ఏం చదివారు? ఎలా చదువుతున్నారు?
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:30 AM
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
శాలిగౌరారం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వల్లాల, అడ్లూరు గ్రామాల్లోని పాఠశాలకు చెందిన పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు శనివారం వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. సుమారు 10 మంది విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడారు. విద్యార్థులచదువు గురించి ఆరా తీశారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ, తెలుగు ఉపాధ్యాయుడు కుక్కడపు శ్రీనివాస్ పిల్లల విద్యా ప్రమాణాల మీద తల్లిదండ్రులతో చర్చించారు. ఏం చదివారు, ఎలా చదువుతున్నారంటూ తల్లిదండ్రుల ముందే విద్యార్థులతో మాట్లాడారు. శనివారం రోజు సెలవు రోజు అయినప్పటికీ ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వాళ్ల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లల విద్యపై అవగాహన కల్పించి, ఆదర్శంగా నిలిచారు. సెలవు రోజుల్లోనూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు మధ్య స్నేహాభావాన్ని పెంపొందిస్తూ, విద్యార్థుల ప్రగతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా బాగుందని పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశంసించారు.