానరెడ్డి, దాచపల్లి శ్రీను, వీరస్వామి, నగేష్‌, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2024 | 11:46 PM